breaking news
Sadashiv Peta
-
నా డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చేస్తా: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ KA Paul మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని, అవినీతిని నిలదీస్తున్నందునే తనను కలవడానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని అంటున్నారాయన. సదాశివపేట పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేసి.. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరారాయన. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికే.. కేసీఆర్, కేటీఆర్‌లు మానవ హక్కులు కమిషన్ ఏర్పాటు చేయడం లేదు. ధరణి తీసుకువచ్చి మా ఛారిటీ భూములను లాక్కున్నాడు. కేసీఆర్‌ను కలవడానికి వెళితే నన్ను అడ్డుకున్నారు. అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్న అని భయపడి నన్ను కేసీఆర్ కలవలేదు అని అన్నారాయన. ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకటేనన్న ఆయన.. కేసీఆర్ మిత్రుడు కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడమే అందుకు నిదర్శమని చెప్పారు. అధికార బీఆర్ఎస్ తనను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారాయన. ‘‘నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాను. నా డబ్బు అంతా అమెరికాలో ఉండిపోయింది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తా’ అని చెప్పారాయన. గత 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందన్న కేఏపాల్.. వారం రోజుల్లో వాటికి చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్‌ను మానవ హక్కుల కమిషన్ గా తాను రికమండ్ చేస్తానని చెబుతూ.. లైవ్‌లోనే ఆయనకు ఫోన్ చేసి మరీ ‘మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉంటారా?’ అని అడిగారు. ప్రపంచ శాంతి మహాసభలకు ఆహ్వానించేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన కేఏ పాల్‌ను.. అపాయింట్మెంట్ లేదని చెబుతూ సెక్యూరిటీ గేట్ బయటే అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదీ చదవండి: బీజేపీ బలం సెన్సెక్స్ కాదు -
టీఆర్ఎస్కు మింగుడుపడని ఫలితాలు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్కు సోమవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మింగుడుపడటంలేదు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ ఫలితాలు ఆ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవటంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో బరిలోకి దిగిన ముఖ్యనాయకులు సైతం ఓటమి చవిచూడటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. తెలంగాణ సాధించిన ఊపులో ఉన్న తమ పార్టీకి పట్టణ ఓటర్లు పట్టం కడతారని పార్టీ నాయకత్వం భావించింది. అయితే రెండు మున్సిపాలిటీల్లో ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉంటాయోమోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలోలేకపోవటంతో పార్టీ అధిష్టానం స్థానిక నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపులో పొరపాట్లు, స్థానిక నాయకత్వం సక్రమంగా, పనిచేయకపోవటం, అంతర్గత విభేదాలు వల్లే ఆశించిన ఫలితాలు రాలేదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి మున్సిపాలిటీలో 31 వార్డులకుగాను పది నుంచి 15 స్థానాలు రావచ్చని టీఆర్ఎస్ నాయకత్వం భావించింది. అయితే ఫలితాల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే టీఆర్ఎస్ పరిమితమైంది. 28వార్డుల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా 20, 22 వార్డుల్లో మాత్రం అభ్యర్థులు గెలుపొందారు. మిగితా చోట్ల పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. పార్టీకి నుంచి బరిలో నిలిచిన మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ జలాలుద్దీన్‌బాబా, పట్టణ పార్టీ అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ సతీమణి మనోరంజని ఓటమిపాలయ్యారు. జలాలుద్దీన్‌బాబా ఇద్దరు సోదరీమణులు ఓడిపోయారు. సదాశివపేట మున్సిపాలిటీలో సైతం టీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. మున్సిపాలిటీలో 21 వార్డులకుగాను ఐదు వార్డుల్లో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సదాశివపేటలోనూ ఆశించిన ఫలితాలు రాకపోవటం పార్టీ నాయకులను నిరాశకలిగించింది. రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలకు ఫలితాలు మింగుడుపడని పరిస్థితి నెలకొంది.