breaking news
Rupee a kg rice
-
లారీ.. లారీ.. నడుమ దళారీ..!
మహారాష్ట్రకు అక్రమంగా తరలుతున్న రూపాయికి కిలో బియ్యం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి యథేచ్ఛగా స్మగ్లింగ్ చంద్రపూర్ , నాగ్‌పూర్‌కు నిత్యం వేల క్వింటాళ్ల తరలింపు ప్రతి గింజపై తినేవారి పేరు రాసి ఉంటుందని అంటారు.. నిరుపేదల పేరిట రాష్ట్ర సర్కారు సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యంపై మాత్రం సగ్లర్ల పేర్లు కనిపిస్తున్నాయి! పేదల కడుపు నింపాల్సిన ‘రూపాయికి కిలో బియ్యం’ అక్రమార్కుల జేబులు నింపుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి మహారాష్ట్రలోని అటుకుల మిల్లులకు, అప్పడాల పరిశ్రమలకు తరలుతోంది. ఇలా నిత్యం కనీసం 50 లారీల్లో సుమారు ఐదు వేల క్వింటాళ్ల బియ్యం అక్రమ రవాణా అవుతోంది. దీని విలువ దాదాపు రూ.1.20 కోట్లు! రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఏటా వందల కోట్ల విలువైన బియ్యం ఇలా అక్రమ రవాణా అవుతోంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న స్మగ్లింగ్‌పై ‘సాక్షి’ పరిశీలనలో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: బియ్యం దందా సరి‘హద్దులు’ దాటుతోంది. లారీలకు లారీల బియ్యం యథేచ్ఛగా మహారాష్ట్రకు చేరిపోతోంది. రోడ్డు మార్గమే కాదు.. అక్రమార్కులు రైలు మార్గాన్ని వదలకుండా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో అటుకుల మిల్లులు ఉన్నాయి. అలాగే నాగ్‌పూర్ ప్రాంతంలో అప్పడాల తయారీ వంటి సుమారు 30 రకాల వరి ఆధారిత ఆహార పరిశ్రమలున్నాయి. ఈ మిల్లులు, పరిశ్రమలకు మన రేషన్ బియ్యమే ప్రధాన ముడిసరుకుగా మారుతోంది. మంచిర్యాల నుంచి తరలిపోయే బియ్యం వాహనాలు చంద్రపూర్ జిల్లాలోని వీరూర్‌లో డంప్ అవుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం పది గంటలలోపే పదుల సంఖ్యలో తెలంగాణ నంబరు ప్లేట్లు ఉండే వాహనాలు దర్శనమిస్తాయి. వీరూర్ నుంచి గోందియా, నాగ్‌పూర్ పరిశ్రమలకు ఈ వాహనాలు వెళ్తున్నాయి. బియ్యం ఎలా సేకరిస్తున్నారు? పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలో ఏమాతం నాణ్యత ఉండటం లేదు. వీటి నాణ్యతను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకొస్తోంది. దీంతో మిల్లర్లు ఇచ్చిన సరుకును ఏమాత్రం పరిశీలించకుండా మండల స్థాయిలోని స్టాక్ పాయింట్ల(ఎంఎల్ఎస్)కు తరలిస్తున్నారు. అక్కడ్నుంచి రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ అవుతోంది. అయితే చాలామంది లబ్ధిదారులు దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడటం లేదు. నూక శాతం, మెరిగలు అధికంగా ఉండటం, బియ్యంలో రాళ్లు, తాలు గింజలు ఉండడంతో దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఇష్టపడటం లేదు. దీంతో ఈ బియ్యాన్ని కిలో రూ.6 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. పట్టణాల్లో కొన్ని చిన్నచిన్న కిరాణాషాపుల్లో ఈ బియ్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కొందరు చిరువ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ రోజుకు రెండు, మూడు క్వింటాళ్లు సేకరిస్తున్నారు. ఒక్కో క్వింటాలుపై రూ.400 నుంచి రూ.500 లాభంతో స్మగ్లర్లకు అమ్ముతున్నారు. చాలాచోట్ల డీలర్లే కొంత మొత్తాన్ని కార్డుదారులకు చెల్లించి ఆ బియ్యాన్ని తమ వద్ద ఉంచుకుని, స్మగ్లర్లకు విక్రయిస్తున్నారు. మొత్తమ్మీద క్వింటాలుకు రూ.1,000 నుంచి రూ.1,200 మధ్య కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు వాటిని మహారాష్ట్రకు తరలించి రూ.1,800 చొప్పున విక్రయిస్తున్నారు. రవాణా, ఇతర ఖర్చులు రూ.15 వేల వరకు పోయినా వంద క్వింటాళ్ల లోడు లారీపై స్మగ్లర్లు రూ.50 వేలకుపైగా ఆర్జిస్తున్నారు. రైలు మార్గమూ వదల్లేదు.. బియ్యం రవాణాకు అక్రమార్కులు రోడ్డు మార్గాన్నే కాదు.. రైలు మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు. వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చే రైళ్లలో నిత్యం వందల క్వింటాళ్ల బియ్యం మహారాష్ట్రకు తర లిపోతోంది. అర్ధరాత్రి వేళల్లో వచ్చే రామగిరి ఎక్స్‌ప్రెస్, భాగ్యనగర్, కాజీపేట్-ఆజిని వంటి రైళ్లలో బియ్యం రవాణా అవుతోంది. గ్రూపులు, గ్రూపు లుగా ఎక్కుతున్న వ్యాపారులు ఒక్కొక్కరు 2,3 క్వింటాళ్ల బియ్యాన్ని రైల్లో సీట్ల కింద ఉంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు దాడులు చేస్తే బియ్యం తమది కాదంటూ రైలు దిగి జారుకుంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది? ప్రభుత్వం కోట్లు వెచ్చించి పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నా పౌర సరఫరాల శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేష్టలుడిగి చూస్తోంది. ఈ విభాగంలోనే కొందరు అధికారులు.. స్మగ్లర్లతో చేతులు కలిపారనే ఆరోపణలున్నాయి. నిత్యావసరాలు పక్కదారి పట్టిస్తే పీడీ యాక్టు కింద కేసులు పెడతామంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. నిత్యావసరాలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్నవారిపై అధికారులు 6ఏ కేసులతో సరిపెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ అడుగు ముందుకేసి ఏడాది కాలంలో 20 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా.. ఫలితం లేకుండా పోతోంది. స్మగ్లింగ్ ఎలా జరుగుతోందంటే..? కరీంనగర్ జిల్లా గోదావరిఖని, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతం నుంచి సేకరించిన బియ్యాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట్, కాగజ్‌నగర్ పట్టణాల్లోని శివారు కాలనీల్లో గోదాములు, కొన్ని రైసు మిల్లుల్లో రహస్యంగా నిల్వ చేస్తున్నారు. ఇక్కడ్నుంచి వాంకిడి, సిర్పూర్(టి) మండలాల పరిధిలోని చెక్‌పోస్టుల గుండా సరిహద్దులు దాటిస్తున్నారు. చంద్రాపూర్ జిల్లా వీరూర్, నాగ్‌పూర్ వంటి పట్టణాలకు తరలిస్తున్నారు. తెల్లవారుజామున రెండు నుంచి నాలుగు గంటల మధ్య బయలుదేరుతున్న ఈ బియ్యం వాహనాలు.. రెండు, మూడు గంటల్లోనే సరిహద్దులు దాటుతున్నాయి. ఈ దందాలో మంచిర్యాలకు చెందిన ఓ వ్యాపారి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నిజామాబాద్ జిల్లాతోపాటు ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతంలో సేకరించిన బియ్యం.. నిజామాబాద్ కేంద్రంగా సరిహద్దులు దాటుతోంది. ఈ నగరానికి 30 నుంచి 40 కిలో మీటర్ల్లలోపే మహారాష్ట్ర సరిహద్దులు ఉండటం, పైగా అడ్డదారులు అనేకం కావడంతో దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ్నుంచి ధర్మాబాద్, నాందేడ్ ప్రాంతానికి బియ్యాన్ని తరలిస్తున్నారు. అయ్యో.. బియ్యం..! ⇒ ప్రస్తుతం రాష్ట్రంలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఏటా 18 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందుకు ఏటా రూ.2,200 కోట్లు వెచ్చిస్తోంది ⇒రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల్లో ఏటా 15 నుంచి 20శాతం వరకు పక్కదారి పడుతోంది. ఇందులో బియ్యం అక్రమాల విలువ రూ.150 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా ⇒గడిచిన నాలుగు నెలల్లో పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ కలిసి 2,899 దాడులు నిర్వహించాయి. ఇందులో 2,535 టన్నుల బియ్యం పట్టుబడింది. అయితే ఇంతకు రెండు, మూడింతల బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం. -
‘అన్న భాగ్య’ విస్తరణ
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ కింద రాగులు, జొన్నలు, గోధుమలను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. అక్టోబరు నుంచి చౌక దుకాణాల్లో వీటి పంపిణీ ప్రారంభమవుతుంది. రాగులు, జొన్నలు, గోధుమలు వద్దనుకున్న వారు బియ్యం తీసుకోవచ్చు. విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం జరిగింది. అనంతరం న్యాయశాఖ మంత్రి టీబీ. జయచంద్ర సమావేశం వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉత్తర కర్ణాటకలో అన్న భాగ్య కింద 10 కిలోల బియ్యం పొందుతున్న వారు ఇకపై నాలుగు కిలోల బియ్యం, రెండు కిలోల గోధుమ, నాలుగు కిలోల జొన్నలను తీసుకోవచ్చు. ఇరవై కిలోల బియ్యం తీసుకుంటున్న వారు 11 కిలోల బియ్యం, మూడు కిలోల గోధుమలు, ఆరు కిలోల జొన్నలను పొందవచ్చు. 30 కిలోల బియ్యం బదులుఐదు కిలోల గోధుమలు, ఎనిమిది కిలోల జొన్నలు, 15 కిలోల బియ్యం తీసుకోవచ్చు. దక్షిణ కర్ణాటకకు చెందిన వారికి జొన్నల స్థానంలో రాగులను అందిస్తారు. 10 కిలోల బియ్యం పొందే కుటుంబాలు కిలో గోధుమలు, రెండు కిలోల రాగులు, ఏడు కిలోల బియ్యం పొందవచ్చు. 20 కిలోల బియ్యం బదులు రెండు కిలోల గోధుమలు, మూడు కిలోల రాగులు, 15 కిలోల బియ్యం తీసుకోవచ్చు. 30 కిలోల బియ్యం బదులు మూడు కిలోల గోధుమలు, అయిదు కిలోల రాగులు, 22 కిలోల బియ్యం పొందవచ్చు. ఇతర నిర్ణయాలు = గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గోవధ నిషేధ ముసాయిదా బిల్లుల ఉపసంహరణ = బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ చార్జీల పెంపునకు అనుమతి = కోలారు వద్ద రైల్వే బోగీల తయారీ కర్మాగారం కోసం రాష్ట్ర వాటాగా రూ.100 కోట్ల విడుదలకు అంగీకారం. ప్రైవేట్ భూ సేకరణకు ఆదేశాలు.