breaking news
RTO check post
-
అక్రమ వసూళ్ల అనకొండ
పెనుకొండ చెక్‘పోస్టు’ రవాణాశాఖ అధికారులకు కాసులు కురిపించే కల్పతరువుగా మారుతోంది. పదేళ్లు కార్యాలయంలో పని చేయడం కన్నా ఏడాది ఈ చెక్‌పోస్ట్‌లో పని చేస్తే చాలన్న భావనలో అధికారులు ఉంటున్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడినా శాఖాపరమైన చర్యలు నామమాత్రంగా ఉంటుండడంతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని రెచ్చిపోతున్నారు. - పెనుకొండ చెక్‌పోస్టులో రోజుకు రూ.70 వేలకు పైగా అక్రమార్జన - ప్రైవేట్ వ్యక్తులతో వ్యవహారం అనంతపురం టౌన్ : జాతీయ రహదారిపై పెనుకొండ సమీపంలో ఉన్న ఆర్టీవో చెక్‌పోస్టులో అక్రమ వసూల్లు మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ శాఖకు చెందిన కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకూ వాటాలు ఉండడం వల్లనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందని తెలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు తమ వ్యక్తిగతంగా ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకొని వ్యవహారం చక్కబెడుతున్నారంటే రోజువారి అక్రమ ఆదాయం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము వీరి జేబుల్లో చేరుతోంది. వివరాల్లోకెళితే ఇక్కడి చెక్పోస్టుఅనంతపురం డిప్యూటీ కమిషనర్ నియంత్రణలో, హిందూపురం ఆర్టీఓ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), నలుగురు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికితోడు ప్రతి షిప్ట్లోనూ కానిస్టేబుళ్లు ఉంటారు. అధికారికంగా వీరు మాత్రమే ఇక్కడ ఉండగా అనధికారికంగా ప్రతి అధికారికి వ్యక్తిగతంగా ఓ ప్రైవేట్ వ్యక్తి పని చేస్తున్నాడు. వీరు తనిఖీ కేంద్రం వద్దకు వచ్చే వాహనదారులతో అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఓవర్లోడింగ్, రికార్డులు సరిగా లేనివి, ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ బస్సులు ఇలా ప్రతి వాహనదారుడి నుంచి వసూలు చేసిన మొత్తాన్ని గుట్టుచప్పుడు కాకుండా అధికారులకు చేస్తారు. ఇక్కడి నుంచి ఎవరు బదిలీ అయినా ప్రైవేట్ వ్యక్తులు మా త్రం ‘హెల్పిం డ్ హ్యాండ్స్’గా ఉంటూ అన్నీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఇది బహిరంగ రహస్యమే అయినా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై వారి చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులకు నెలవారీ వాటాలు : ఈ చెక్‌పోస్ట్ ద్వారా ప్రతి రోజూ రూ.లక్ష ఆదాయం రవాణా శాఖకు వస్తోంది. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా మరో రూ. 70 వేలకు పైగా వస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న అనధికారిక సొమ్మే ఇందుకు నిదర్శనం. ఏడాదికి సుమారు రూ. 3 కోట్ల వరకు అనధికారిక ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చెక్‌పోస్ట్‌లో పని చేసేందుకు అధికారులు ఉత్సాహం చూపుతుంటారని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. షరా‘మామూలే’ : చెక్‌పోస్ట్‌లో పట్టుబడుతున్న అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఏసీబీ అధికారులు నివేదికలు పంపుతున్నారు. అయితే అక్కడ రాజకీయ ఒత్తిళ్లతో ‘సరి’ చేసుకుంటుండడంతో వసూళ్ల దందా షరా‘మామూలు’గా సాగుతోంది. ఏసీబీ దా డులు జరిగిన కొద్ది రోజులు అక్రమ వసూళ్లకు విరామం ప్రకటిస్తారు. ఆ తర్వాత యథాప్రకారం వసూళ్ల పర్వానికి తెరతీస్తుంటారు. ప్రైవేట్ వ్యక్తులు హల్చల్ చేస్తున్నా ఉన్నతాధికారులు దృష్టిపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండున్నరేళ్లలో జరిగిన ఏసీబీ దాడుల వివరాలు.. - 2013 ఏప్రిల్ 3న ఏసీబీ దాడిలో అప్పటి ఏఎంవీఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ బాబయ్య, ప్రైవేట్ వ్యక్తులు రాము, శంకర్ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.1,33,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. - 2013 డిసెంబర్ 21న ఏఎంవీఐ సుబ్బరాయుడు, హాంగార్డు కిష్టప్ప, కానిస్టేబుల్ బాబయ్యతో పాటు ప్రైవేట్ వ్యక్తులు శంకర్, శివారెడ్డిలను అదుపులోకి తీసుకునిరూ.53,440 నగదు స్వాధీనం చేసుకున్నారు. - 2013 డిసెంబర్ 29న ఎంవీఐ ప్రసాద్, కానిస్టేబుల్ నాగభూషణ్, హోంగార్డు ఆదినారాయణ పట్టుబడ్డారు. రూ.37 వేలు స్వాధీనం చేసుకున్నారు - 2014 జనవరి 17న ఏఎంవీఐ సుబ్బరాయుడు, కానిస్టేబుల్ రవీంద్రరెడ్డి పట్టుబడ్డారు. రూ.39,055 నగదు స్వాధీనం చేసుకున్నారు. - 2014 జులై 27న ఎంవీఐ వరప్రసాద్, కానిస్టేబుల్ నరసింహులు, హోంగార్డు రాధాకృష్ణ పట్టుబడగా రూ.27,500 స్వాధీనం చేసుకున్నారు. - 2015 మార్చి 25న ఏఎంవీఐ నాగేంద్ర, హెడ్‌కానిస్టేబుల్ జాన్ మోజెస్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి రామును అదుపులోకి తీసుకుని రూ.77,800 సీజ్ చేశారు. - 2015 ఆగస్టు 13న అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడులు చేయగా ఎంవీఐ ప్రసాద్, చెక్‌పోస్ట్ సబార్డినేటర్ బాలాజీ, ప్రైవేట్ వ్యక్తి శివారెడ్డి పట్టుబడ్డారు. ఎంవీఐ రెస్ట్ రూం నుంచి రూ.15 వేలతో పాటు శివారెడ్డి నుంచి రూ.16,200 స్వాధీనం చేసుకుని రికార్డులు సీజ్ చేశారు. చెక్‌పోస్ట్ ఇన్చార్జ్, ఎంవీఐ మల్లికార్జునపై కూడా చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. -
చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు : నలుగురి అరెస్ట్
పెనుకొండ (అనంతపురం) : అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులు గురువారం అర్థరాత్రి దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించి.. సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.31,200 స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎంవీఐలు మల్లికార్జున, వై.ప్రసాద్, కార్యాలయ ఉద్యోగి బాలాజీతోపాటు ప్రైవేట్‌గా నియమించుకున్న శివారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
హైవేపై విజిలెన్స్ తనిఖీలు
తునిరూరల్ : తుని మండలం తేటగుంట ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. సోమవారం ఆర్టీఏ, అగ్రికల్చరల్ మార్కెట్, రెవెన్యూశాఖ అధికారులతో కలిసి విజిలెన్సు అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులు, వేబిల్లులు, ఎగుమతి, దిగమతి చేసే సరుకులను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు. జరిమానాల రూపంలో రూ.రెండు లక్షల ఆదాయం లభించిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
ఆర్టీవో ఉద్యోగిపై దూసుకెళ్లిన లారీ
-
ఆర్టీవో ఉద్యోగిపై దూసుకెళ్లిన లారీ, మృతి
తిరుపతి: రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్ వద్ద సోమవారం దారుణం జరిగింది. ఓ ఆర్టీవో ఉద్యోగిపై లారీ దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతిచెందాడు. తనిఖీ కోసం ఓ లారీని ఆపడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా చెక్ పోస్టు దగ్గర లారీని తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా, లారీ డ్రైవర్ ఢీకొట్టాడు.లారీ డ్రైవర్ ఘాతుకానికి ఆ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు సాంబ ఆర్టీవో చెక్ పోస్టు దగ్గర కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆర్టీవో ఉద్యోగిపై దూసుకెళ్లిన లారీ ఎర్రచందనానికి సంబంధించినది కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీ కోసం పోలీసులు కాగా, సాంబ మృతిపై న్యాయం చేయాలని రేణిగుంట చెక్ పోస్టు వద్ద బాధితులు ధర్నాకు దిగారు. దాంతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.