breaking news
RTC EMPLOYES UNION
-
జగన్ హామీపై ఆర్టీసీ సంఘాల హర్షం
సాక్షి, ఏలూరు టౌన్ : నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీని తాను అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని అనంతపురం మడకశిర బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వటం పట్ల ఆ వర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆళ్ల నానికి ఆర్టీసీ సంఘాల నేతలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాద్, ఎన్ఎంయూ ఏలూరు డిపో గౌరవాధ్యక్షులు ఎంఆర్డీ బలరాం, రిటైర్డ్ యూనియన్ నాయకులు ఆళ్ల నానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రావూరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 55 వేల ఆర్టీసీ కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా మేలు చేసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థ ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా నష్టాల్లో ఉందని, ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేస్తామనే నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మిక కుటుంబాలు వైఎస్ జగన్ వెంటే ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంవీఆర్‌ఆర్ కుమార్, బసవరాజు, కె.పాండు, జీపీఆర్ ప్రసాద్, ఎంవీఆర్‌ఎం రావు, బెనర్జీ తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ కార్మికుల్లో చిరునవ్వులు నింపుతాం
ఆర్టీసీ ఈయూ నేతలకు వైఎస్ జగన్ హామీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల ముఖాల్లో చిరునవ్వు నింపే విధంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తానని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సీమాంధ్ర విభాగం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా నష్టాల్లో మునిగిపోయే ప్రమాదం ఉందని ఈయూ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈయూ అధ్యక్షుడు సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలో రాజేంద్రప్రసాద్, దామోదరరావు, సుబ్రమణ్యంరాజు, ఎస్.ఎస్.రావు తదితరులతో కూడిన ప్రతినిధి బృందం ఆదివారం జగన్‌ను ఆయన నివాసంలో కలిసింది. అనంతరం ఈయూ నేతలు విలేకరులతో మాట్లాడారు. విభజన తర్వాత ఆర్టీసీని ఆదుకొని కార్మికులకు న్యాయం చేస్తామని, అందరం కలిసి కార్మికుల ముఖాల్లో చిరునవ్వులు నింపుదామని జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆర్టీసీ నష్టాలను భరించాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ల పట్ల కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే.. ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారు కోరుకున్న విధంగా సహకారం అందించడానికి సిద్ధమని జగన్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. -
ఉప్పెనలా ఉద్యమం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో విద్యార్థి జేఏసీ, ఎన్జీఓలతో పాటు వివిధ పార్టీలు నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమం 11వ రోజు ఉప్పెనలా సాగింది. శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెంకటగిరి, ఉదయగిరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. ఎన్జీఓ నేతలు ఆందోళనలు కొనసాగించారు. విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. సాక్షి, నెల్లూరు: నెల్లూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆత్మకూరు బస్టాండువద్ద హిజ్రాలు వినూత్న నిరసన తెలిపారు. కేసీఆర్ వేషధారణలోని ఓ వ్యక్తితో హిజ్రాకు పెళ్లి చేశారు. అనంతరం కేసీఆర్‌ను చంపి హిజ్రాను వితంతువును చేస్తూ తమదైన శైలిలో నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో హిజ్రాలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్బన్ ఆర్యవైశ్య సం ఘం ఆధ్వర్యంలో వ్యాపారులు, కార్మికులు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బడిబాటతో విద్యార్థుల నిరసనన తెలిపారు. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. అన్నమయ్య సర్కిల్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సీఎం కిరణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండు ఎదుట మానవహారం నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పర్యవేక్షణ వేదిక ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు నగరంలో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గూడూరు ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులంతా దుకాణాలకు తాళాలు వేశారు. అనంతరం రోడ్డుపైనే వంట వార్పు నిర్వహించారు. అక్కడే సహపంక్తి భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కోట, చిట్టమూరు, వాకాడు మండలాల జర్నలిస్ట్‌లు సమైక్యాంధ్రకు కోట క్రాస్‌రోడ్డులో వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. చిట్టమూరు, వాకాడులో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ముత్తుకూరులో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ తెలంగాణ విభజనతో భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్నారు. పొదలకూరులో సమైక్యాంద్రకు మద్దతుగా ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా పండ్లు, తోపుడు బండ్ల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. వైకుంఠపురం పవర్ యూత్ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా విచిత్ర వేషధారణలతో ట్రాలీపై ర్యాలీ సాగింది. శ్రీపొట్టిశ్రీరాములు బొమ్మ సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యాన ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కబడ్డీ ఆడుతూ నిరసన తె లిపారు. వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ గుడివద్ద నుంచి కాశీపేటవరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బంగారుపేటలో సమైక్యపోరాట సమితి ఆధ్వర్యంలో వంటావార్పు, మహిళా పవర్ నాయకుల ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన, అడ్డరోడ్డు సెంటర్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఉదయగిరి బస్టాండులో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేశారు. దుత్తలూరు సెంటర్లో విద్యార్థులు రాస్తారోకో, వరికుంటపాడు మండలం ఇరువూరులో మానవహారం, వింజమూరులో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో కళాశాల విద్యార్థుల రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేటలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పీర్లచావిడి సెంటర్లో మౌనప్రదర్శన జరిగింది. పట్టణమంతా ర్యాలీ చేసిన అనంతరం జేఏసీ నాయకులు మౌనప్రదర్శన చేశారు.