breaking news
RTC assets
-
చిక్కుముడి విప్పే బాధ్యత ‘షీలాభిడే’దే
ఆస్తులు, అప్పుల పంపిణీపై ఆర్టీసీ ఈడీల కమిటీ సమావేశంలో తీర్మానం దీనిపై త్వరలో బోర్డు సమావేశంలో చ ర్చించాలని నిర్ణయం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే బాధ్యతా కమిటీకే అప్పగింత హైదరాబాద్: ఆర్టీసీ ఆస్తులు, అప్పులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచే విషయం లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలని ఆర్టీసీ ఈడీల కమిటీలో నిర్ణయించారు. ఆర్టీసీ ఆస్తులపై ఇటీవల ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ మూల్యాం కన చేయడాన్ని తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా తప్పు పట్టడం, బస్‌భవన్ మినహా మిగతా ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వొద్దని గట్టిగా పట్టుబడుతుండటంతో పంపిణీపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఇది క్రమంగా పీటముడిగా మారటంతో ఆర్టీసీ విభజనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ విభజన వ్యవహారాలను పర్యవేక్షిం చేందుకు గతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల కమిటీతో ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు మంగళవారం భేటీ అయి చర్చించారు. ఈడీల కమిటీ సహా ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది, కార్మికులు రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి రావటం సాధ్యం కాదని తేల్చిన అధికారులు ఇక ఆస్తులు, అప్పుల పంపకంలో రెండు రాష్ట్రాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకునే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలని తీర్మానించారు. ‘ఈ అంశాలపై బుధవారం మరోసారి భేటీ అయి మినిట్స్ రూపొందించి సభ్యుల సంతకాలు తీసుకుని తదుపరి ఆర్టీసీ బోర్డు సమావేశంలో ఉంచాలి, వాటిపై పాలకమండలి ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే దానిని కమిటీ ముందుంచి రెండు రాష్ర్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్రానికి పంపాలి. ఏకాభిప్రాయానికి రాని పక్షంలో రెండు ప్రభుత్వాలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుని కేంద్రానికి నివేదించే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలి’ అని నిర్ణయించారు. మరోసారి గళం విప్పిన ఈడీ జయరావు..: ఈ భేటీని కేవలం ఆస్తులు, అప్పుల పంపకంపై చర్చించేందుకే పరిమితం చేసినప్పటికీ సీనియర్ ఈడీ జయరావు మరోసారి ఉద్యోగుల పంపకంలో అప్షన్ అంశాన్ని లేవనెత్తినట్టు తెలిసింది. ఆంధ్రాలో కలసిన పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన తనను తెలంగాణ అధికారిగా పరిగణించాలని కోరుతున్న విషయం తెలిసిందే. ఆర్టీసీలో అంతర్గతంగా తన విషయంపై ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా... ప్రభుత్వానికి నివేదించాలనే డిమాండును లేవనెత్తినట్టు తెలిసింది. దీనిపై మరో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని ఎండీ పూర్ణచంద్రరావు ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. -
నాలుగైదు రోజుల్లో ఆర్టీసీ ‘విభజన’ కసరత్తు పూర్తి
* నివేదికను తొలుత బోర్డుకు సమర్పించనున్న అధికారులు * నగరంలో ఉన్నట్టుగా సీమాంధ్రలోనూ కల్యాణమండపం, ఆసుపత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆస్తులు, అప్పులను తెలంగాణ-సీమాంధ్రల మధ్య విభజించే అంశం మరో నాలుగైదు రోజుల్లో కొలిక్కి రానుంది. దీనికి సంబంధించి అధికారులు వారం రోజులుగా వేగంగా కసరత్తు చేస్తున్నారు. బోర్డుకు సమర్పించేందుకు వీలుగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నారు. కార్పొరేషన్ ఆస్తులను 58:42 పద్ధతిలో విభజిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ తీవ్ర నష్టాల్లో ఉన్నందున వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ నష్టాలు గత 10 నెలలుగా రికార్డు స్థాయికి చేరుకోవటంతో... అదీ గత జనవరిలో మరింత తీవ్రంగా ఉండటంతో ఏప్రిల్ వరకు ఉన్న పరిస్థితిని అధికారులు తాజాగా సిద్ధం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి అత్యంత విలువైన స్థలాలున్నాయి. వీటి విలువ రూ.65 వేల కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏ ప్రాంతంలో ఉన్న స్థలాలు ఆ ప్రాంతానికే దక్కనున్నాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కల్యాణ మండ పం, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి తరహాలో సీమాంధ్రలో కూడా వాటిని నిర్మించాలని నివేదికలో పొందుపరచనున్నారు. అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ వాటిని నిర్మించే పరిస్థితిలో లేనందున ప్రభుత్వం అందుకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని అందులో పేర్కొంటున్నారు. 123 డిపోలు, వాటి పరిధిలో ఉన్న పదమూడున్నర వేల బస్సులను ఆయా ప్రాంతాలకే కేటాయిస్తారు. కొత్తగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కొనే బస్సులను కూడా 58:42 పద్ధతిలో రెండు ప్రాంతాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఆయా డిపోల పరిధిలో ప్రస్తుతం 45 వేల డ్రైవర్లు, 42 వేల కండక్టర్లు కలిపి మొత్తం 1.24 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సీమాంధ్రకు చెందిన వారు 70 వేల మంది ఉన్నారు. ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయిస్తారు. నగరంలోని ప్రధాన కార్యాలయం, రీజియన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారుల పంపిణీ మాత్రం జరగాల్సి ఉంది. ఓ ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం వందల్లోనే ఉండటంతో వీరి పంపిణీ కూడా సవ్యంగానే సాగనుంది. ఈ మొత్తం కసరత్తును మరో మూడునాలుగు రోజుల్లో పూర్తి చేసి ఆర్టీసీ బోర్డు ముందుంచనున్నారు. ఇందులో దీనిపై చర్చించి అవసరమైన మార్పు చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు.