breaking news
Rs.20 lakhs loss
-
జామాయిల్ తోట దగ్ధం
రూ.20 లక్షలకు పైగా నష్టం గిరిజన కుటుంబాల ఆవేదన ఆత్మకూరురూరల్ : గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గిరిజనులకు చెందిన సుమారు 48 ఎకరాల్లో జామాయిల్ తోటలు దగ్ధమైన సంఘటన మండలంలోని రామస్వామిపల్లిలో శనివారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గిరిజనులు 20 కుటుంబాలకు 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా కుటుంబానికి 2.50 ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేసింది. అప్పటి నుంచి గిరిజనులు వివిధ రకాల పైర్లు సాగు చేసుకుంటున్న క్రమంలో నష్టాలకు గురికావడంతో సులభంగా ఉండే జామాయిల్ తోటలను సాగు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అన్ని గిరిజన కుటుంబాలు కొందరు రైతుల సహకారంతో జామాయిల్ తోటలు సాగు చేసుకుంటున్నారు. గత వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గిరిజనులకు చెందిన ఈ భూముల్లో కొందరితో కలిసి సర్వే చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన గిరిజనులకు ఈ భూముల్లో తమ భూములు సైతం కలిసి ఉన్నాయని, అందుకే సర్వే చేస్తున్నట్లు చెప్పాడని బాధిత గిరిజనులు తెలిపారు. అయితే ఇది జరిగిన వారం రోజుల లోపే జామాయిల్ తోటలు దగ్ధం కావడంతో రూ.20 లక్షలకు పైగా నష్టం సంభవించిన గిరిజన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది ఎవరో కావాలని చేసిన విద్రోహ ఫలితమేనని వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది పరిశీలించారు. -
అమ్మోనియం ప్రభావంతో చేపల మృతి
ఇందుకూరుపేట : మండలంలోని గంగపట్నం పంచాయతీ కాలవమూల కండ్రిగలో సాగులో ఉన్న చేపలు మృతి చెందాయి. దీంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. స్థానికుల కథనం మేరకు..మండలంలోని కుడితిపాళెంకు చెందిన మెట్టా సుబ్బారెడ్డి కాలవమూల కండ్రిగలో 12 ఎకరాలు చేపల గుంతలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పట్టుబడి దశలో ఉండగా నీటిలో అమ్మోనియా శాతం పెరిగి ఆక్సిజన్ అందక గుంతలో మొత్తం చేపలు చనిపోయాయి. రొయ్యల సాగు రైతులకు మాత్రమే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యేవి. ప్రస్తుతం చేపల చెరువులో కూడా ఇలాంటి పరిస్థితి ఉండటంతో చేపల సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు.