యువ సంచలనం.. మరో హార్దిక్ పాండ్యా అవుతాడా?
జింబాబ్వే వేదికగా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్-2026లో భారత యువ జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ఆయుశ్ మాత్రే సేన.. తదుపరి బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది.చివరగా శనివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డ యువ భారత్.. డీఎల్ఎస్ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. కివీస్ యవ జట్టుతో మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీశ్ (RS Ambrish) కీలక పాత్ర పోషించాడు.నాలుగు వికెట్లతో సత్తా చాటిఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటి న్యూజిలాండ్ అండర్-19 జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో అంబరీశ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పద్దెమినిదేళ్ల ఈ కుర్రాడు ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ముందుకు సాగితే టీమిండియాకు మరో హార్దిక్ పాండ్యా దొరికినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరో హార్దిక్ పాండ్యా అవుతాడా?హార్దిక్ మాదిరి ఆరో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడంతో పాటు.. కొత్త బంతితో బౌలింగ్ చేయగల సత్తా కలిగి ఉండటం ఇందుకు కారణం. తమిళనాడుకు చెందిన ఆర్ఎస్ అంబరీశ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.తండ్రి కల నెరవేరుస్తున్న తనయుడుకూచ్ బెహర్ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబరీశ్.. 33 ఏళ్ల నిరీక్షణ తర్వాత జూనియర్ రెడ్‌బాల్ క్రికెట్లో జట్టుకు ట్రోఫీని అందించాడు. అతడి తండ్రి ఆర్. సుకుమార్ కూడా క్రికెటరే. జూనియర్ క్రికెట్లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత రైల్వేస్ జట్టుకు మారిన సుకుమార్ సీనియర్ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.రైల్వేస్‌లో సెక్యూరిటీగా ఆ తర్వాత రైల్వేస్‌లో సెక్యూరిటీ జాబ్ పొందిన సుకుమార్.. తన కలను కుమారుడి ద్వారా నెరవేర్చుకోవాలని భావించాడు. అందుకు తగ్గట్లే చిన్ననాటి నుంచే అంబరీశ్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి ఆశయాన్ని తాను నెరవేరుస్తున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన అంబరీశ్.. భారత అండర్-19 జట్టులోనూ ఎంట్రీ ఇచ్చాడు.గతేడాది జూన్‌లో ఇంగ్లండ్ గడ్డ మీద యూత్ వన్డేల ద్వారా యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చిన అంబరీశ్.. అప్పటి నుంచి భారత అండర్-19 తుది జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పటి వరకు వరల్డ్‌కప్ టోర్నీలో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ఆల్‌రౌండర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉన్న అంబరీశ్ మెరుగ్గా రాణిస్తే.. టీమిండియాలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తాడనటం అతిశయోక్తి కాదు. చదవండి: యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము!