breaking news
Rich Ministers
-
ధనిక ఎంపీలు జీతాలు వదులుకోవాలి
న్యూఢిల్లీ: ధనిక పార్లమెంట్ సభ్యులు తమ జీతభత్యాలను వదులుకొని సరికొత్త ఉద్యమానికి నాంది పలకాలని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ తీసుకోవాలని కోరారు. తద్వారా ప్రజాప్రతినిధులపై ప్రజలకు మరింత విశ్వాసం కలుగుతుందని, దేశవ్యాప్తంగా సానుకూల సంకేతం పంపినట్లవుతుందని స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని.. ప్రజాస్వామ్యానికి ఇది హానికర పరిణామమని హెచ్చరించారు. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలన్న వరుణ్.. ఇలాంటి నిర్ణయాలు కొంతమంది ఎంపీలకు ఇబ్బంది కలిగించవచ్చన్నారు. రూ.కోటి కన్నా ఎక్కువ ఆస్తులున్న ఎంపీలు ప్రస్తుతం 449 మంది ఉన్నారని, 132 మంది ఎంపీలు తమ ఆదాయం రూ.10 కోట్లకుపైగా ఉన్నట్లు ప్రకటించారన్నారు. -
మోడీది.. కోటీశ్వరుల కేబినెట్
* కోట్లకు పడగలెత్తిన 40 మంది అమాత్యులు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కోటీశ్వరులతో నిండిపోయింది. ప్రధాని సహా మొత్తం 46 మంది అమాత్యులున్న కేబినెట్లో 40 మంది రూ. కోట్లకు పడగలెత్తగా కేవలం నలుగురు మాత్రమే లక్షాధికారులుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న సంపదల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన అరుణ్ జైట్లీ సహా మంత్రులు గోపీనాథ్ ముండే, మేనకా గాంధీ, పీయూష్ గోయల్ ఇలా 40 మంది మంత్రి వర్యులు కోటీశ్వరులేనని ఏడీఆర్ పేర్కొంది. కాగా, ధాంజీభాయి వాసవ రూ.65 లక్షలు, థావర్‌చంద్ గెహ్లాట్ రూ.86 లక్షలు, సుదర్శన్ భగత్ రూ.90 లక్షలు, రాం విలాస్ పాశ్వాన్ రూ.96 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారని వివరించింది. ఇక, మరో ఇద్దరు మంత్రులు ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్‌లు ఏ సభకూ ఎన్నిక కాకపోవడంతో వీరి ఆస్తుల వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.


