breaking news
Revolutionary movies
-
నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి
విప్లవ చిత్రాలకు కేరాఫ్ చిరునామా ఆర్. నారాయణమూర్తి తన తాజా చిత్రం ‘రాజ్యాధికారం’ కోసం ఒక ప్రయోగం చేశారు. రైతు రామయ్యగా, అతని ముగ్గురు కుమారులుగా 4 పాత్రలు పోషించారు. ‘‘వేషాల పిచ్చితో నేను మద్రాసు వెళ్ళా. ‘ఇద్దరు మిత్రులు’లో అక్కి నేని ద్విపాత్రాభియనం మొదలు, తమిళ ‘నవరాత్రి’లో శివాజీ గణేశన్ 9 పాత్రలు, ‘దానవీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ 3 పాత్రలు, కమలహాసన్ ‘దశావతారం’ లో 10 పాత్రలు - ఇలా మహానుభావులెందరో అనన్య సామాన్యంగా బహు పాత్ర పోషణ చేశారు. వాళ్ళ స్ఫూర్తితో ఈ చిత్రంలో కథానుగుణంగా 4 వేషాలు వేస్తున్నా. ఆ మహామహులతో నాకు పోలిక లేదు కానీ, ఏదో పిల్లగాణ్ణి నా ప్రయత్నం చేస్తున్నా’’ అని నారాయణమూర్తి అన్నారు. ముగ్గురు కొడుకుల పాత్రల్లో ఒకటి ముస్లిము వద్ద పెరిగే అయూబ్ పాత్ర. మరొకటి ఉద్యమకారుడు శంకరన్న అయితే, మూడోది తండ్రి దగ్గర పెరిగిన అమాయకపు అర్జునుడు పాత్ర. ప్రతి పాత్రా భిన్నంగా ఉంటుంది. ‘‘చట్టం ముందు అందరూ సమానులే అన్నది ఆచరణలో సాధ్యం కాకపోతే, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. అలా జరగరాదని చెప్పేదే మా ‘రాజ్యాధికారం’’’ అన్నారు. అన్నట్లు, యెప్పటి లానే తెర వెనుక కూడా కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాతగా ఆయన బహుపాత్ర పోషణ చేయడం గమనార్హం. -
రాజకీయాల్లోకి రాకుంటే.. బిజినెస్‌మేన్ అయ్యేటోణ్ని
- పదేళ్ల పాటు పీడీఎస్‌యూలో.. - ఉద్యమ సహచారిణితో పెళ్లి - విప్లవ సినిమాలంటే ఇష్టం.. ఓ పది చూసుంటా.. - చిన్నప్పుడే శ్రీశ్రీ సభకు పోయినా - టెన్త్ క్లాస్‌లోనే జైలు కెళ్లినా - పన్నెండేళ్ళుగా తీరిక లేదు - రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆరో తరగతిలోనే ఆయన పిడికిలెత్తాడు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ, అణిచివేత, అన్యాయాల్ని ఎదురించే ఉద్యమాలే పాఠాలుగా చదువుకున్నాడు. చీకటి రోజుల్లోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గొంతెత్తాడు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై పోరుకు నడుం బిగించి పదో తరగతిలోనే జైలుకెళ్లాడు. పదేళ్లపాటు పీడీఎస్‌యూకు తిరుగులేని సారథ్యం వహించాడు. వామపక్ష పార్టీల చీలికలు పేలికలతో ఉద్యమబాట వీడాడు. సొంతంగా కోళ్ల పరిశ్రమను స్థాపించి కొత్త జీవితం ఆరంభించాడు. ఆరేళ్లపాటు పౌల్ట్రీ రంగం.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష.. టీఆర్ఎస్ నేతలతో ఏర్పడ్డ పరిచయాలు.. ఆయనను రాజకీయాల్లోకి రప్పించాయి. అదీ మొదలు తెలంగాణ ఉద్యమం ఆద్యంతం అనిర్వచనీయమైన పాత్ర పోషించారు. కేసీఆర్‌కు కుడి ఎడమ భుజంగా.. టీఆర్ఎస్ కార్యకలాపాలన్నింటా నమ్మినబంటుగా ఎదిగారు. వరుసగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినరికార్డును సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖకు సారథ్యం వహిస్తున్నారు. ఆయనే మంత్రి ఈటెల రాజేందర్. సాదాసీదాగా.. సౌమ్యునిగా.. అందరికీ అందుబాటులో ఉండే ఉద్యమనేతగా పేరుతెచ్చుకున్న ఈటెల ఇన్నర్వ్యూ ఈవారం ‘సాక్షి’ సండేస్పెషల్ ఈటెల రాజేందర్ పుట్టిన తేది : 1964 మార్చి 20 తల్లిదండ్రులు : ఈటెల మల్లయ్య-వెంకటమ్మ అన్న, తమ్ముడు : సమ్మయ్య, భద్రయ్య అక్కాచెల్లెళ్లు : అమృతమ్మ,నీలమ్మ,పూలమ్మ, శోభ, సుజాత విద్యార్హతలు : బీఎస్సీ భార్య : జమున, కుమారుడు నితిన్,కూతురు నీత ‘సదువంతా హాస్టల్. బతుకంతా ఘర్షణ. నిరంతరం ఉద్యమం.. పోరాటం. చిన్నప్పుడు నా ఇల్లే ఓ చిన్నపాటి లైబ్రరీ. ఎన్నో పుస్తకాలు. పన్నెండేళ్లుగా క్షణం తీరిక లేదు. ఒక్క పుస్తకం సదువలేదు. నిత్యం ఉద్యమాలు. రాజకీయాలు. ప్రజా జీవితంలోనే ఉన్నా. వామపక్ష ఉద్యమంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశలు.. ఆకాంక్షలు.. ఆశయాలు.. నమ్ముకున్న సిద్ధాంతాలు.. ఇప్పుడవి నెరవేరుతాయా.. అంటే చెప్పలేను కానీ.. నాకైతే నమ్మకముంది. ఉద్యమాల ద్వారా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలకు ప్రజాకోణం ఉంటుంది. టీఆర్ఎస్కు అదే ప్రజాకోణం ఉంది. అందుకే ప్రజల ఆకాంక్షలు ఫలిస్తాయనే నమ్మకం నాకుంది..’ - ఈటెల రాజేందర్, ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి అన్నయ్యే స్ఫూర్తి ఊళ్లలో దొరతనం.. భూస్వామ్య పెత్తందారీ రాజ్యం.. అణిచివేత.. అన్యాయం.. అంటరానిత నం.. పేదరికం.. అవన్నీ నేను పుట్టి పెరిగిన పరిసరాలు. అందుకే చిన్నప్పటి నుంచే ఉద్యమబాట ఎంచుకున్నాను. నాకంటే వయసులో ఎనిమిదేళ్లు పెద్దయిన మా అన్న సమ్మయ్య అప్పటికే ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన టీచర్. అతనే నాకు స్ఫూర్తి. బాలసంఘా లు.. రాత్రి పాఠశాలలు.. ఊరి బాగోతాలు.. ఇవ న్నీ ఉద్యమంలో నా తొలి రోజులు. ఇంట్లో అమ్మానాన్నలకు తెలిసేది కాదు. ఇప్పుడు అమ్మ లేరు. మా నాన్నకు 95 ఏళ్లు. ఇంటి దగ్గరే ఉంటున్నారు. మేం తొమ్మిది మంది సంతానం. అయిదుగురు అక్కాచెల్లెళ్లు. ముగ్గురు అన్నాదమ్ముళ్లం ఉన్నాం. ఫస్ట్ గజ్వేలే.. పౌల్ట్రీ బిజినెస్‌లో ఉన్నప్పుడే స్థానిక టీఆర్ఎస్ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ అవసరాలకు నావంతుగా సహాయ సహకారాలు అందించేటోన్ని. అప్పుడు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దేశ్‌పాండే రాధాకృష్ణ రాజకీయాల్లోకి రావాలని నన్ను ప్రోత్సహించారు. 2002లో పార్టీలో చేర్పించి కేసీఆర్‌కు పరిచయం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో వ్యాపారరీత్యా స్థిరపడటంతో అక్కణ్నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నా. అది రిజర్వుడు సెగ్మెంట్ కావటంతో కమలాపూర్ నుంచి పోటీకి దింపారు. మొదటిసారి పోటీ చేసేటప్పుడు సొంత నియోజకవర్గంతో నాకు పరిచయాలేమీ లేవు. పదో తరగతిలోనే.. చిన్నప్పుడే ఊరి నుంచి వెళ్లిపోవటంతో విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. డిగ్రీ వరకు హాస్టల్ చదువులే. కేశవ్ మెమోరియల్ స్కూళ్లో పదో తరగతి. హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్. సైఫాబాద్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివాను. పదో తరగతిలో ఉన్నప్పుడే జైలుకెళ్లాను. మేం యాకుత్‌పురా హాస్టల్లో ఉన్నప్పుడు స్కాలర్షిప్ రూ.40. విద్యార్థులకు రోజుకు రూ.1.33 భోజన ఖర్చులకు చెల్లించేది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు అన్నీఇన్నీ కావు. కాలేజీల్లో, హాస్టళ్లలో సీటు దొరకటమే కష్టం. అప్పుడు చేపట్టిన ఆందోళనలు ఇప్పటికీ మరిచిపోలేను. అడ్మిషన్లు, క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తాను. అప్పుడు జైలుకెళ్లాల్సి వచ్చింది. అదీ మొదలు.. ఇంటర్లో రెండుసార్లు... డిగ్రీలో ఓసారి... 1986 నుంచి 1996 వరకు వామపక్ష ఉద్యమంలో ఉన్నప్పుడు నాలుగుసార్లు జైలుకెళ్లాను. ఇంటర్లో ఉన్నప్పుడే పీడీఎస్‌యూకు ఆలిండియా జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టాను. తెలంగాణ ఉద్యమంలో మహబూబాబాద్, కరీంనగర్లో రెండుసార్లు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేను.. మంత్రిని కాకుంటే... పౌల్ట్రీ బిజినెస్‌మేన్ గా ఉండేటోన్ని. 2002లో టీఆర్ఎస్లో చేరాను. చిన్నప్పుడు ఉద్యమకారునిగా ఉండిపోవాలని అనుకున్నాను. చీలికలు పేలికలతో వామపక్ష పార్టీలు తలోదిక్కు అయ్యాయి. అందుకే ఉద్యమబాటను వీడాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి రాకుంటే బిజినెస్‌మేన్‌గా ఉండేటోన్ని. ఉద్యమ సహచరిణి నా సహచరి జమునారెడ్డి. 1989లో పెళ్లి చేసుకున్నాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. కలిసి ఉద్యమంలో పాలుపంచుకున్నాం. జమునది నల్గొండ జిల్లా పలివెల. వాళ్ల కుటుంబీకులందరితో నాకు మంచి సంబంధాలుండేవి. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు నితిన్. పూణెలో బీబీఏ అయిపోయింది. కూతురు నీతా. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అడుగడుగునా కుటుంబీకుల ప్రోత్సాహం నా వెన్ను తడుతోంది. మరిచిపోలేను కమలాపూర్‌లో ఆరో తరగతి చదివే రోజులు. అప్పుడు ఎమర్జెన్సీ. చీకటి రోజులు. గొంతెత్తితే జైళ్లో పెట్టే రోజులు అవి. అప్పుడే మా స్కూల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చాను. మాటల్లోనే చీల్చి చెండాడాను. ఇప్పటికీ ఆ సంఘటన మరిచిపోలేను. 1973లో హుజూరాబాద్‌లోని కాలేజీ గ్రౌండ్లో శ్రీశ్రీ మీటింగ్ పెట్టాడు. శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమకాలం. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపై జనాన్ని తట్టి లేపేందుకు నిర్వహించిన ఆ సభను చూసేందుకు మా ఊరి నుంచి అక్కడి దాకా వెళ్లాను. మా అన్న ఇంటర్మీడియట్ చదివే రోజులవి. అప్పుడు నేను ఇంకా స్కూల్ పిల్లగాణ్నే. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలప్పుడు చిన్నపిల్లలం. అప్పుడు ప్రచారం చేస్తున్న జనతా పార్టీకి డబ్బుల్లేవు. అప్పుడే జనతా పార్టీ తరఫున ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రచారానికి మేం బూట్లు పాలిష్ చేశాం. అదొక్కటే బాధ వామపక్ష పార్టీలు చీలికలు.. పేలికలుగా విడిపోయిన సందర్భం నన్ను బాధపెట్టింది. ఆ తర్వాతే పీడీఎస్‌యూ నుంచి బయటకు వచ్చాను.