breaking news
revenu deprtoment
-
ముందుకుసాగని రెవెన్యూ పనులు
కొడంగల్: నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోల కొరత ఉంది. మండలంలో 14 క్లస్టర్లు ఉండగా ఆరుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. మున్సిపాలిటీగా మారిన కొడంగల్ క్లస్టర్‌కు ఒక్కరు కూడా లేరు. ఈ నేపథ్యంలో రెవెన్యూ పాలన ముందుకు సాగడం లేదు. ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాల్లో రెవెన్యూ సిబ్బంది కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొడంగల్ మండలంలో గ్రామ రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల పలు రకాల పనులు పెండింగ్ పడిపోతున్న దుస్థితి ఏర్పడింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ పనులపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొత్త పాసుపుస్తకాల్లో తప్పులను సరిచేయడానికి సమయం పడుతోంది. ప్రభుత్వం అందించిన రైతుబంధు చెక్కులదీ ఇదే పరిస్థితి. వీటిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. ఏడాది క్రితం 1,745 మంది రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు వచ్చాయి. 250 మంది ఎన్ఆర్ఐ చెక్కులు పంపిణీ చేయలేదు. సిబ్బంది కొరత వల్ల కార్యాలయంలో పనులు ముందుకు సాగడం లేదు. అంతేకాకుండా భూముల పంచనామా, క్లియరెన్స్ తదితర పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణా ప్రభుత్వం మళ్లీ ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు రైతు బంధు చెక్కులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా రైతు సమగ్ర సర్వే చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వచ్చే నెల మే 15 లోపు రైతు సమగ్ర సర్వే పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోల కొరత ఉన్నందున పనులు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. పలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే జనం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సిబ్బంది కొరత వల్ల ఉన్నతమైన ప్రభుత్వ ఆశయం ముందుకు సాగడం లేదు. -
ఆలయ నిర్మాణంపై కొనసాగుతున్న వివాదం
వర్ధన్నపేట : ప్రభుత్వ స్థలంలో నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణంపై వివాదం కొనసాగుతోంది. రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదంతో రెవెన్యూ అధికారులు ముదిరాజ్ కులపెద్దలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలోని ఐనవోలు గ్రామంలోని సర్వే నెం. 993లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోని 20 గుంటల స్థలంలో ముదిరాజ్‌లు పెద్దమ్మతల్లి గుడి నిర్మించడానికి 2012లో అప్పటి ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, జెడ్పీటీసీ సభ్యుడు మార్నేని రవీందర్రావు భూమి పూజ చేశారు. అయితే, తాజాగా ఐనవోలు మండలంగా ఏర్పాటుకానుండడంతో ప్రభుత్వ స్థలాలకు అధికారులు హద్దులు ఏర్పాటుచేస్తున్నారు. అప్పటిలోగా అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని పూర్తి చేయాలని ముదిరాజ్‌లు సిద్ధమయ్యారు. ఈ ఆలోచనతోనే రెండు రోజుల క్రితం పెద్దమ్మతల్లి విగ్రహన్ని ప్రతిష్టించారు. దీనికి స్థానికులు అడ్డుకోవడంతో వివాదం ఆరంభమైంది. అయితే, ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఆలయాన్ని నిర్మించనుండడంతో గతంలో కూడా అభ్యంతరం వ్యక్తమైంది. కాగా, గ్రామంలో రెండు రోజులుగా వివాదం కొనసాగుతుండడంతో ముదిరాజ్ కులపెద్దలను రెవెన్యూ అధికారులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలం స్వాధీనం చే సుకుని.. ఆలయ నిర్మాణంకు మరో స్థలం కేటాయిస్తామని ముదిరాజ్‌లకు నచ్చచెబుతున్నారు.