breaking news
reservation to muslims
-
ఇది చరిత్రాత్మకం
⇔ ముస్లిం రిజర్వేషన్ల బిల్లుపై సీఎం కేసీఆర్ ⇔ ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావు.. సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే పెంపు ⇔ తమిళనాడు తరహా చట్టం తీసుకొస్తాం.. 9వ షెడ్యూల్లో చేర్చమంటాం ⇔ కేంద్రం ఒప్పుకోవాల్సిందే.. లేదంటే ‘సుప్రీం’కు.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఒత్తిడి తెస్తాం ⇔ రిజర్వేషన్లు 50% దాటొద్దని ఎక్కడా లేదు.. చాలా రాష్ట్రాల్లో ఎక్కువగానే అమలవుతున్నాయి ⇔ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తాం.. వారికి ఒకశాతం రిజర్వేషన్లు పెంచుతాం ⇔ బీసీలకూ రిజర్వేషన్లు పెంచుతాం.. దీనిపై కమిషన్‌తో 6 నెలల్లో నివేదిక ⇔ రిజర్వేషన్ల అమలును రాష్ట్రాలకే అప్పగించాలని కేంద్రానికి డిమాండ్ ⇔ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శ సాక్షి, హైదరాబాద్ వెనుకబడిన ముస్లింలు, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీల)కు రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు పెట్టడం చరిత్రాత్మకమని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తాము ఇవ్వబోతున్న రిజర్వేషన్లు మతపరమైనవి కావని.. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే పెంచుతున్నామని స్పష్టం చేశారు. తమిళనాడులో రాజ్యాంగబద్ధంగానే 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, అదే తరహాలో తెలంగాణలోనూ పెంచి తీరుతామని తెలిపారు. తమిళనాడు తరహా చట్టాన్నే కేవలం రాష్ట్రం పేరు మాత్రమే మార్చి కేంద్రానికి పంపుతామన్నారు. దీనిని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కోరుతామని, కేంద్రం తప్పనిసరిగా దీనికి ఒప్పుకుని తీరాల్సిందేనని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిరాకరిస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని, సుప్రీంకోర్టుకు వెళతామని వెల్లడించారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రాలకు వదిలిపెట్టాలని, కేంద్రం ఆ దిశగా విజ్ఞత పాటించాలని సూచించారు. ఈ నెల 23న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి ఈ అంశంపై మెమోరాండం ఇస్తామని, దీనిపై కలసి వచ్చే ముఖ్యమంత్రులతోనూ మాట్లాడతానని స్పష్టం చేశారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. హామీకి అనుగుణంగానే పెంపు పదకొండేళ్ల క్రితం ఉద్యమ సమయంలోనే రిజర్వేషన్ల పెంపుపై ప్రజలకు హామీ ఇచ్చానని.. తమ పార్టీ మేనిఫెస్టోలోనూ పెట్టామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచడం తమ కర్తవ్యమని, ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఉన్న విధానం ఆధారంగానే పెంపు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావని, సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడి తెలంగాణ ఏర్పడిన తర్వాత సామాజిక నేపథ్యం మారిపోయిందని.. ఉమ్మడి ఏపీలో ఎస్టీల జనాభా 6 శాతముంటే ఇప్పుడు తెలంగాణలో 9.08 శాతంగా ఉందని చెప్పారు. వీరిలో వాల్మీకి బోయలు, కాగిత లంబాడీలను కలిపితే 10 శాతానికి చేరుతోందని, అందుకు తగ్గట్లే రిజర్వేషన్లు ప్రతిపాదించామని తెలిపారు. ఎస్సీ, బీసీలకూ పెంచుతాం ఉమ్మడి ఏపీలో ఎస్సీలు 15 శాతంగా ఉంటే ఇప్పుడు తెలంగాణలో 16.3 శాతం దాటిందని కేసీఆర్ చెప్పారు. వారికి ఒక శాతం రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ఎస్సీ కమిషన్‌ను నియమించి రిజర్వేషన్లు పెంచుతామన్నారు. ఈ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. బీసీలకు ఎలాంటి ముప్పు లేదని, వారికీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. 50శాతం దాటొద్దని ఎక్కడా లేదు.. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనదని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని.. తమిళనాడులో 32 ఏళ్లుగా 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఈశాన్య రాష్ట్రాల్లో 80%, జార్ఖండ్‌లో 60% అమలవుతున్నాయని తెలిపారు. స్వాతంత్యం వచ్చాక మారిన పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకు వదిలిపెట్టాలని.. అప్పుడే రాష్ట్రాలతో ఘర్షణ వాతావరణం ఉండదని వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని అడుక్కోను.. కేంద్రానికి అలా బిల్లు పంపగానే, ఇలా ఆమోదముద్ర వేసి పంపిస్తారని తానేమీ అనుకోవడం లేదని కేసీఆర్ చెప్పారు. ‘‘బిల్లును కేంద్రం ముందు పెడతా. నేనేమీ వారిని అడుక్కోను. పోరాడుతా. రాష్ట్రాల హక్కులివి. అవసరమైతే లోక్‌సభలో పోరాడుతాం. అయితే సహజంగానే 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే బిల్లులు యథాతథంగా ఆమోదానికి నోచుకోవు. కేంద్ర హోంశాఖకు, అక్కడి నుంచి న్యాయశాఖకు పంపుతారు. అవసరమైతే అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంటారు. కొన్ని మార్పులు చేర్పులు సూచిస్తారు. ఇప్పటికే కేంద్రం వద్ద కొన్ని రాష్ట్రాల రిజర్వేషన్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో జాట్లు ఉద్యమం చేశారు. రాజస్థాన్‌లో గుజ్జర్లు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అక్కడి ప్రభుత్వం 68 శాతం రిజర్వేషన్లతో బిల్లును కేంద్రానికి పంపింది. అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. గుజరాత్లో హర్దిక్ పటేల్ పటేళ్ల కోసం ఉద్యమం చేశారు. భగవంతుడు అనుకూలిస్తే ఇతర రాష్ట్రాల బిల్లులతో పాటు మన బిల్లు కూడా ఆమోదం పొందుతుంది..‘’అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిలపక్షంతో ఒత్తిడి చిన్నచిన్న సవరణలు ఏవైనా ఉంటే మార్చుతామని, ముస్లిం రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఒత్తిడి తెస్తామని కేసీఆర్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ఏవిధంగా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం వద్దకు తీసుకెళ్లిందో అలాగే తీసుకెళ్తున్నామని.. అందువల్ల కేంద్రం దీనిని తిరస్కరించే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. కేంద్రం చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని, తమిళనాడులో ఇస్తున్నప్పుడు తెలంగాణకు ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతామని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై జీవో ఇద్దామా..! ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోచ్చని, వాటిపై కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్న కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి సూచన పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అలా జీవో జారీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని.. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది సలహా తీసుకుంటామని తెలిపారు. ఇక బీసీలకు ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు తీసుకురావడం కుదరదని... 93, 94 కులాలున్నందున అనేక సంక్లిష్టతలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. బీసీలు ఎవరెవరు, స్థితిగతులు, వృత్తులు, వారి సమస్యలపై సమగ్ర నివేదిక (చారిత్రక పత్రం) ఇవ్వాలని బీసీ కమిషన్‌ను కోరుతామని, ఆ అధ్యయనానికి ఆరు నెలలు పడుతుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లతోపాటు ఎస్సీలకు ఒకశాతం పెంచుతూ మరోసారి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లుగా బీసీల జనాభా లెక్కలు సరిగా లేవని, అందువల్ల కచ్చితమైన సమాచారంతో బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మోదీ మాటతో సమస్య తొలగింది వెనుకబడిన ముస్లింల దగ్గరకు పార్టీ నాయకులు చేరుకోవాలని, వారిని కూడా సమ్మిళితం చేసుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం ఆహ్వానించదగినదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని వైఖరి చూస్తే.. రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద సమస్య తొలగినట్లయిందని వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనమండలిలో చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతుండగా.. భువనేశ్వర్ బీజేపీ సమావేశంలో మోదీ మాట్లాడిన క్లిప్పింగ్‌ను మంత్రి కేటీఆర్ అందజేశారు. తర్వాత దీనిపై మరింత సమాచారం తెప్పించుకున్న కేసీఆర్.. ఓ ఆంగ్ల టీవీ వెబ్సైట్లో వచ్చిన వార్తను సభకు చదివివినిపించారు. మోదీ చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయని... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాలతో పాటు ముస్లింలకు రిజర్వేషన్ల ఫలాలు అందించే దిశలో ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన ఘడియ బాగుందన్నారు. ఇక రాష్ట్రాల పరిధిలో ఉద్యోగ, విద్య అవకాశాలకు సంబంధించి.. ఆయా రాష్ట్రాల సామాజిక స్వరూపానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వంటి ఏకాభిప్రాయం కుదిరిన అంశాలపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీవే ఓటు బ్యాంకు రాజకీయాలు బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని.. దేశంలో ఎవరు ఎట్లా ఓటు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసని కేసీఆర్ మండిపడ్డారు. శాసనసభ, మండలిలలో బీజేపీకి ప్రాతినిధ్యమున్నా.. బిల్లుకు వ్యతిరేకంగా రోడ్లపై అరాచకాలకు పాల్పడ్డారని, బస్సుల అద్దాలు పగులగొట్టి, తగలబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏదో చేద్దామని ప్రయత్నిస్తున్న బీజేపీ వారికి అదృష్టం బాగా లేదని, బీజేపీ నాయకుడే (మోదీ) ఉల్టా కొట్టారని వ్యాఖ్యానించారు. -
జీవన్‌రెడ్డి వర్సెస్ సీఎం కేసీఆర్
-
జీవన్‌రెడ్డి వర్సెస్ సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ మధ్య వాడీవేడి సంవాదం జరిగింది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతిస్తూనే.. దీనిని కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణ ప్రభుత్వం ఎలా సాధించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడూల్డ్లో ఈ బిల్లును చేర్చి ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ నమ్మకం ప్రభుత్వానికి ఉందా? అని సీఎం కేసీఆర్‌ను అడిగారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఈ బిల్లును కేంద్రం తొమ్మిదో షెడ్యూల్డ్‌లో చేరుస్తుందన్న నమ్మకముందని పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోయినా సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పారు. జీవన్‌రెడ్డి న్యాయవాది అయి ఉండి ఇలాంటి విషయాల్లో విమర్శలు చేయడం తగదన్నారు. దీనికి జీవన్‌రెడ్డి స్పందిస్తూ.. ఇంటింటికీ మంచినీళ్లను సరఫరా చేయకుంటే ఓట్లు అడుగబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని, అదేవిధంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించకుంటే ఓట్లు అడుగబోమని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పగలదా? అని ఆయన సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న ఆత్మవిశ్వాసం తమకుందన్నారు. తమ బిల్లును 9వ షెడ్యూల్డ్‌లో చేర్చకపోతే.. సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించుకుంటామని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలలో పరిమితికి మించి రిజర్వేషన్ అమలులో ఉందని, కొన్ని రాష్ట్రాలలో 80శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పే అందరికీ వర్తిస్తుందని చెప్పారు. ఈ విషయంలో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నించవద్దని, కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందాన విమర్శలు చేయవద్దని జీవన్‌రెడ్డికి హితవు పలికారు. -
ముస్లిం రిజర్వేషన్: కేసీఆర్ ఉద్వేగ ప్రసంగం
-
ముస్లిం రిజర్వేషన్: కేసీఆర్ ఉద్వేగ ప్రసంగం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక చరిత్ర అని, అదేవిధంగా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కూడా చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. తెలంగాణ రాష్ట్రం రాదని.. ఒకవేళ వచ్చినా అనేక ఒడిదుడుకులు ఉంటాయని ఉద్యమసమయంలో అనేక దుష్ర్పచారాలు చేశారు. అదేవిధంగా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న అనేక సభల్లో నేను ఈ బిల్లుల గురించి ప్రకటించాను కొన్ని మీడియా చేసిన చర్చలో కూడా నేను ఆయా వర్గాలకు రిజర్వేషన్లను ఎలా సాధిస్తామో చెప్పాను గిరిజన రిజర్వేషన్, బీసీ-ఈ రిజర్వేషన్ అనేది కొత్త రిజర్వేషన్ కాదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకే వీటిని అమలు చేస్తున్నాం ఈ రిజర్వేషన్‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలోభాగంగా నేను 107 బహిరంగ సభలలో మాట్లాడాను ప్రతి సభలోనూ ఈ రిజర్వేషన్లను అమలు చేసితీరుతామని నేను కుండబద్దలు కొట్టాను మాకు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ హామీని నెరవేర్చడం కర్తవ్యంగా భావిస్తున్నాం. రెండు భిన్నమైన కమిషన్లు అధ్యయనం చేశాయి. సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్‌ను కల్పిస్తున్నాం. మత ప్రాతిపదికన కాదు. చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు కోరిన విధంగా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతున్నాం. కొత్తగా రిజర్వేషన్లు ఎందుకు తీసుకొస్తున్నామంటే.. ‘కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక చాలా మార్పులు జరిగాయి. ఉమ్మడి ఏపీలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు ఆరుశాతం రిజర్వేషన్ ఇచ్చారు. తెలంగాణలో గిరిజనులు 9.08శాతం ఉన్నారు. రాష్ట్రంలోని వాల్మీకి బోయ కులాల వారు, కాగిత లాంబడి కులాల వారు తమను ఎస్టీలలో చేర్చాలని చాలాకాలంగా కోరుతున్నారు. వారిని కూడా కలిపితే పదిశాతంగా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరముంది. తెలంగాణ జనాభా నేపథ్యానికి అనుగుణంగా రిజర్వేషన్ కల్పిస్తున్నాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. దళితులకు సీఎం కేసీఆర్ తీపికబురు.. ఒకశాతం పెంపు తెలంగాణలోని దళిత జనాభాకు అనుగుణంగా వారికి ఒకశాతం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరముంది. ఇందుకు ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటుచేయబోతున్నాం. ఇందుకు కేబినెట్లో కచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం ఈ రిజర్వేషన్ పెంచడం వల్ల బీసీలకు ఎలాంటి ముప్పు ఉండదు బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచుతాం. భిన్నత్వంలో ఏకత్వంతో ఉండే దేశం మనది. ఇంత భిన్నత్వంలోనూ ఐక్యత గల దేశంగా మనల్ని విదేశీయులు కొనియాడుతారు ఈ భిన్నత్వ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. జనాభాలోని కంపోజిషన్‌కు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈశాన్య రాష్ట్రాలలో 80శాతం గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. జార్ఖండ్‌లో 60శాతం, తమిళనాడులో 62శాతం, మహారాష్ట్రంలో 52శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది తెలంగాణకు 50శాతం రిజర్వేషన్ పరిమితి సరిపోదు ఆ తరహాలో 50శాతానికి మించి రిజర్వేషన్ పెంచడానికి కేంద్రం అనుమతించాలని కోరుతున్నాం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాభా 70శాతం పెరిగింది. అనేక మార్పులు జరిగాయి. అట్టడుగున ఉన్నవారు తమ హక్కుల కోసం ఇప్పుడు పోరాటం చేస్తున్నారు సామాజిక పరిణితితో కేంద్రం ఆలోచించాలి ఆయా రాష్ట్రాలలోని ప్రజల సామాజిక జనాభా అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకునే వెసులుబాటు కేంద్రం కల్పించాలి రిజర్వేషన్ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలి. రిజర్వేషన్ విషయంలో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదు. జనాభాకు అనుగుణంగా బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచే ప్రతిపాదన ఉంది. -
ముస్లిం రిజర్వేషన్ ప్రకంపనలు: బస్సుల అద్దాలు ధ్వంసం!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందించేందుకు సిద్ధమవుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముస్లింలు, ఎస్టీలకు సంబంధించిన కీలక రిజర్వేషన్ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ చర్యను వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు విధ్వంసాలకు దిగుతున్నారు. అఫ్జల్‌గంజ్ బస్టాప్ వద్ద బీజేవైఎం కార్యకర్తలు రెండు ఆర్టీసీ బస్సులపై విరుచుకుపడ్డారు. బైకులపై వచ్చిన కార్యకర్తలు వాటి అద్దాలను ధ్వంసం చేశారు. మరోవైపు రాణిగంజ్‌లోనూ రెండు బస్సుల టైర్ల గాలిని బీజేపీ కార్యకర్తలు తీసేశారు. ముస్లింలకు రిజర్వేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబస్లీ గేటు వద్ద ఆందోళన చేసేందుకు ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ నేతల ముందస్తు అరెస్టులను ఆ పార్టీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఖండించారు. ఇది ప్రభుత్వ పిరికి చర్య అని విమర్శించారు. కాగా, అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశాలలో పాల్గొననున్నారు.