breaking news
Remote sensing
-
సాగుకు స్కానింగ్!
⇔ భారీ డిజిటల్ పరిశోధనా ప్రాజెక్టుకు ఇక్రిశాట్ రూపకల్పన ⇔ వ్యవసాయశాఖకు ప్రతిపాదన... రిమోట్ సెన్సింగ్‌తో డేటా సేకరణ ⇔ ప్రతిపాదన ఆమోదం పొందితే వచ్చే నెల నుంచి ప్రాజెక్టు ప్రారంభం ⇔ తెలంగాణలో పంటల వర్గీకరణ, కనీసం మీటరు పరిధి నేలపైనా విశ్లేషణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ భూమి, పంటలు, నేలలు తదితర అంశాలపై కచ్చితమైన శాస్త్రీయ సమాచారం అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ రంగం లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సాగు విస్తీర్ణం, ఏ నేలల్లో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారనే అంశాలపై ఎప్పుడో నిర్ధారించిన సమాచారం అరకొరగా ఉంది. దీనివల్ల వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు లోపాలతో కూడుకొని ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవసాయరంగాన్ని పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై డాక్యుమెంటు తయారు చేసి ఇస్తామని ఇక్రిశాట్ ముందుకు వచ్చింది. డిజిటల్ వ్యవసాయ పరిశోధన ప్రాజెక్టు రూపకల్పనకు రూ.169.60 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు ప్రాజెక్టు ప్రతిపాదన నివేదికను బుధవారం అందజేసింది. ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే వచ్చే నెల నుంచే ప్రాజెక్టు ప్రారంభిస్తామని ఇక్రిశాట్ తెలిపిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. డిజిటల్ ప్రాజెక్టుతో ప్రయోజనాలివి ఈ ప్రాజెక్టు పూర్తి చేశాక కచ్చితమైన మ్యాపింగ్ చేసి అందజేస్తారు. గతంలో ఆస్ట్రేలియాలో ఇలాగే ప్రాజెక్టు నిర్వహించి ఒక మీటరు, 4 మీటర్లు, 24 మీటర్లు ఇలా భూమి పరిధిని పరిగణనలోకి తీసుకొని సూక్ష్మ విశ్లేషణ చేశారు. దీనివల్ల శాస్త్రీయ డేటా సేకరిస్తారు. అంటే ఒక మీటరు వ్యవసాయ విస్తీర్ణాన్ని కూడా విశ్లేషిస్తారన్నమాట దీనివల్ల పంట దిగుబడి, ఉత్పాదకతను అంచనా వేయవచ్చు కరువు, తుఫాన్లు, చీడపీడల వల్ల పంట నష్టం వాటిల్లితే సరైన అంచనా వేయవచ్చు పంట పండించాక జరిగే నష్టాన్ని రైతువారీగా వ్యక్తిగతంగా అంచనా వేయవచ్చు ∙భూముల వర్గీకరణ శాస్త్రీయంగా అంచనా వేయడానికి వీలు కలుగుతుంది ∙పంటల సాగు కాలాన్ని, పంట పండే కాలాన్ని శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు భూగర్భ, ఉపరితల జలవనరులను అంచనా వేయవచ్చు. దానివల్ల వ్యవసాయానికి అవసరమైన ప్రణాళిక రచించవచ్చు ‘స్మార్ట్ ఫామింగ్’కు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దానివల్ల ఇన్‌ఫుట్స్, సబ్సిడీలు, కూలీలు, వ్యవసాయానికి అందజేయాల్సిన ఆర్థిక సాయాన్ని సక్రమంగా అంచనా వేయడానికి వీలుకలుగుతుంది మూడేళ్లపాటు నిర్వహణ అగ్రి మానిటర్డ్ రీ ఇంజనీరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్(అమార్ట్) పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2020 జూలై నాటికి పూర్తి చేయాలని ఇక్రిశాట్ సంకల్పించింది. దీనికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయశాఖ సహా పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకోనుంది. రాష్ట్రంలో 85 శాతం మంది సన్న,చిన్న రైతులే ఉండటంతో వారికి తగినట్లుగా పంటల విధానం ఉండలన్నది ఇక్రిశాట్ ఆలోచన. అందుకోసం రిమోట్ సెన్సింగ్ డేటాను సేకరించడం అత్యంత కీలకమైన అంశమని ఇక్రిశాట్ స్పష్టం చేసింది. మల్టీస్పెక్ట్రల్ డేటా సేకరిస్తామని వెల్లడించింది. -
రిమోట్ సెన్సింగ్‌తో పంట నష్టం అంచనా
రైతు యూనిట్‌గా పంటల బీమా అమలుకు సన్నాహాలు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటుకు సన్నాహాలు 25వ తేదీ నాటికి మార్గదర్శకాలు ఖరారు చేయనున్న ఐఆర్డీఏ హైదరాబాద్: రిమోట్ సెన్సింగ్ చిత్రాల సాయంతో ఒక రైతుకు చెందిన వ్యవసాయభూమిలో పంట నష్టం ఎంత జరిగిందో తేల్చి ‘రైతు యూనిట్‌గా పంటల బీమా’ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) నిర్ణయించినట్లు తెలిసింది. దేశంలోనే మొట్టమొదటగా రైతు యూనిట్‌గా పంటల బీమాకు రాష్ట్రంలో సన్నాహాలు జరుగుతున్నాయి. పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు వ్యవసాయశాఖతో కలసి డీఆర్డీఏ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 25వ తేదీ నాటికి పెలైట్ ప్రాజెక్టు ఎలా ఉండాలి? ఎలా అమలు చేయాలన్న దానిపై ఐఆర్డీఏ మార్గదర్శకాలు ఖరారు చేయనుంది. దిగుబడి తగ్గింపుపై నిర్ణయం ఎలా? తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత పంటల బీమా పథకంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వ్యక్తిగతంగా రైతుకు నష్టం జరిగితే బీమా ద్వారా నష్టపరిహారం అందడం లేదని భావించింది. ఈ మేరకు వ్యక్తిగతంగా పంట నష్టం జరిగినప్పటికీ రైతుకు బీమా సొమ్ము అందాల్సిందేనంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ఐఆర్డీఏ సహా పలు బీమా కంపెనీలు కూడా దీనిపై సుముఖత వ్యక్తం చేశాయి. దీనిపై ఈ నెల 25వ తేదీన జరిగే కీలక సమావేశం జరిగే నాటికి మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. పంటల నష్టానికి సంబంధించి ఒక గ్రామానికి లేదా మండలానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడం సాధ్యమే కానీ... ఒక రైతుకు వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని ఎలా అంచనా వేయగలం అన్న దానిపైనే బీమా సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పైగా దిగుబడి ఎంత తగ్గిందనే అంశాన్ని రైతు వారీగా నిర్ణయించడం ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలోనే రిమోట్ సెన్సింగ్ చిత్రాల సాయంతో సంబంధిత రైతు వ్యవసాయ భూమిలో పంట ఏమేరకు నష్టం జరిగిందోనని అంచనా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, కరువు, అతివృష్టి సమయాల్లో పంట నష్టపోయిన రైతులందరికీ సామూహికంగా బీమా చెల్లించడం కుదరదన్న దానికి కూడా పరిష్కారం కనుక్కోవాలని భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు... రైతు యూనిట్‌గా పంటల బీమా అమలు చేయడం దేశంలోనే మొదటిసారి కాబట్టి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో అమలు చేయాలని యోచిస్తున్నారు. అయితే అన్ని జిల్లాల్లోని కొన్ని మండలాలు లేదా గ్రామాల్లో అమలు చేయాలా? లేకపోతే ఒకే జిల్లాలోని నిర్ణీత గ్రామాల్లో అమలు చేయాలా? అన్న విషయంపై ఇంకా నిర్ణయానికి రాలేదు.