వైద్యం వికటించి యువతి మృతి
♦ పరారైన వైద్యుడు
♦ బంధువుల ఆందోళన
మెదక్‌జోన్: వైద్యం వికటించి ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటన జరగగానే వైద్యుడు పరారయ్యాడు. పట్టణంలోని ఆటోనగర్‌లో ఇటీవల ఉమాశంకర్ సాయిబాలాజీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆయన విద్యార్హతలు డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీ అని ఉంది.
హవేళి ఘణాపూర్ మండలం రాజిపేటకు చెందిన బాలకవిత (20)కు జ్వరం రావడంతో ఇటీవల ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ తీసిన వైద్యుడు.. కాలేయానికి నీరొచ్చిందని చెప్పి చికిత్స ప్రారంభించాడు. ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడటంతో కవితను ఆమె తల్లి పాపమ్మ ఇంటికి తీసుకెళ్లింది. సోమవారం అనారోగ్యానికి గురికావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు.
మూడు గంటల ప్రాంతంలో కవిత అపస్మారక స్థితికి చేరింది. విషయం పసిగట్టిన వైద్యుడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ, స్వయంగా ఆటో పిలిపించి పంపించాడు. అప్పటికే కవిత చనిపోయినట్లు అక్కడ ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని సాయిబాలాజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యుడు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. దీంతో మృతదేహాన్ని ఆస్పత్రిలో ఉంచి బంధువులు ఆందోళన చేపట్టారు.