breaking news
Real estate investments
-
రూ.10 లక్షలున్నా ప్రాపర్టీ కింగ్..!
ఓ ఇల్లు లేదా వాణిజ్య భవనానికి యజమాని అయితే ఆ దర్జాయే వేరు! స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా అండగా నిలిచే ప్రాపర్టీ ఉంటే చెప్పలేనంత నిశి్చంత. ప్రాపర్టీపై పెట్టుబడి ఎన్నో తరాలను ధనవంతులను చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నేడు ఇళ్లు, వాణిజ్య స్థలాల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాల లభ్యత పెరగదన్నది వాస్తవం. కనుక ప్రాపర్టీ ఇక ముందూ పెట్టుబడుల పరంగా మెరుగైన సాధనమే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టలేని వారు సైతం ప్రాపర్టీకి సహ యజమాని అయ్యే అవకాశం కల్పిస్తున్నవే ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్’లు. ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తోనే ప్రాపర్టీపై పెట్టుబడికి లభిస్తున్న అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది (గతంతో పోల్చితే) ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడికి వీలు కల్పించడం ఇందులో ఉన్న సౌలభ్యం. ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అసలు ఈ సాధనం ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలు, పన్ను తదితర అంశాల గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ఇదొక వినూత్న సాధనం. అధిక విలువ కలిగిన ప్రాపర్టీకి ఏ ఒక్కరో యజమానిగా కాకుండా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉమ్మడిగా వాటా కలిగి ఉండడం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అంటే.. తమ వాటా మేరకు రాబడి అందుకోవచ్చు. ఇల్లు కొనుగోలుకు రూ.50 లక్షలు, ఇంకా ఎక్కువే పెట్టుబడి అవసరం. ఇక్కడ మాత్రం రూ.10 లక్షలు ఉన్నా సరే ఆ మేరకు వాటా లభిస్తుంది. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయిన ప్రాంతాల్లో పెట్టుబడికి ఎంతో అనుకూలం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ నిబంధనలు (సవరణ), 2014కు మార్పులు చేయడం ద్వారా సెబీ కొత్తగా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్) విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌ను నియంత్రణల పరిధిలో మరింత మందికి చేరువ చేసేందుకు, పారదర్శకత, సౌలభ్యం కోసం తీసుకొచ్చింది. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (పాక్షిక యాజమాన్యం)ను ఆఫర్ చేసే ప్రతి ప్లాట్‌ఫామ్ కూడా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్)గా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కు బదిలీ చేస్తాయి. ఆఫీస్ వసతులు, గోదాములు, డేటా సెంటర్లు తదితర వాటిపై ఎస్పీవీ పెట్టుబడులు పెడతాయి. ప్రతి పెట్టుబడిదారుడికి వారి వాటా మేరకు డిజిటల్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. రాబడులను వారి వాటాకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. సెబీ నియంత్రణ ఎస్ఎం రీట్ సాధనాలు సెబీ పర్యవేక్షణ కింద పనిచేస్తుంటాయి కనుక రక్షణ ఉంటుంది. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌లు తమ నిర్వహణలోని ఆస్తుల విలువను రెండేళ్లకోసారి స్వతంత్రంగా మదింపు వేయించి, ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. పనితీరు, ఆస్తుల వివరాలు, రిస్‌్కలు, ప్రయోజన వైరుధ్యం తదితర సమాచారాన్ని వెల్లడించాలి’’ అని ట్రైలీగల్కు చెందిన కునాల్‌షా తెలిపారు. వీటిలో రకాలు.. నివాస భవనాలు: ఇందులో పెట్టుబడిపై అద్దె ఆదాయం మోస్తరుగా ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువ సైతం వృద్ధి చెందుతుంది. వాణిజ్య ప్రాపర్టీలు: అధిక అద్దె ఆదాయం లభిస్తుంది. పెట్టుబడి విలువ వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రాపర్టీ కొంత కాలం పాటు ఖాళీగా ఉండడం వంటి కొన్ని రిస్‌్కలు ఇందులో ఉంటాయి. ఎమర్జింగ్ అస్సెట్ క్లాసెస్: గోదాములు, డేటా సెంటర్లు, కో–వర్కింగ్ స్పేస్‌లకు ఇవి వేదికగా ఉంటాయి. వీటిల్లో పెట్టుబడిపై అద్దె రాబడి స్థిరంగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువ. కనుక వసతులు ఖాళీగా ఉండకుండా అద్దె ఆదాయం స్థిరంగా లభిస్తుంది. పెట్టుబడులకు వైవిధ్యం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పరంగా వైవిధ్యం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌తో సాధ్యపడుతుంది. భారీ పెట్టుబడి ఒకే ప్రాపర్టీకి పరిమితం కాకుండా చూసుకోవచ్చు. ఒకటికి మించిన ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆదాయంలో వైవిధ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే ప్రాంతం కాకుండా భిన్న ప్రాంతాల్లోని, భిన్న రకాల ప్రాపర్టీలపై (ఆఫీసులు, గోదాములు, ఇళ్లు) పెట్టుబడి పెట్టుకోవడం ఇందులో ఉన్న సౌలభ్యం. అయితే అన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లు ఎస్ఎం రీట్లుగా నమోదై లేవు. పెట్టుబడి వృద్ధితోపాటు రాబడి స్థిరమైన ఆదాయానికితోడు పెట్టుబడి విలువ కూడా నిరీ్ణత కాలంలో ఎంతో కొంత వృద్ధి చెందుతుంది. ఆస్తులను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ప్రాపర్టీల నిర్వహణ, కిరాయిదారుల నుంచి అద్దెలు వసూలు, చట్టపరమైన ప్రక్రియలను అనుసరించడం తదితర బాధ్యతలన్నింటినీ వారు చూసుకుంటారు. కనుక పెట్టుబడిదారులకు ఈ తలనొప్పులేవీ ఉండవు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం 500–600 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.5,160 కోట్లు) ఉంటుందని ఖైతాన్ అండ్ కో పార్ట్నర్ హర్ష్ పారిఖ్ తెలిపారు. వచ్చే 8–10 ఏళ్లలో 5 నుంచి 5.5 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.47,300 కోట్లు) చేరుకుంటుందని అంచనా వేశారు.పెట్టుబడికి ముందు చూడాల్సినవి.. → ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లు సెబీ వద్ద నమోదయ్యాయా? లేవా అన్నది తప్పకుండా చూడాలి. అంతేకాదు ప్రాపర్టీ సైతం రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. లీజు డాక్యుమెంట్లు, యాజమాన్యం వివరాలను సరి చూసుకోవాలి. → కొన్ని ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుబడికి లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. → సొంతంగా ప్రాపర్టీ కొనుగోలుకు భారీ పెట్టుబడి అవసరం. కావాలనుకున్నప్పుడు వేగంగా విక్రయించడ అన్ని వేళలా సాధ్యపడదు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అయినా లేదా ఎస్ఎం రీట్లు అయినా కొంచెం వేగంగా విక్రయించుకోవచ్చు. → కొన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లు (సెబీ వద్ద నమోదు కాని) రూ.5 లక్షల నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నాయి. వీటి రిజిస్ట్రేషన్, వాస్తవికత తెలుసుకున్న తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్ లేదా రీట్ల్లో ఈ తరహా రిస్క్ ఉండదు. కానీ సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో లేవు. అదే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లు చాలా ఉన్నాయి. → కనీస పెట్టుబడి అన్నది ప్లాట్‌ఫామ్ ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ ప్లాట్‌ఫామ్‌లోనూ రూ.10 లక్షలే ఉండాలని లేదు. → ఎంపిక చేసుకునే ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది? అక్కడ లీజుకు ఉన్న డిమాండ్ ఏ పాటిది? భవిష్యత్తులో బలమైన వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమేనా? తదితర అంశాలను పరిశీలించాలి.ఎవరికి అనుకూలం? స్థిరమైన ఆదాయం కోరుకునే విశ్రాంత జీవులు, ఇతరులు ఎవరికైనా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ లేదా ఎస్ఎం రీట్లు అనుకూలమే. సంప్రదాయ ఈక్విటీలు, డెట్ సాధనాలకు అదనంగా వైవిధ్యం కోసం అనుకూలిస్తాయి. ‘‘అద్దె రూపంలో 8–9 శాతం రాబడులు ఎంతో మెరుగైనవి. పైగా ఈ రాబడి ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. ఏటా 5 శాతం మేర పెరుగుతూ ఉంటుంది’’ అని ‘ప్రాపర్టీ షేర్’ సహ వ్యవస్థాపకుడు కునాల్ మోక్తాన్ వివరించారు. ఏడాది మించిన పెట్టుబడి దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎం రీట్లు పంపిణీ చేసే డివిడెండ్లపై పన్ను లేదు. వడ్డీ ఆదాయం మాత్రం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఎస్ఎం రీట్ – రీట్ → రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) అన్నది ఒక కంపెనీ. ఆదాయాన్నిచ్చే వాణిజ్య ఆస్తులను నిర్వహిస్తుంటుంది. షేర్ల మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయిన రీట్లను ఒక్క యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. సిప్ మాదిరే ప్రతి నెలా కొద్ది మొత్తం పెట్టుబడులకు లిస్టెడ్ రీట్లకు అనుకూలమైన సాధనం. ఇవి పెద్ద స్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. నేరుగా కాకుండా పరోక్షంగా అన్ని ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు మధ్య, చిన్నస్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో ఇన్వెస్టర్ ఎంపిక మేరకు ఒక ప్రాపర్టీ లేదా ఒకటికి మించిన ప్రాపర్టీల్లో పెట్టుబడులకు వీలుంటుంది. ఒక విధంగా ఇది ప్రత్యక్ష పెట్టుబడి. ఒకటికి మించిన ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉండదు. ప్రతీ ప్రాపర్టీకి విడిగా సర్టిఫికెట్ జారీ చేయాల్సిందే. → ఎస్ఎం రీట్లు రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. రెగ్యులర్ రీట్లు రూ.500 కోట్లకు పైగా విలువైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. → ఎస్ఎం రీట్లలో తమకు ఇష్టమైన ప్రాపర్టీని ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ప్రాపర్టీ వారీగా విడివిడిగా ఉంటుంది. రీట్‌లో ఇందుకు అవకాశం లేదు. → ఎస్ఎం రీట్లలో కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. రెగ్యులర్ రీట్లలో కనీసం ఒక యూనిట్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు కనీసం 5–6 ఏళ్లు, అదే రెగ్యులర్ రీట్లు అయితే మరింత దీర్ఘకాలం కోసం ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ఎందుకు? అసలు ప్రాపర్టీపై ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? రాబడి కోసమా, సంపద సృష్టి కోసమా అన్నది తేల్చుకోవాలి. ఎందుకంటే రాబడి, పెట్టుబడి విలువ వృద్ధి కోరుకునే వారికి ఈ తరహా డిజిటల్ రియల్ ఎస్టేట్ సాధనాలే అనుకూలం. ఒకవేళ సొంత వినియోగం కోసం అయితే నేరుగా ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఒక ప్రాపర్టీని సొంతంగా కొనుగోలు చేసుకోవడానికి పెద్ద మొత్తం పెట్టుబడి కావాలి. అంత స్తోమత లేని వారికి ఈ తరహా సాధనాలు అనుకూలం. పైగా పెట్టుబడులు అన్నీ ఒకే విభాగంలో ఉండరాదు. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం చక్కని సమతూకంతో, రిస్క్ పరంగా మెరుగైన ప్రణాళిక అవుతుంది. రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడికి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లేదా రీట్లను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికంటే ముందు రిస్క్‌లు, సానుకూలతలు, ప్రతికూలతలను సమగ్రంగా తెలుసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రాజధాని ముసుగులో ‘రియల్’ దందా
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి ధ్వజం రేపల్లె : రాజధాని ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పట్టణంలో మంగళవారం రాత్రి ఒక శుభ కార్యానికి హాజరైన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమి సేకరణకు మాత్రమే వ్యతిరేకమన్నారు. 3 వేల ఎకరాల్లో అన్ని హంగులతో రాజధానిని నిర్మించుకోవచ్చని తెలిపారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేందుకే ఏడాదికి మూడు పంటలు పండే బంగారు భూములను బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా జరగని కుంభకోణం రాజధాని ముసుగులో ఇక్కడజరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకపడిందంటూ సంక్షేమ పధకాలకు కత్తెర వేస్తున్న చంద్రబాబు రాజధాని శంకుస్థాపన పేరుతో రూ400 కోట్లు నీళ్ళప్రాయంగా ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఈ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోవటంతో మైలలో ఉన్న చంద్రబాబు కుప్పంలో మట్టి-నీరు ఎలా తీసుకువచ్చారన్నారు. మైలలో ఉండి మట్టి - నీరు తీసుకువచ్చి దేవునిపట్ల, ఆచారాలపట్ల అపచారం చేసిన చంద్రబాబు దేవుడికి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయన వెంట వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకుడు అల్లంశెట్టి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.