breaking news
rayadurgam mla
-
బెంగళూరుకు కాపు తరలింపు
బళ్లారి : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని మంగళవారం రాత్రి విమ్స్ వైద్యుల సూచన మేరకు బెంగళూరు కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం ప్రత్యేక చికిత్సలు చేపట్టారు. విమ్స్‌లో రైల్స్ ట్యూబ్ ద్వారా పురుగులు మందును బయటకు తీశారు. పామ్స్, ఆట్రోపిన్ యాంటిబయాటిక్ మందులు ఇస్తూ చికిత్సలు చేపట్టారు. ఐసీయూలోకి తరలించినా జన సందోహాన్ని పోలీసులు నియంత్రించడానికి వీలుకాలేదు. దీంతో మెరుగైన చికిత్స అందించాలంటే ప్రత్యేక వాతావరణం ఉండాలని వైద్యులు నిర్దారణకు వచ్చారు. అంతేకాకుండా 48 గంటల వరకు ఎలాంటి హామీ ఇవ్వలేమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల సమయంలో ప్రైవేటు అంబులెన్స్‌లో బెంగళూరులోని కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో విమ్స్ వైద్యులు, కాపు సతీమణి భారతి, తనయుడు ప్రవీణ్ ఇతర ప్రముఖులు బయలుదేరి వెళ్లారు. నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటాం : భారతి కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి సాక్షితో మాట్లాడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులే కారణమన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే తమ కుటుంబసభ్యులంతా పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాపును పరామర్శించిన ప్రముఖులు బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతున్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. బళ్లారి ఎంపీ శాంత, రాయచూరు ఎంపీ సన్నపక్కీరప్ప, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, ఆలమూరు సాంబశివారెడ్డి, చవ్వా రాజశేఖర రెడ్డి, బళ్లారి టచ్ఫర్ లైఫ్ ఫౌండేషన్ అధినేత నారా భరత్‌రెడ్డి, మాజీ ఉపమేయర్ శశికళ, మాజీ కార్పొరేటర్ కేఎస్. దివాకర్ వీరశంకర్రెడ్డి, మానవహక్కుల సంఘం నాయకులు ప్రవీణ్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, భోజరాజు నాయక్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నం
* వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఖాకీల దౌర్జన్యానికి నిరసన * పురుగు మందు తాగిన రామచంద్రారెడ్డి * ఆరోగ్య పరిస్థితి విషమం * బళ్లారిలో చికిత్స.. బెంగళూరుకు తరలింపు * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిచిన పోలీసులు * ఆపై బూట్లు, లాఠీలతో చితకబాదిన ఖాకీలు * నిరసనగా స్టేషన్ ఎదుట కాపు బైఠాయింపు, ఆత్మహత్యాయత్నం * ఇది జీర్ణించుకోలేక అదే స్టేషన్ వద్ద కిరోసిన్ పోసుకున్న కార్యకర్త రాయదుర్గం/బళ్లారి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులను బైండోవర్ల పేరుతో పోలీసులు చితకబాదడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం రాయదుర్గం పోలీస్‌స్టేషన్ వద్దే ఆయన పురుగుల మందు తాగారు. అనంతరం ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో వెంటనే బళ్లారి విమ్స్ ఆస్పత్రికి, ఆపై రాత్రి బెంగళూరుకు తరలించారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నాన్ని జీర్ణించుకోలేక ఓ కార్యకర్త పోలీస్ స్టేషన్ వద్ద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించడంతో పోలీసులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో రాయదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసలేం జరిగింది? మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయన్న నెపంతో మంగళవారం పోలీసులు దాదాపు వంద మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను స్టేషన్‌కు పిలిపించి లాఠీలు ఝుళిపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు విషయాన్ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని, బూట్లు, లాఠీలతో కుళ్లబొడిచారని సర్పంచులు, వార్డు సభ్యులు ఆరోపించారు. వెంటనే ఆయన పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చారు. స్టేషన్ లోపలికి ఎమ్మెల్యేను రాకుండా అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏ కారణంతో కొడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. తాము ఎవ్వరినీ కొట్టలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో దెబ్బలు తిన్నవారు ‘మమ్మల్ని కొట్టలేదా?’ అంటూ లేవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రపతి పాలనను ఆసరాగా చేసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని కాపు మండిపడ్డారు. సర్పంచులు, నాయకులను పశువులను కొట్టినట్లు చితకబాదడం ఏంటని ప్రశ్నించారు. చట్ట ప్రకారం బైండోవర్లు చేయాల్సిన పోలీసులు గూండాలు, రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పురుగుల మందు డబ్బా లాక్కున్నా.. ఇంతలో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలను పోలీసులు తోసివేసేందుకు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సమీపంలో ని ఓ రైతు చేతిలో ఉన్న పురుగుమందు డబ్బాను లాక్కుని ‘నా వద్దకు రావద్దు.. మీరు ప్రవర్తించిన తీరుతో కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. మీ వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకుంటాను’ అని హెచ్చరిస్తూ మూత తీసి తాగబోయారు. పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకోవటంతో ఒక్క ఉదుటున పక్కకు వచ్చిన ఎమ్మెల్యే.. రైతు వద్ద నున్న మరో బాటిల్‌ను లాక్కుని మూత తీసి పురుగుమందు తాగారు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ పోలీసుల్ని తోసేశారు. దీంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. అనంతరం కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. 50 మిల్లీలీటర్ల వరకు పురుగుల మందు తాగారని, పరిస్థితి కొంత వరకు విషమంగా ఉందని చెబుతూ బళ్లారికి తీసుకెళ్లాలని సూచించారు. ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే సతీమణి కాపు భారతి కన్నీరు పెడుతూ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. బళ్లారిలో చికిత్స.. బెంగళూరుకు తరలింపు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం రామచంద్రారెడ్డిని బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించాక సాయంత్రం విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా 24 గంటలు గడిచాకే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందన్నారు. అయితే రాత్రి ఏడు గంటలైనా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఎమ్మెల్యేను బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతకు ముందు ఎమ్మెల్యేను చూసేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బళ్లారి విమ్స్‌కు తరలి వచ్చారు. కాపు రామచంద్రారెడ్డిని బళ్లారి ఎంపీ శాంత, రాయచూరు ఎంపీ సన్నపక్కీరప్ప తదితరులు పరామర్శించారు. పోలీసుల తీరు అమానుషం: గురునాథరెడ్డి, కేతిరెడ్డి అనంతపురం టౌన్, న్యూస్‌లైన్: పోలీసుల వ్యవహార శైలి వల్ల ఒక ప్రజాప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే ఇంతకన్నా దౌర్భాగ్యముంటుందా? అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నామా? లేక పోలీసుల పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో గురునాథరెడ్డి నివాసం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. వారిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా తెలుగుతల్లి సర్కిల్ వద్దపోలీసులు అడ్డుకున్నారు. ఒకరిద్దరు మాత్రమే వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు రోడ్డుపైనే అరగంట పాటు బైఠాయించారు. దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు కొందరిని మాత్రమే లోనికి పంపిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన సీఐ భాస్కర్‌రెడ్డిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కిరోసిన్ పోసుకున్న వికలాంగుడు.. ఎమ్మెల్యే ఆత్మహత్యకు యత్నించడాన్ని జీర్ణించుకోలేక గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన వికలాంగుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాజశేఖరరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోసి కిరోసిన్ బాటిల్‌ను లాక్కుకున్నారు. ఈ సమయంలో అతడి కళ్లలో కిరోసిన్ పడడంతో పోలీసులు ఆస్ప్రతికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అందుకు నిరాకరించిన అతడు.. స్టేషన్ వద్దే బైఠాయించాడు. ఎమ్మెల్యేకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని, దేవుడి లాంటి మనిషి కోసం ఎంత మంది ప్రాణాలు తీసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నాడు. చివరకు కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించాడు. నా భర్తకు ఏమైనా జరిగితే ఆత్మహత్య చేసుకుంటాం ‘‘నా భర్త ఆత్మహత్యాయత్నానికి పోలీసులే కారణం. ఆయనకు ఏమైనా జరిగితే మా కుటుంబసభ్యులమంతా పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటాం.’’ - కాపు భారతి, రామచంద్రారెడ్డి సతీమణి -
'కాపు' కుటుంబ సభ్యులకు జగన్ ఫోన్
నిడదవోలు(పశ్చిమగోదావరి జిల్లా): ఆత్మహత్యాయత్నం చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కాపు రామచంద్రారెడ్డి భార్యతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రామచంద్రారెడ్డి ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన భర్తను పోలీసులు వేధించిన తీరును జగన్‌కు రామచంద్రారెడ్డి సతీమణి వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై అనంతపురం పోలీసుల చర్యలను జగన్ ఖండించారు. కాపు రామచంద్రారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో రామచంద్రారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన ప్రస్తుతం బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
షర్మిల బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం అనంతపురంలో వెల్లడించారు. ఆ మహానేత కుటుంబంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్రను సెప్టెంబర్ 2న తిరుపతిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.