breaking news
rayachoor
-
ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్
రాయచూరు-తెలంగాణ సరిహద్దులోని శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా జరిగిన తవ్వకాల్లో కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ముఖ్యంగా శివ లింగం శ్రీకృష్ణుని దశావతార విగ్రహాలను సురక్షితంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే. అయతే రాయచూర్ యూనివర్శిటీలోని చరిత్ర, పురావస్తు శాఖ అధ్యాపకులు డాక్టర్ పద్మజ దేశాయి ఏమంటున్నారంటే..! "రాయచూరు, హంపి పరిసరాల్లోని 30 గ్రామాల్లో ప్రాచీన దేవాలయాలపై పీహెచ్డీ చేశాను నేను. కృష్ణ నదీ తీరంలో బయటపడ్డ ఈ విష్ణుమూర్తి విగ్రహం 11వ శతాబ్ధానికి చెందినది కావచ్చునని, కళ్యాణ చాళుక్యుల కాలంలో తయారైందని ప్రాథమిక అంచనా ఉంది. కచ్చితమైన కాలావధి కావాలంటే కార్బన్ డేటింగ్ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో తాము పలు విగ్రహాలు చూశామని గ్రామస్తులు పలుమార్లు చెప్పేవారు. తాజాగా నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల కొన్ని విగ్రహాలు అందరికీ కనిపించాయి. పైగా అయోధ్య రామ మందిరం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం కావడం, అక్కడి రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్ చెక్కడం వంటి నేపథ్యంలో రాయచూరుకు సమీపంలో బయటపడ్డ విగ్రహాన్ని చాలామంది రామ్ లల్లా విగ్రహంతో పోల్చి చూశారు. అయితే నా అంచనా ప్రకారం ఈ విగ్రహం వెంకటేశ్వరుడిది అయ్యేందుకు అవకాశముంది. ఎందుకంటే విగ్రహం దొరికిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు కావడం.. ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడి ఆరాధన ఎక్కువగా ఉండటం. అంతేకాదు.. విగ్రహ లక్షణాలను గమనిస్తే దీనిపై శంఖు, చక్రాలు అన్నాయి. తిరుపతి వెంకటేశ్వరుడి మాదిరిగానే అభయ, వరద హస్తాలు ఉన్నాయి. కళ్యాణ చాళుక్యుల కాలంలో అటు శైవారాధనతోపాటు వైష్ణవారాధన కూడా జరిగేది. ఇందుకు తగ్గట్టుగా ఈ విష్ణుమూర్తి విగ్రహం బయటపడ్డ ప్రాంతంలోనే శివలింగమూ లభించింది. ఇంకో విషయం.. ఈ విగ్రహాలు బయటపడ్డ చోట ఆలయం లాంటివి ఏమీ లేవు.’’ - డాక్టర్ పద్మజ దేశాయి, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ లెక్చరర్,రాయచూర్ యూనివర్శిటీ. -
మాన్వి వద్ద రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి
రాయచూరు రూరల్ : జిల్లాలోని మాన్వి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు త్రీవంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళుతున్న ఇన్నోవా కారు రాయచూరు నుంచి హుబ్లీకి వెళుతున్న స్విఫ్ట్ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. రాయచూరు నుంచి హుబ్లీకి కొత్త ఇంటి సామానుల కొనుగోలుకు వెళుతున్న రాయచూరు తాలూకా గాణదిన్నికి చెందిన న్యాయవాది సురేష్‌రెడ్డి, హంచినాళకు చెందిన గంగాధర పాటిల్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు రోహిత్, హనుమంతు, చెన్నమ్మ, దేవరాజులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రాయచూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.