breaking news
Ravindra Nagar
-
క్రికెట్ బుకీ అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని రవీంద్రనగర్ మరాఠివీధిలో నివసిస్తున్న పాగల విశ్వనాథరెడ్డి అనే క్రికెట్ బుకీని గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. గురువారం రాత్రి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వనాథరెడ్డి 2015లో తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో, 2016లో టుటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు క్రికెట్ బుకీల కేసుల్లో నిందితుడిగా ఉండి అరెస్టు అయ్యాడన్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాపాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే వారు అతని దగ్గరికి వస్తారేమోనని చెన్నూరుకు చెందిన మరో బుకీ మాధవరెడ్డి తనవద్ద ఉన్న రూ. 4 లక్షలు, అలాగే కిలో గంజాయిని నిందితుడు విశ్వనాథరెడ్డికి ఇచ్చి వెళ్లాడన్నారు. అదే సమయంలో తమ ఎస్ఐలు నాగరాజు, ప్రతాప్‌రెడ్డిలకు వచ్చిన సమాచారంతో సిబ్బందితో దాడి చేశారన్నారు. విశ్వనాథరెడ్డి నుంచి రూ. 4 లక్షల నగదు, సెల్‌ఫోన్, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు. మాధవరెడ్డి పరారీలో ఉన్నాడని తెలిపారు. -
అతడు.. బా(ద్)షా!
కడప: మాసిన దుస్తులు, అరిగిన చెప్పులు.. తలపై టోపీ, వెంటొక స్కూటీ.. చుట్టూ సమోసా బ్యాగులు. అతడు.. సగటు మనిషి, సమోసా వ్యాపారి. వడలిన దేహం, వదలని దరిద్రం.. ఆకలి పేగులు, చాచిన చేతులు.. చుట్టూ జాలి లేని సమాజం. వారు.. అయినవారు లేని అనాథలు, దిక్కులేని పక్షులు. అతడు.. వారి కోసం రోజూ వస్తాడు. సమోసాలతో పాటు వారి ఆశలను మోసుకొస్తాడు. అతడు.. సయ్యద్‌బాషా. కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన చిరువ్యాపారి. మూడేళ్లుగా సమోసాలు తయారు చేసి పలు షాపులకు అమ్ముకుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలు తిరిగి సరుకు ఇస్తుంటాడు. తద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే ఆనందంగా బతుకుతున్నాడు. రెండేళ్ల క్రితం.. ఓసారి పూర్తిస్థాయిలో సమోసాలు అయిపోలేదు. మరుసటి రోజుకు అవి చెడిపోతాయి. ఆకలి విలువ తెలిసినవాడు కనుక వాటిని వృధా చేయలేదు. అన్నార్తులకు ఇచ్చాడు. ఆబగా అందుకుని తిన్న వారి కళ్లలో కొత్త వెలుగు కన్పించింది. ఆ వెలుగులో బాషా ఆత్మసంతృప్తి వెతుక్కున్నాడు. వ్యాపారంలో వచ్చే లాభం కంటే.. తోటి మనుషులకు చేసే సాయమే ఎక్కువ సంతోషాన్నిస్తుందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి కడపలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే వృద్ధులకు ప్రతిరోజు రాత్రి 200 సమోసాలను ఇస్తూ వస్తున్నాడు. పేదవారికి సాయం చేయడానికి పెద్దమనుషులే కానక్కర్లేదని నిరూపిస్తున్నాడు. మానవత్వముంటే చాలునని చాటుతున్నాడు. పిడికెడు మెతుకులకు తపస్సు చేసే వారి కోసం తమస్సులో సైతం తపిస్తున్నాడు. అందుకే అతడు.. మనసున్న బాద్షా!