breaking news
Ratnakar Reddy research
-
చిత్రం.. భళారే విచిత్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రాచీన మానవులు వారి చిత్రాలు, కళలతో నేటికీ మనతో సంభాషిస్తున్నారు. వారి సంస్కృతి, జీవన విధానాన్ని చిత్రాలుగా మలచి తమ గురించి తెలుసుకోమంటున్నారు. నాటి మానవుల సృజనాత్మకతకు అద్దం పట్టే అనేక శిలా చిత్రాలు మనం చాలానే చూశాం. కానీ ఒకే చిత్రాన్ని 60 సార్లకుపైగా ఓ బండపై గీయడం (పెట్రోగ్లిఫ్స్), అది కూడా బండపై ఎక్కడా ఖాళీ లేకుండా వేయడం చూశామా..! అలాంటి అరుదైన రాతి కళాఖండం తెలంగాణలో ఏదులాబాద్ గ్రామంలో వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా వీరన్నపేట గ్రామంలో అతిపెద్ద శిలా చిత్రాల స్థావరాన్ని కనుగొన్న చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డే దీన్ని కనుగొన్నారు. ఏమిటీ చిత్రం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఏదులాబాద్ గ్రామం ఉంది. ఆ గ్రామ పరిధిలో ఊర గుట్ట, వడిసెల గుట్ట, పాండవుల గుట్ట, పరశురాముల గుట్ట, ఓబులేశుని గుట్ట, కొలను గుట్ట, కుందేళ్ల గుట్ట, చింతగుట్ట, దశగుట్ట, కోటగుట్ట, గరుడాద్రి గుట్ట, భైరవ గుట్ట ఉన్నాయి. ఇక్కడి భైరవగుట్టపై 9 తలల కాలభైరవుడు, ఆంజనేయుడి విగ్రహాలు, శాసనాలున్నట్లు గతంలో చరిత్ర కారులు కనుగొన్నారు.ఈ గుట్టలోనే దేశంలో అరుదైన శిలా చిత్రాలున్న బండ ఉంది. సుమారు 1.5 మీటర్ల ఎత్తు, 4.5 మీటర్ల చుట్టుకొలత ఉన్న ఈ బండపై ఒకే చిత్రాన్ని సుమారు 60 సార్లు వేశారు. ఇంగ్లిష్‌లో బ్లాక్ అవుట్ సన్‌రైజ్ పద్ధతి ఉంది. ఇందులో రెండు గీతల మధ్య ఖాళీ వదులుతూ అక్షరాలు రాస్తారు. ఆ పద్ధతిలో ఇంగ్లిష్ ఐ అక్షరాన్ని పోలిన చిత్రాలనే బండపై గీశారు. బండ బండకూ చరిత్రే ముచుకుంద (మూసీ) నదీ తీరాన ఏదులు గుంపులుగా సంచరించిన ప్రాంతాన్నే ఏదులాబాద్‌గా పిలుస్తున్నారు. గ్రామపరిధిలో 12 వరకు గుట్టలు, పరుపు బండలు, ఐదారు శాసనాలు, భైరవ, హనుమాది శిల్పాలు, దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి బండకూ ఓ చరిత్ర ఉంది. భైరవగుట్ట దిగువన ఉన్న బండపైనే ఒకే చిత్రాన్ని 60 సార్లు వేశారు. ఈ గ్రామంలోని తిరుమలేశుని బండపై నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు నూరుకోగా ఏర్పడిన గుర్తులున్నాయి.వీటిని ఇంగ్లిష్‌లో గ్రూప్స్ అంటారు. గ్రామీణ క్రీడ సిర్రగోనె ఆటలో త్రవ్వే పొడవైన బద్దులను ఇవి పోలి ఉంటాయి. భైరవగుట్ట, ఊరగుట్టల సమీపంలో బృహత్ శిలాయుగపు సంస్కృతి ఉంది. రాకాసి గుళ్లుగా పిలిచే సమాధులు ఇక్కడ సాగులో భాగంగా తొలగించారు. వీటి ఆధారంగా ఈ శిలా చిత్రాలు ఆది మానవులు గీసినవేనని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 9 తలల భైరవుడు ఏదులాబాద్ భైరవ గుట్టకు చెక్కిన భైరవునికి 9 తలలు, 16 చేతులున్నాయి. పౌరాణికాల్లో భైరవునికి ఇన్ని తలలున్నట్లు చెప్పలేదు. సదాశివునికి 5 తలలే ఉంటాయి. బౌద్ధంలో, అందులో తాంత్రిక బౌద్ధంలో వజ్ర భైరవునికి 9 తలలు, 16 చేతులుంటాయి. 9 తలలున్న మరో భైరవుని పేరు యమాంతకుడు. ఈ భైరవుల చిత్రాలు నేపాల్ దేశంలోనే కనిపిస్తాయి. మనదేశంలో 9 తలల హిందూ భైరవుడు ఏదులాబాద్‌లోనే ఉన్నాడు. భైరవతంత్రం, అష్టవిధ భైరవులలో లేని ఈ అరుదైన భైరవుణ్ని ఏదులాబాద్‌లో ఎవరు చెక్కారో, ఎందుకు చెక్కారో తెలియాల్సి ఉంది. – రామోజు హరగోపాల్, తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలు జరపాలి ఏదులాబాద్ గుట్టల్లో 2 శాసనాలు, 9 తలల కాలభైరవ శిల్పం, పెట్రోగ్లిఫ్స్ (రాతిని తొలిచి చెక్కిన బొమ్మలు) ఉన్నందున క్వారీ పనులు ఆపాలి. పురావస్తు శాఖ సమగ్ర పరిశోధన జరిపి ఇక్కడ చరిత్రను ప్రజలకు తెలపాలి. ఇక్కడి శాసనాలు, వాటి వివరాలు తెలిపే బోర్డును గుట్టపై ప్రదర్శించాలి. - రత్నాకర్‌రెడ్డి, పరిశోధకుడు -
జనగామలో ‘కప్యూల్ పిరమిడ్స్’!
రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో వెలుగు చూస్తున్న కొత్త చరిత్ర జనగామ : వరంగల్ జిల్లా జనగామ చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తుంది. గురువారం పురావస్తు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి ఈ ప్రాంతంలోని చరిత్ర విశేషాలు వెల్లడించారు. జనగామ డివిజన్లో గతంలోనే నిలువు రాళ్లు, గృహ సమాధులు, చరిత్ర కలిగిన శిలలు వెలికితీసినట్లు తెలిపారు. జనగామ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో పరుపు బండపై అనేక కప్యూల్ పిరమిడ్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. పిరమిడ్ రాక్ ఎత్తు 12 సెంటీమీటర్లు, వైశాల్యం 59 చదరపు సెంటీమీటర్లు ఉండగా, 3,072 సెంటీ మీటర్ల చుట్టూ కొలత ఉందని వివరించారు. దీనిపైనే నవీన శిలాయుగంలో కప్యూల్స్ చెక్కినట్లు కనిపించాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిశోధనలు ఎక్కువగా జరగక పోవడంతో ఇంతటి చరిత్ర బయటకు రాలేదన్నారు. రేఖా గ ణితాన్ని కప్యూల్స్పై చూపించారని ప్రపంచ పరిశోధకులు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పుడు పిల్లవాడు జన్మించగానే లెక్కల కోసం అని కూడా ప్రచారంలో ఉందని చెప్పారు. గ్రహాలు, రాశులు మొదలైన నక్షత్ర మండలాన్ని సంకేత రూపంతోపాటు మానవుని ప్రయాణ సంకేతాల కోసం కావచ్చని ఊహిస్తున్నారు. గుండ్రని రాళ్లపై ఒకే చోట 8,490 దెబ్బలను 72 నిమిషాలపాటు కొడితే 1.9 మిల్లీమీటర్ల కప్యూల్స్ ఏర్పడుతుందని పురావస్తుశాఖకు చెందిన జి.కుమార్ కనిపెట్టారని తెలిపారు. జనగామలో 55 మానవ నిర్మిత కప్యూల్స్ జనగామలో పిరమిడ్ రాక్‌పై 55 వరకు మానవ నిర్మిత కప్యూల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. వీటి తయారు చేసేందుకు ఐదు లక్షల దెబ్బలు అవసరమన్నారు. దీంతో బలమైన విశ్వాసాలు ఆనాటి మానవ సమాజంలో ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆది మానవుల రేఖాగణిత ప్రజ్ఞను ఆయన ప్రశంసించారు. జనగామలోని పిరమిడ్స్ బేసి సంఖ్యలో ఉండడం విశేషమన్నారు. ప్రతి దిక్కున ఒక్కొక్క కప్యూల్స్ని సుద్దముక్కతో కలపగా పిరమిడ్, రాంబస్, వృత్తం ఆకారాలు ఏర్పడుతున్నాయని వివరించారు. పిరమిడ్ శిఖరాల లోపల వర్షపు నీరు నిండిన కొలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. బయ్యన్న కంచెలో వెలుగు చూసిన చారిత్రక ఆధారాలను భావి తరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రత్నాకర్‌రెడ్డి కోరారు. జనగామ డివిజన్లోని చరిత్ర సంపదను ఒక్కచోటకు చేర్చి మ్యూజియం ఏర్పాటు చేయూలన్నారు. కాగా, ఈ పరిశోధనలో విద్యార్థులు శ్రీనివాస్, సఫి, ఇమ్రాన్ పాల్గొన్నారని రత్నాకర్‌రెడ్డి తెలిపారు.