breaking news
Ranga Reddy Collectorate
-
నాగారం భూములపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని గైరాన్ సర్కారీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించినా.. ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని జూన్‌లో తాము ఆదేశించినా.. ఇప్పటివరకు ఎందుకు సమర్పించలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. నిర్మాణాలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఇతరులకు నోటీసులు జారీ చేసింది.నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని గైరాన్ భూములను కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని గతంలో బిర్లా మల్లేశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం, నిర్మాణాలు చేపట్టడం సహా ఎలాంటి మార్పులు చేయవద్దని ప్రతివాదులకు తేల్చిచెప్పడం తెలిసిందే. న్యాయస్థానం ఉత్తర్వులున్నా వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మల్లేశ్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. జూన్‌లో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు వారాల్లో పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సమాధానమిస్తూ నివేదిక అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయినా ఇప్పటివరకు కలెక్టర్ నివేదిక దాఖలు చేయలేదంటూ మహేశ్ మరో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు.పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు రెండు వారాలు గడువు ఇచ్చి దాదాపు మూడు నెలలు కావస్తున్నా కలెక్టర్ ఇప్పటివరకు నివేదిక అందజేయలేదన్నారు. ఇది న్యాయస్థానం ఉత్తర్వుల ధిక్కరణే అవుతుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్టోబర్ 10లోగా నివేదిక దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తొలి ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణ వాయిదా వేశారు. -
రంగారెడ్డి కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం
► వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా చెలరేగిన మంటలు ► ప్రాణభయంతో పరుగులెట్టిన అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమయం మధ్యాహ్నం 2.50 గంటలు. ప్రశాంతంగా కొనసాగుతున్న వ్యవసాయ శాఖ వీడియో కాన్ఫరెన్స్ .. ఇంతలో ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చుట్టూ దట్టంగా ఆవహించిన పొగ.. ప్రాణభయంతో అధికారులు, సిబ్బంది పరుగులు.. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కనిపించిన ప్రమాదకర దృశ్యాలివి. స్నేహ సిల్వర్ జూబ్లీ భవనం మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ హాలు అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో ఆ హాలులో 30 మందికిపైగా ఉండటం గమనార్హం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పైన ఉన్న ఇంటీరియర్‌కు తాకాయి. అది ముందే ఏసీ హాలు. అన్ని కిటికీలు, ప్రధాన ద్వారం మూసి ఉన్నాయి. దీంతో అసలేం కనిపించనంత స్థాయిలో పొగ కమ్ముకోవడంతో.. బిక్కుబిక్కుమంటూ సిబ్బంది గ్రౌండ్‌ఫ్లోర్‌కి పరుగులు తీశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ‘సాక్షి’ హెచ్చరించినా..మేల్కొనని అధికారులు కలెక్టరేట్లో ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ వైర్లు తేలి కనిపిస్తున్న తీరుపై ఇటీవలే ‘సాక్షి’ఫొటో స్టోరీని ప్రచురించింది. దీన్ని హెచ్చరికగా భావించి అధికారులు మేల్కోకపోవడం గమనార్హం. -
రంగారెడ్డి కలెక్టరేట్ కోసం ‘రహేజా’ భవనం
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా తాత్కాలిక కలెక్టరేట్ కోసం మహేశ్వరం మండలం రావిర్యాల హార్డ్‌వేర్‌పార్కులో గల రహేజా కంపెనీ భవనాన్ని సోమవారం ఎంపీలు, అధికారులు పరిశీలించారు. శ్రీశైలం జాతీయరహదారి పక్కనే ఉన్న ఈ భవనం అందరికీ అందుబాటులో ఉంటుందని వారు చెప్పారు. ఈ సందర్భంగా భవన సముదాయం వద్ద ఉన్న ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. పరిశీలించిన వారిలో కలెక్టర్ రఘునందన్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఎం.కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, ఎ.గాంధీ ఉన్నారు. -
నిరాశ...డబుల్ ఆశ
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భారీగా దరఖాస్తులు మరోవైపు వృథాగా జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు 15,500 మంది ఎదురుచూపులు ఓ చేతిలో దరఖాస్తు... మరో చేతిలో చంటి పాపతో ఓ మహిళ. మండే ఎండను సైతం లెక్క చేయకుండా చేతి కర్ర సాయంతో గంటల తరబడి వేచి ఉండే వృద్ధురాలు... విధులకు సెలవు పెట్టి కొండంత ఆశతో చాంతాడంత క్యూలో తనవంతు కోసం గంటల తరబడి నిరీక్షించే చిరుద్యోగి... ఇవీ హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్ల వద్ద నిత్యం కనిపించే దృశ్యాలు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తులతో రోజూ వేలాది మంది బారులు తీరుతున్నారు. లాఠీ దెబ్బలూ తింటున్నారు. తమ ప్రాంతాలకు వచ్చే ప్రజాప్రతినిధులనూ ఇదే కోరుతున్నారు. మరోవైపు గ్రేటర్‌లోని 8 ప్రాంతాల్లో జేఎన్ఎన్యూఆర్ఎం పథ కం కింద పేదలకు నిర్మించిన 15,500 ఇళ్లు నాలుగేళ్లుగా వృథాగా పడి ఉన్నాయి. వీటి కోసం లబ్ధిదారులు తమ వాటాగా కొంతమొత్తం చెల్లించి...ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. వీటిని కేటాయించేందుకు ప్రజాప్రతినిధులు...అధికార యంత్రాంగం చొరవ చూపకపోవడంతో నిరాశగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఇళ్లను ఇప్పటికైనా కేటాయిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కొంతవరకూ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. -
18న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆందోళన
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కార్యక్రమానికి పొంగులేటి: శివకుమార్ సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపేందుకు ఈ నెల 18 తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు తీవ్ర సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం వైపు నుంచి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కనిపించడం లేదని చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని తట్టి లేపాలని వైఎస్సార్ సీపీ సంకల్పించిందన్నారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ నెల 18న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు. ఆరు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు రైతులతో కలిసి అందజేస్తారని చెప్పారు. కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం పది గంటలకు వెయ్యి మంది రైతులతో జరగనున్న కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు తప్పకుండా పాల్గొనాలని శివకుమార్ కోరారు. డిమాండ్లు ఇవే: 1. తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలి. 2. కరువు సహాయక చర్యలు చేపట్టాలి. రైతు రూణమాఫీ ఏకమొత్తంగా చేయాలి. 3. ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. 4. కరువులో రైతులకు కరువు పింఛన్లు రూ.5000 వంతున ఇవ్వాలి. 5. పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు దానాను ఉచితంగా అందించాలి. 6. జిల్లాలో గల పెండింగ్ ప్రాజెక్ట్‌లు వెంటనే పూర్తి చేసి కరువు నివారణ చర్యలు చేపట్టాలి. -
అమ్మకానికి రంగారెడ్డి కలెక్టరేట్?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విలువైన ప్రభుత్వ కార్యాలయాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. మొన్నటి వరకు ఖాళీ స్థలాల వివరాలు సేకరించిన జిల్లా యంత్రాంగం తాజాగా సర్కారీ స్థిరాస్తుల సమాచారాన్ని రాబడుతోంది. హైదరాబాద్ నడిబొడ్డునున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, జిల్లా పరిషత్ తదితర కాంప్లెక్స్‌ల వేలానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భవనాల సమగ్ర సమాచారాన్ని రెండు రోజుల్లోగా నివేదించాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఆదేశించిన వెంటనే జిల్లా యంత్రాంగం వివరాల సేకరణలో తలమునకలు కావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. భూముల అమ్మకంతో రూ. 6,500 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రస్తావించిన కేసీఆర్ సర్కారు.. ఖరీదైన స్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 300 ఎకరాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. 700 భవనాలు.. 900 ఎకరాలు: ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను నిర్మించడంలో భాగంగానే ఈ కసరత్తు చేస్తున్నామని ప్రకటించిన సర్కారు.. జిల్లాలో 900 ఎకరాల మేర ఖాళీ జాగా అందుబాటులో ఉందని తేల్చింది. జిల్లావ్యాప్తంగా 700 ప్రభుత్వ భవనాలున్నాయని, ఇంకా చాలా వాటికి పక్కా నిర్మాణాలు లేవని నివేదించింది. ఈ క్రమంలోనే జంట నగరాల్లో కొలువైన రంగారెడ్డి జిల్లా ఆఫీసుల సమాచారాన్ని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు సేకరించారు. లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్, ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్ తదితర కార్యాలయాల విలువను అంచనా వేశారు. పక్కాగా సమాచారం: ప్రభుత్వ భవంతుల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని సర్కారు తాజాగా ఆదేశించింది. భవన విస్తీర్ణం, సర్వే నంబరు, ప్రధాన మార్గానికి ఎంత దూరం.. కోర్టు కేసులున్నాయా? తదితర అంశాలపై స్పష్టమైన వివరాలతో బుధవారం లోపు నివేదిక ఇవ్వాలనిపేర్కొంది. ఇదిలావుండగా, ప్రభుత్వ కార్యాలయాలను వేలం వేయనున్నారనే వార్తలను కలెక్టర్ రఘునందన్‌రావు ఖండించారు. శేరిలింగంపల్లికి కొత్త కలెక్టరేట్? జంటనగరాల్లో విసిరేసినట్లుగా ఉన్న కలెక్టరేట్, తదితర కార్యాలయాలన్నింటినీ ఒకేచోట నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సమీపంలో సర్వే నంబర్ 25లోని స్థలాన్ని పరిశీలించింది. సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించడం ద్వారా ప్రజలకు ఊరట కలుగుతుందని అంచనా వేసింది.