
ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
మరో ధిక్కరణ కేసులో ఐఏఎస్, ఐపీఎస్‌లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని గైరాన్ సర్కారీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించినా.. ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని జూన్‌లో తాము ఆదేశించినా.. ఇప్పటివరకు ఎందుకు సమర్పించలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. నిర్మాణాలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో ధిక్కరణ పిటిషన్‌లో ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఇతరులకు నోటీసులు జారీ చేసింది.
నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని గైరాన్ భూములను కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని గతంలో బిర్లా మల్లేశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం, నిర్మాణాలు చేపట్టడం సహా ఎలాంటి మార్పులు చేయవద్దని ప్రతివాదులకు తేల్చిచెప్పడం తెలిసిందే.
న్యాయస్థానం ఉత్తర్వులున్నా వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మల్లేశ్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. జూన్‌లో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు వారాల్లో పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సమాధానమిస్తూ నివేదిక అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయినా ఇప్పటివరకు కలెక్టర్ నివేదిక దాఖలు చేయలేదంటూ మహేశ్ మరో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు రెండు వారాలు గడువు ఇచ్చి దాదాపు మూడు నెలలు కావస్తున్నా కలెక్టర్ ఇప్పటివరకు నివేదిక అందజేయలేదన్నారు. ఇది న్యాయస్థానం ఉత్తర్వుల ధిక్కరణే అవుతుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్టోబర్ 10లోగా నివేదిక దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తొలి ధిక్కరణ పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణ వాయిదా వేశారు.