స్పీకర్‌ను ‘కాకా’ అని సెక్యూరిటీ గార్డు పిలువడంతో..?
దేశంలో ప్రజలంతా సమానమేనని చాటుతూ వీఐపీ సంస్కృతికి ప్రధాని నరేంద్రమోదీ చరమగీతం పాడినా.. ఆయన స్వరాష్ట్రం గుజరాత్లో మాత్రం ఈ జాఢ్యం కొనసాగుతూనే ఉంది. అందుకు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రమణ్‌లాల్ వోరా తాజా ఉదాహరణగా నిలిచారు. అసలు ఏం జరిగిందంటే.. ఈ నెల 13న వోరా తన కొడుకును సొంత కారులో గాంధీనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి కంటి చికిత్స కోసం వచ్చారు. ఆయన కారును ట్రామా సెంటర్ ముందే నిలిపివేశారు. ట్రామా సెంటర్ ముందు కారు పార్కింగ్‌కు అనుమతి లేదు.
‘కాకా.. కారును పక్కకు తీయవా’ అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి ఓ సెక్యూరిటీ గార్డు అని విజ్ఞప్తి చేశాడు. ఇది వోరాకు నచ్చలేదు. నా అంతడి వాడిని ‘కాకా’ అని సంభోదిస్తాడా? అని ఆయన ఆగ్రహించారేమో.. అదే రోజు ఆ నిరుపేద సెక్యూరిటీ గార్డు జాబ్ ఊడింది. అంతేకాదు ప్రభుత్వ ఆస్పత్రికి భద్రతా సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ కాంట్రాక్ట్ కూడా రద్దయింది. దీనికి కారణం స్పీకర్ ఫిర్యాదే. రమణ్‌లాల్ వోరా ఒక సీనియర్ సిటిజన్. ఆయనను ‘కాకా’ అని సంబోధించడం ఎంతమాత్రం సరికాదు. అందుకే అతన్ని ఉద్యోగంలోంచి తీసేసినట్టు గాంధీనగర్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ బిపిన్ నాయక్ ఈ చర్యను సమర్థించుకున్నారు.