breaking news
ramanachary
-
కా.రా. మాస్టారుకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్/శ్రీకాకుళం: తెలుగు కథా సాహిత్యంలో అగ్రగణ్యులు కాళీపట్నం రామారావు (కా.రా.మాస్టారు)ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమణాచారి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ జాతీయ అవార్డు కింద ఆయనకు బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నగదు పారితోషికాన్ని రూ. 1.50 లక్షలు చేస్తున్నామని చెప్పారు. కథా సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకువెళ్లిన శ్రీకాకుళంకు చెందిన కా.రా.మాస్టర్‌ను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులు, ట్రస్ట్ సలహాదారు డా. కె.శివారెడ్డి, ట్రస్ట్ సభ్యురాలు మృణాళిని, ఓల్గాలను రమణాచారి అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ సాహితీవేత్తలను ఈ అవార్డుకు ఎంపిక చేసి.. వారిని తగు రీతిలో గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. సాహిత్యం వల్లే ఎన్టీఆర్‌తో తనకు పరిచయమైందని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం స్థాపించిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ద్వారా సాహితీ కృషీవలులకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేయడం తనకు ఆత్మానందాన్ని ఇస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సాహిత్య దిగ్గజాలను ఈ అవార్డుతో గౌరవిస్తుండటంలో సాహిత్యానికి నిలువెత్తు రూపమైన రమణాచారి కృషి ఎంతో ఉందన్నారు. సమావేశంలో మృణాళిని, డా. కె. శివారెడ్డి, ఓల్గా పాల్గొన్నారు. కథానిలయ స్థాపకుడు.. కా.రా.మాస్టారు 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని మురపాక గ్రామంలో జన్మించారు. 1943 నుంచి విశాఖలో పలు ఉద్యోగాలు చేశారు. తరువాత భీమునిపట్నంలో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. సాహిత్యం ద్వారా పారితోషికం, సన్మానాల ద్వారా లభించిన ప్రతి పైసాను కూడబెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని 1997 పిబ్రవరిలో ‘కథానిలయం’ ఏర్పాటు చేశారు. -
రసాభాసగా ‘రచ్చబండ’
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు మున్సిపాలిటీలో మూడో విడత రచ్చబండ కార్యక్రమం జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదానికి వేదికగా మారింది. ‘మీరెంత అంటే.. మీరెంత’ అంటూ ఇరువర్గాల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. దీంతో మంగళవారం పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ మున్సిపల్ కమిషనర్ రమణాచారి అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. టీ జేఏసీ నాయకులు రచ్చబండ కార్యక్రమాన్ని కొద్దిసేపు అడ్డుకున్నారు. మరోవైపు పేదోళ్లకు కాకుండా ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు నాయకుల మద్దతుదారులకే ఇస్తున్నారంటూ ప్రజలు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా రేషన్‌కార్డు రాలేదని కొందరు.. ఇళ్లు ఇవ్వలేదని మరికొందరు నాయకులను, అధికారులను ప్రశ్నించారు. టీజేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదాలు, జనాల నిలదీతలో రచ్చబండ గందరగోళంగా మారింది. జనాలంతా ఒక్కసారిగా వేదిక మీదికి దూసుకురావడంతో తోపులాట జరిగింది. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు కిందపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అసలు అక్కడం ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఫ్లెక్సీలో తెలంగాణ ద్రోహి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను ఎందుకు పెట్టారంటూ జేఏసీ నాయకులు వేదికపైకి వెళ్లారు. తెలంగాణకు చెందిన జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ ఫొటో పెట్టాల్సి ఉండేదని.. సీఎం డౌన్ డౌన్ అంటూ నాయకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అపూలు జేఏసీ నాయకులకు నచ్చజెప్పే యత్నం చేసినా వారు వినలేదు. తెలంగాణ ద్రోహి సీఎం అంటూ ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీని చింపివేశారు. ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన తెలంగాణవాదులు ఈ క్రమంలో ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ప్రసంగిస్తుండగా జేఏసీ తాండూరు డివిజన్ చైర్మన్ సోమశేఖర్, మరికొందరు నాయకులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ వేదిక వద్దకు దూసుకువచ్చారు. ఇందిరమ్మ పథకం కింద మున్సిపాలిటీకి చెందిన పేదలకు రెండు,మూడో విడతలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాదాపు ఐదేళ్లు అవుతున్నా లబ్దిదారులకు స్థలాలు అప్పగించలేదంటూ జేఏసీ నాయకులు ప్రశ్నించారు. ఈ తరుణంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రమేష్‌లు వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకే ఇంత వరకు దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా ఇళ్లు ఇస్తామని మంజూరుపత్రాలు ఇస్తూ పేదలను ప్రభుత్వం మోసం చేస్తోందని వాదనలకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో టీడీపీ మాజీ కౌన్సిలర్ రాజుగౌడ్ జోక్యం చేసుకుంటూ ‘మా ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా ఎందుకు అడ్డుతగులుతారంటూ’ జేఏసీ నాయకులను ప్రశ్నించారు. ఇతర టీడీపీ నాయకులు రవిగౌడ్, కరుణం పురుషోత్తంరావు, అబ్దుల్ రవూఫ్లూ సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో జేఏసీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించిన మున్సిపల్ వార్డులకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఇతరపార్టీల కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించిన వార్డుల లబ్దిదారులకు స్థలాలు కేటాయించడంలో కావాలనే వివక్ష చూపించారని జేఏసీ చైర్మన్ మండిపడ్డారు. వారికి న్యాయం చేయాలని వేదిక వద్ద బైఠాయించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పట్టణ సీఐ సుధీర్‌రెడ్డి పోలీసులతో రంగం ప్రవేశం చేశారు. జేఏసీ చైర్మన్ సోమశేఖర్, ఇతర నాయకులను వేదిక వద్ద నుంచి లాక్కెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వదిలిపెట్టారు. ఆ తర్వాత లబ్దిదారులకు పింఛన్, రేషన్, పొదుపు సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని హడావుడిగా ముగించేసి ఎమ్మెల్యే, ఇతర నాయకులు అక్కడినుంచి నిష్ర్కమించారు.