breaking news
Rajoli Project
-
సర్వే కాకమునుపే పరిహారమా!
జమ్మలమడుగు(వైఎస్సార్ జిల్లా): పెద్దముడియం మండలంలోని రాజోలిపై నిర్మించే ఆనకట్టపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాజోలి ఆనకట్ట నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు ఈ ఆనకట్ట గురించి పట్టించుకోకపోవడంతో నిర్మాణం అటకెక్కింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజోలి నిర్మాణం కోసం ముందుకు వచ్చారు. ముంపు గ్రామాల ప్రజలతో పరిహారం విషయమై ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు మాట్లాడి ఎకరాకు 12.5 లక్షల రూపాయలు అందించే విధంగా ప్రతిపాదించగా రైతులు సైతం ఆమోదం తెలిపారు. వాస్తవం ఇలా ఉండగా ఈనాడు దినపత్రికలో పరిహారమేదంటూ కథనాన్ని ప్రచురించి ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నం చేసింది. దీనిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు కూడా పూర్తి కాకుండా పరిహారం ఎలా ఇస్తారంటూ ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్డీసీ రాములు నాయక్‌లు ప్రశ్నిస్తున్నారు. భూములకు సర్వే మాత్రమే జరుగుతోంది ఐదు ముంపు గ్రామాలలో రైతుల వద్దనుంచి భూమి సేకరణ, ఇళ్లకు సంబంధించిన సర్వే మాత్రమే జరుగుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో సర్వే జరగలేదు. సర్వే పూర్తి అయి, అవార్డులు ప్రకటించిన తర్వాత రైతులకు పరిహారం అందుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే పరిహారం ఎలా అందుతుందని రెవెన్యూ, జీఎన్ఎస్ఎస్ అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు పరిహారం రెండు నెలల్లో తాము ఇస్తామని ఎక్కడా చెప్పలేదని ఆర్డీఓ జి.శ్రీనివాసులు స్పష్టం చేస్తున్నారు. రైతులకు, గ్రామస్తులకు అవార్డులు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పరిహారం పంపిణీ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాజోలిని పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుందూనదిపై రాజోలి ఆనకట్ట నిర్మాణం కోసం 2008 డిసెంబర్ 23న శంఖుస్థాపన చేశారు. మొదట రూ.300 కోట్లతో టీఎంసీ నీటిని నిల్వ ఉంచేలా నిర్మాణం చేపట్టాలని భావించారు. తర్వాత దాని సామర్థ్యాన్ని 2.9 టీఎంసీలకు పెంచారు. వైఎస్ మరణానంతరం వచ్చిన పాలకులు ఎవ్వరూ దీని గురించి పట్టించుకోలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజోలి ఊసే ఎత్తలేదు. రాజోలి ఆనకట్ట కింద ముంపునకు గురయ్యే గ్రామాలు ఇవీ.. నెమళ్లదిన్నె, బలపనగూడూరు, గరిశలూరు, చిన్నముడియం, ఉప్పలూరు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురి అవుతాయి. ఈ గ్రామాలనుంచి 9286 ఎకరాల భూమిని సేకరించాలి. సర్వే జరుగుతోంది కుందూ నదిపై నిర్మించే రాజోలి ఆనకట్టకు సంబంధించి ముంపునకు గురైన బలపనగూడురు, ఉప్పలూరు, నంద్యాల జిల్లా గొట్లూరు గ్రామాలలో సర్వే జరుగుతోంది. ఇప్పటి వరకు 1745 ఎకరాలకు అవార్డు ప్రకటించాం. – రామునాయక్, ఎస్డీసీ జీఎన్ఎస్ఎస్–3 ఏడువేల ఎకరాల భూమిని సేకరించాలి రాజోలిపై నిర్మించే ఆనకట్ట నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి ఏడువేల ఎకరాల భూమిని సేకరించాలి. దాని కోసం రెవెన్యూ , జీఎన్ఎస్ఎస్ అధికారులు ప్రత్యేక టీంగా ఏర్పడి సర్వే చేస్తున్నాం. ఇంకా సర్వే పూర్తి కాలేదు. సర్వే పూర్తిచేసి అవార్డులు ప్రకటించిన తర్వాత మొత్తం పరిహారం కోసం ప్రతిపాదనలు జీఎన్ఎస్ఎస్ అధికారులు పెడతారు. –జి.శ్రీనివాసులు , ఆర్డీఓ ,జమ్మలమడుగు -
వరద నీటిని ఒడిసి పడదాం
సాక్షి కడప : ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, వరద వచ్చిన 40 – 50 రోజుల్లోపే ఆ నీటిని ఒడిసి పట్టేందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వరద జలాలు సముద్రంపాలు కాకుండా ప్రాజెక్టులను నీటితో నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. రూ.2,300 కోట్లతో చేపట్టిన రాజోలి ప్రాజెక్టు, జొలదరాశి ప్రాజెక్టు, కుందూ – బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల పథకాలతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం నేలటూరు వద్ద సోమవారం మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా వుందని, ఆ పరిస్థితిని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి నీటిని బల్లేపల్లె నుంచి బనకచర్ల వరకు.. పెన్నా బేసిన్‌కు తరలించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందు కోసం సుమారు రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పగానే ప్రతిపాదనలు రూపొందించి రెండు మూడు నెలల్లో టెండర్లకు సన్నద్ధం కావాలని ఆదేశించామన్నారు. తద్వారా కరువు ప్రాంతాలకు నీటిని తరలించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏడాదికేడాది తగ్గుతున్న నీటి లభ్యత ‘‘కృష్ణా నది నుంచి శ్రీశైలానికి ఎంత నీరు వస్తోందనే విషయమై సీడబ్ల్యూసీ లెక్కలను పరిశీలిస్తే 47 సంవత్సరాల్లో సగటున 1,200 టీఎంసీలు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత పదేళ్లలో 600 టీఎంసీలు, ఐదేళ్లలో అయితే కేవలం 400 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన ఏటా శ్రీశైలానికి రావలసిన నీటి లభ్యత తగ్గిపోతోంది. దీంతో దుర్భిక్ష పరిస్థితిలో వ్యవసాయం సాగుతోంది. ఈ పరిస్థితిలో రైతులకు మేలు జరగాలంటే కచ్చితంగా గోదావరి జలాలు సముద్రంపాలు కాకుండా సంరక్షించాల్సిందే. గత ప్రభుత్వాల వల్ల అపార నష్టం గడచిన కొన్నేళ్లుగా అనేక పరిస్థితులను చూశాం. ఎందుకు నీటిని ఒడిసి పట్టలేకపోయామని చూస్తే గత ప్రభుత్వాల అలసత్వం అని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే మనకున్న కాలువల ద్వారా నీటిని పరుగెత్తించలేకపోయాం. అందువల్లే ఇవాళ డ్యాముల్లో నీరు కనిపించడం లేదు. కనీసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు ఇచ్చి వుంటే రిజర్వాయర్లలో నీరు నింపుకునేందుకు ఆస్కారముండేది. సర్వేలు, నష్టపరిహారం, పునరావాసం, ప్రదేశాలు గుర్తించడం వంటివి 8 నుంచి 10 నెలల్లో చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం కనీసం ఈ పని చేసి ఉన్నా, ఇవాళ సీమలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉండేవి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. అందుకే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకముందే మొత్తం ప్రాజెక్టుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళిక రూపొందించాం. మీ రుణం తీర్చుకునే అవకాశం దొరికింది మీ బిడ్డ మీ అందరి దీవెనలతో ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులకు జీవో జారీ చేసి మనందరినీ వదిలి వెళ్లారు. ఆయన స్థానంలో నేను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మీ బిడ్డగా మీ రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఇదే రోజు.. 2008 డిసెంబర్ 23న నాన్న గారు ఈ ప్రాజెక్టులకు జీఓ ఇచ్చారని కలెక్టర్ చెప్పారు. ఇది యాదృచ్ఛికమే అయినా, ఇదే రోజు ఈ ప్రాజెక్టులకు నేను శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే నాన్న గారు తలపెట్టిన ఈ రెండు ప్రాజెక్టులను తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో ఈ ఆరు నెలల కాలంలో కళ్లెదుటే వరద నీరు తరలిపోతున్నా ప్రాజెక్టులను పూర్తిగా నింపలేకపోయాం. గండికోట పూర్తి స్థాయి సామర్థ్యం 20 టీఎంసీలైతే కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. నా సొంత నియోజకవర్గమైన పులివెందులలోని చిత్రావతి 10 టీఎంసీల సామర్థ్యముంటే కేవలం 6 టీఎంసీలు మాత్రమే నింపాం. పక్కనే ఉన్న బ్రహ్మంసాగర్ 17 టీఎంసీల సామర్థ్యమైతే ఇంతగా నీరు వచ్చినా 8 టిఎంసీల నీటిని మాత్రమే తెచ్చుకోగలిగాం. వరద వచ్చినా, రిజర్వాయర్లు ఉన్నా నింపుకోలేని పరిస్థితిపై అధికారులు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయా. అందుకే గత ప్రభుత్వాల అలసత్వాన్ని పక్కనబెట్టి రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తిగా నీటితో నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళిక రూపొందించాం’’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మంత్రులు సురేష్, అనిల్‌కుమార్, కడప, నంద్యాల ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య, గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, కడప, కర్నూలు కలెక్టర్లు హరికిరణ్, వీరపాండ్యన్, వైఎస్సార్ జిల్లా డీసీసీబీ చైర్మెన్ ఇరగంరెడ్డి తిరిపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలువల సామర్థ్యం పెంపు ఇలా.. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు తెలుగుగంగ కాలువ సామర్థ్యాన్ని కూడా 11,500 క్యూసెక్కుల నుంచి 18 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► కేసీకెనాల్, నిప్పుల వాగు కాలువల సామర్థ్యాన్ని 12,500 క్యూసెక్కుల నుంచి 35 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ కాలువల సామర్థ్యాన్ని 21,700 నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► అవుకు నుంచి గండికోటకు వెళ్లే కాలువ సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుకుంటూవెళతాం. ► గండికోట నుంచి వెళ్లే కాలువల సామర్థ్యాన్ని 4 వేల నుంచి 6 వేల క్యూసెక్కులకు, గండికోట నుంచి చిత్రావతికి వెళ్లే కాలువను 2 వేల నుంచి 4 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► గండికోట నుంచి పైడిపాళెం కాలువ సామర్థ్యాన్ని 1000 నుంచి 2500 క్యూసెక్కులకు పెంచుతాం. ► ఇందుకోసం దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చవుతుంది. వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి, టెండర్లకు సన్నద్దం కావాలని ఆదేశించాం. సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇంకా ఇలా.. ► కడప రిమ్స్‌లో రూ.107 కోట్లతో క్యాన్సర్ కేర్ సెంటర్, రూ.175 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్, రూ.40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన. ► కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులివీ.. ► కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో కుందూనదిపై రూ.1357 కోట్లతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి ప్రాజెక్టు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల వద్ద రూ.312 కోట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో జొలదరాశి ప్రాజెక్టు. ► దువ్వూరు మండలం జొన్నవరం వద్ద రూ.564 కోట్లతో కుందూ నది నుంచి తెలుగంగ ఎస్ఆర్–1 ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీటిని అందించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగుగంగ కింద 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లోని తాగునీటి అవసరాలు తీరతాయి. రాయలసీమలో సాగునీటి కాలువల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. భారీగా వరద వచ్చినా, పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను నింçపుకోలేని దుస్థితి. ఈ పరిస్థితిని మార్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం. రాబోయే రోజుల్లో కృష్ణా నదికి వరద వచ్చిన 40 – 50 రోజుల్లోనే మొత్తం రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. సీమతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని ప్రాజెక్టులనూ నింపుతాం. ఈ ఆరు నెలల కాలంలో అనేక ఆశ్చర్యకర విషయాలు చూశాం. మన కళ్ల ఎదుటే శ్రీశైలం గేట్లను ఎనిమిదిసార్లు ఎత్తడం చూశాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీల నీరు సముద్రంలో కలవడమూ చూశాం. ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది నిండుగా ప్రవహించినా, మన ఖర్మ కొద్దీ గత ప్రభుత్వ తీరు వల్ల మన ప్రాంతంలోని ప్రాజెక్టులు నిండకపోవడం కూడా చూశాం. -
రాజోలి నిర్మిస్తాం..
సాక్షి, ఖాజీపేట : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజోలి జలాశయం నిర్మించి చివరి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వైఎస్సార్సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, మేయర్ సురేష్‌బాబు పేర్కొన్నారు.అప్పనపల్లె పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ఆయన పాలన కాలం అంతా రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేసీకెనాల్ ఆయకట్టు రైతుల కష్టాలను చూసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి జలాశయం నిర్మించాలని శంకుస్థాపన చేశారని అన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పూర్తి చేస్తానని, పంటలను కాపాడతానని హామీ ఇచ్చారని వారు చెప్పారు.అసెంబ్లీకి 41 మంది, పార్లమెంట్‌కు ఏడుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించి బీసీలకు అగ్రతాంబూలం వేశారని అన్నారు. చంద్రబాబు బీసీల పేరుతో అందరినీ దగా చేస్తున్న విషయం గుర్తించాలని అన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు తిరిపాల్‌రెడ్డి,గురురెడ్డి, శ్రీనివాసులరెడ్డి, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు . -
కేసీ కాలువలో వ్యక్తి గల్లంతు
రాజుపాళెం: రాజోలి ఆనకట్ట సమీపంలో కేసీ ప్రధాన కాలువలో మంగళవారం ఓ వ్యక్తి గల్లంతైనట్లు తెలిసింది. ప్రొద్దుటూరు పట్టణంలోని దొరసానిపల్లె రోడ్డులో నివాసముంటున్న ఈశ్వరయ్య అనే వ్యక్తి చేపల వేట కోసం రాజోలి ఆనకట్ట వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా చాగలమర్రి పోలీసులు ఆనకట్ట వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈశ్వరయ్యకు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.