breaking news
Railway Budget 2016-17
-
పాత కేటాయింపులు రద్దు
♦ ఏళ్లుగా నిధుల కోసం ఎదురుచూస్తున్నవి అటకెక్కినట్టే ♦ కొత్తగా మంజూరు చేసే వాటికే నిధులు ♦ రైల్వే ప్రాజెక్టులపై సురేశ్‌ప్రభు స్పష్టమైన వైఖరి ♦ రాష్ట్రానికి అశనిపాతం ♦ పాతవి అమలు చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరం ♦ వాటిని రద్దు చేసి కొత్తవాటి కోసం అధ్యయనం చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గతం గతః. రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు పంథా ఇది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులు ఉండాలని గట్టిగా చెబుతున్న ఆయన ఎప్పుడో మంజూరు చేసి పనులు చేపట్టకుండా పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను రద్దు చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పుడిది తెలంగాణకు అశనిపాతంగామారబోతోంది. 15 ఏళ్ల కాలంలో ఎన్నో కొత్త రైలు మార్గాలు మంజూరైనా.. కనీసం సర్వే కూడా పూర్తి కానివి నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఏదో ఒక బడ్జెట్లో నిధులు రాకపోతాయా, అవి పూర్తికాకపోతాయా అని ప్రజలూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక అవి రావని సురేశ్‌ప్రభు తేల్చేస్తున్నారు. రాష్ట్రంలో నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ఉన్నఫళంగా రూ.30 వేల కోట్లు అవసరం. అన్ని నిధులు ఇచ్చే స్థితిలో కేంద్రం లేదు. అందుకే పాతవాటిని రద్దు చేసి, మరోసారి కొత్తగా అధ్యయనం చేసి అవసరమైన వాటిని మాత్రమే మంజూరు చేయాలని సురేశ్‌ప్రభు నిర్ణయించారు. దీన్ని ఆయన గత బడ్జెట్లోనే దాదాపు తేల్చి చెప్పారు. గతంలో అత్తెసరు నిధులిచ్చిన వాటికి ఆయన గత సంవత్సరం బడ్జెట్లో పైసా కేటాయించలేదు. ఈసారి కూడా వాటిని ఆయన పూర్తిగా వదిలేయబోతున్నారు. వీటికి మాత్రమే... సీఎం కేసీఆర్ గట్టిగా డిమాండ్ చేస్తున్న మనోహరాబాద్-కొత్తపల్లి మార్గం, మణుగూరు-రామగుండం, భద్రాచలం-సత్తుపల్లి, మాచర్ల-నల్లగొండ లాంటి కొన్ని కీలక లైన్లకే రైల్వే మంత్రి నిధులిచ్చే అవకాశం కనిపిస్తోంది. సికింద్రాబాద్‌తో కరీంనగర్‌ను అనుసంధానించే మనోహరాబాద్-కొత్తపల్లి మార్గం విషయంలో సురేశ్‌ప్రభు గత బడ్జెట్లో కేవలం రూ.20 కోట్లు ఇచ్చారు. దీనిపై కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా ఈసారి దీనికి కొన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక అత్యంత కీలకమైన బల్లార్షా-విజయవాడ మూడో లైన్ పనులకూ నిధులు ఇవ్వనున్నట్టు సమాచారం. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్, మంచిర్యాల-పెద్దంపేట ట్రిప్లింగ్, రాఘవాపురం-మందమర్రి ట్రిప్లింగ్, కాచిగూడ-మహబూబ్‌నగర్ డబ్లింగ్, అక్కంపేట-మెదక్ లైన్లకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే... రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖ మాత్రమే నిధులు కేటాయించాలనే పద్ధతికి స్వస్తి చెప్పిన సురేశ్ ప్రభు ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేరాలని చెబుతున్నారు. సగం ఖర్చును రాష్ట్రాలు భరించేందుకు ముందుకొస్తే వాటికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రాలతో సంయుక్తంగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతకం చేసింది. రాష్ట్రం 50 శాతం ఖర్చు భరించే ప్రాజెక్టులకు రైల్వే పచ్చజెండా ఊపుతుంది. రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు, దాన్ని యాదాద్రి వరకు విస్తరించే పనులపై ఆసక్తి చూపుతోంది. వీటికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. -
నేడే రైల్వే బడ్జెట్
న్యూఢిల్లీ: ప్రయాణ, సరుకు రవాణా చార్జీలను పెంచాలా వద్దా అన్న ఊగిసలాట నడుమ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంటులో 2016-17 రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తగ్గిన ఆదాయం, ప్రాజెక్టులకు నిధులు, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాల ఆవశ్యకత నేపథ్యంలో బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే త్వరలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, డీజిల్ ధర తగ్గడం వంటివాటి వల్ల చార్జీల పెంపు మంచి కాదని రైల్వే శాఖలో ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ‘ప్యాసింజర్, సరుకు లోడింగ్ బుకింగ్‌లు తగ్గాయి. ఇప్పుడు చార్జీలను పెంచితే రైల్వే దెబ్బతింటుంది.’ అని రైల్వే వర్గాలు చెప్పాయి. ప్రజల అవసరాలను సంతృప్తికరంగా తీర్చేలా బడ్జెట్ ఉంటుందని ప్రభు బుధవారం చెప్పారు. దేశ, రైల్వే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించామన్నారు. చార్జీలు ఆశించిన విధంగా నిర్ణయించని నేపథ్యంలో రైల్వే వనరులు నిత్యం తగ్గిపోతున్నాయని లోక్‌సభలో చెప్పారు. బడ్జెట్లో ఏమేం ఉండొచ్చంటే.. ఆదరణ ఉన్న రూట్లలో అధిక చార్జీలతో పలు ప్రత్యేక రైళ్లు. లోడింగ్ ప్రోత్సాహం కోసం హైస్పీడ్ పార్సిల్ రైళ్లు. డీజిల్‌తోపాటు, విద్యుత్ రైళ్లు. ముంబైలో ఏసీ సబర్బన్ రైళ్లు, తర్వాత మిగతా ప్రాంతాల్లోకి విస్తరణ. బయో టాయిటెట్లు, వాక్యూమ్ టాయిలెట్లు, ప్రతి బోగీలో చెత్తకుండి. ఈ-కేటరింగ్ వ్యవస్థ. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పరిచే 400 స్టేషన్లను గ్రీన్ స్టేషన్లుగా ప్రకటించే అవకాశం. తొలి బుల్లెట్ రైలు(ముంబై-అహ్మదాబాద్)కు సంబంధించి జపాన్‌తో ఒప్పందం.