breaking news
Rahul Gandhi elevation
-
6న రాహుల్ పదోన్నతిపై చర్చ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) జూన్ 6న ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పదోన్నతి కల్పించడంతో పాటు ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు ఏడు నెలల అనంతరం జరుగనున్న ఈ భేటీలో సంస్థాగత ఎన్నికల తేదీలపై కూడా స్పష్టత రావచ్చని వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికపై కూడా చర్చించనున్నారు. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
'రాహుల్ నాయకత్వంపై క్వశ్చన్ మార్క్'
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుండగా ఆయన నాయకత్వంపై సీనియర్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ నాయకత్వ లక్షణాలపై అనుమానాలున్నాయని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేర్కొన్నారు. సోనియా గాంధీ నాయకత్వమే కొనసాగాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. సోనియా నేతృత్వమే పార్టీకి శ్రీరామరక్ష అని, ఆమె నాయకత్వంలో పార్టీ విజయవంతమైందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరీక్షించలేదని అలాటప్పుడు ఆయన విజయవంతం అవుతారని ఎలా చెప్పగలమని అన్నారు. సోనియా నాయకత్వాన్ని ఎవరూ విమర్శించడం లేదని, ఆమె నాయకత్వంపై అందరికీ పూర్తి నమ్మకం ఉంది. రాహుల్ నాయకత్వంపై క్వశ్చన్ మార్క్ పెట్టక తప్పదని, ఎందుకంటే ఆయన పూర్తిస్థాయిలో పరీక్ష ఎదుర్కొలేదని షీలా దీక్షిత్ అన్నారు. అయితే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తాను మాట్లాడడం లేదని ఆమె వివరణయిచ్చారు.