breaking news
Raavan
-
అందుకే ఆ సినిమా వదులుకున్న : షారుక్
దర్శకుడు మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి నటుడు కోరుకుంటాడు. అలాంటి తనకు మరోసారి అవకాశం వచ్చినప్పటికి వదులుకున్నాను అంటున్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, విక్రమ్ ప్రధాన పాత్రల్లో 2010లో ‘రావణ్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తొలుత అభిషేక్ పాత్రకు షారుఖ్ ఖాన్‌ను తీసుకోవాలనుకున్నారట దర్శకుడు మణిరత్నం. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మణిరత్నంతో పని చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. తనతో సినిమా చేయడం చాలా సరదాగా ఉంటుంది. రావణ్ సినిమాలో నన్ను తీసుకోవాలని మణిరత్నం భావించారు. కానీ అప్పుడు నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. అదికాక ‘రావణ్’ రెండు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా అని చెప్పారు. దాంతో ఈ సినిమా చేయడం కష్టమని భావించాను. అందుకే వదులుకున్నాన’ని తెలిపారు షారుక్ ఖాన్. అయితే షారుక్ ఖాన్, మణిరత్నం, మనిషా కోయిరాల కాంబినేషన్లో 1998లో ‘దిల్సే’ చిత్రం వచ్చింన సంగతి తెలిసిందే. -
రావణుడిని పూజించే గ్రామం ఇదే
న్యూఢిల్లీ: నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా దుర్గామాతాకు పూజలు చేసి, విజయదశమి రోజున రావణాసురుడి మరణానికి చిహ్నంగా పండుగ చేసుకుంటారు. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో రావణాసురుడి బొమ్మలను తయారు చేసి వాటిని బాణసంచాతో కాల్చివేస్తారు. కానీ ఢిల్లీ రాజధాని నగరానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలోవున్న ఉత్తరప్రదేశ్‌లోని బిస్ రఖ్ గ్రామం రూటే వేరు. ఈ గ్రామంలో ప్రతి ఏటా నవరాత్రుల సందర్భంగా రావణాసురుడి మరణానికి గుర్తుగా తొమ్మిది రోజులపాటు సంతాప దినాలు పాటిస్తూ నివాళులర్పిస్తారు. విజయదశమి రోజున మహా యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఈ యజ్ఞంలో గ్రామానికి చెందిన ఐదువేల మంది ప్రజలు పాల్గొంటారు. రావణాసురుడి పుట్టింది ఈ గ్రామంలోనే అని అక్కడి ప్రజల నమ్మకం. ఆయన్ని ఓ దేవిడిలా కొలుస్తారు. పూజలు చేస్తారు. రావణాసురుడి తండ్రి విశ్వారవ స్థాపించినట్లుగా భావిస్తున్న చాలా పురాతన శివాలయం ఆ గ్రామంలో ఉంది. తనకు కంటపడిన శివలింగాన్ని స్వయంగా మోసుకొచ్చి విశ్వారవ ఈ ఆలయంలో ప్రతిష్టించారని గ్రామస్థుల విశ్వాసం. ఆ తర్వాతి కాలంలో గ్రామంలో నిర్మించిన శ్రీబాబా మోహన్ రామ్ ఆలయంలో పది తలల రావణాసురుడి విగ్రహాన్ని గ్రామ పెద్దలు ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఈ ఆలయం వద్దనే యజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో రావణాసురుడితోపాటు పలు హిందూ దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. రావణాసురుడి విగ్రహం గురించి తెల్సిన గజియాబాద్‌లోని హిందూ సంఘానికి చెందిన కొంత మంది యువకులు గత ఆగస్టు నెల 21వ తేదీన ఈ గ్రామానికి వచ్చి ఆలయంలోని రావణాసురుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మళ్లీ రావణుడి విగ్రహాన్ని ప్రతిష్టించరాదని గ్రామస్థులను హెచ్చరించి వారు వెళ్లిపోయారు. గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. గ్రామస్థులు రావణుడి విగ్రహం ఉండిన ప్రాంతాన్ని అద్దాల గదిగా మార్చి తాళం వేశారు. రావణాసురుడి కొత్త విగ్రహం తయారీ కోసం రాజస్థాన్‌కు చెందిన ఓ శిల్పికి ఆర్డర్ ఇచ్చామని, అది రావడానికి మరో రెండు నెలలు పడుతుందని, ఈసారికి విగ్రహం లేకుండానే ఆలయం ముందు మంగళవారం యజ్ఞం కొనసాగిస్తామని గ్రామ సర్పంచ్ అజయ్ భాటి తెలిపారు. యజ్ఞానికి సంబంధించిన సన్నాహాలు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని ప్రధాన పూజారి అఖిలేష్ శాస్త్రీ మీడియాకు తెలిపారు. తమ గ్రామంలో విజయదశమి రోజున రావణుడి పేరిట యజ్ఞం నిర్వహించడం తమ పూర్వికాల కాలం నుంచి వస్తున్న ఆచారమని, ఈసారి ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఊరుకోమని, ఈ విషయంలో గ్రామస్థులమంతా ఒక్క మాట మీద ఉన్నామని అమిత్ భాటీ అనే ఓ గ్రామస్థుడు చెప్పారు. దేశంలో రావణాసురుడిని పూజించే గ్రామం ఇదొక్కటే కాదు. రాజస్థాన్‌లో మండోర్ గ్రామస్థులు కూడా రావణాసురుడిని పూజిస్తారు. ఆ ప్రాంతాన్ని పాలించిన మండావర్ అనే రాజు కుమార్తె మండోధరిని రావణాసురుడు పెళ్లి చేసుకోవడం వల్ల ఆ గ్రామంలో భార్యాభర్తల విగ్రహాలు వెలిసాయని అక్కడి ప్రజల నమ్మకం. -
భిన్నత్వం జాతీయ జీవనాడి
మనం గతంలోని మంచిని స్వీకరించాలి. కానీ ద్వేషాన్ని మాత్రమే తవ్వితీసే ధోరణి పెరుగుతోంది. దేశంలో చాలా మందికి రాముడు, కృష్ణుడు అంటే భక్తి. అయితే అది ఇతరులపై ద్వేషానికి కారణంగా మారడానికి వీల్లేదు. మన పొరుగు దేశమైన శ్రీలంకలో రావణుడు సింహళీయుల ఆరాధ్యదైవం. మన దేశంలోనూ పలుచోట్ల రావణుని గుళ్లున్నాయి, ఆరాధకులున్నారు. రాముని దహనం ఇతరుల మనోభావాలను గాయ పరిస్తే, రావణుని దహనం రావణ ఆరాధకుల మనోభావాలను గాయపరిచినట్టు కాదా? కొత్త కోణం: దేశవ్యాప్తంగా దసరా సంబరాలు సాగుతున్న సందర్భం. ఘనంగా రావణ దహనాన్ని జరుపుకుంటున్న వేళ. మహారాష్ట్ర, గడ్చిరోలి జిల్లాలోని మారు మూల గోండు జాతి ప్రజలు మనమంతా రాక్షసుడిగా భావించే రావణుడికి పూజలు చేసి, దండాలుపెట్టి ఊరేగించారు. తాము హిందువులమే కాదని, రావణ వంశీయులమని పరాస్వాడ గూడెం ప్రజలు చాటారు. ఇది భార తీయ సంస్కృతిలోని అసలు సిసలైన వైవిధ్యానికి అద్దం పడుతోంది. పండుగ ఒక్కటే అయినా దేశంలోని భిన్న జాతీయులు, విభిన్న ప్రాంతీయులు పూర్తి విరుద్ధంగా దాన్ని జరుపుకోవడం మరే దేశంలోనూ కనిపించదేమో. చాలా మందికి రాక్షసుడిగా ఉన్న పురాణ పురుషుడు మరికొందరికి ఆరాధ్య దైవం కావడమే మన ప్రత్యేకత. యుద్ధానికి నాందిగా చెప్పే దసరా పండుగను కొందరు శాంతికి పునాదిగా భావించడమే విశేషం. భారతీయతలోని భిన్న త్వానికి ప్రతీక దసరా పండుగే. 'మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు బౌద్ధం స్వీకరించిన రోజే విజయ దశమి. కళింగ యుద్ధానంతరం తన జీవితాన్ని, పాలనను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు. అందుకే నేను కూడా బౌద్ధ స్వీకారానికి విజయదశమినే ఎంచుకున్నాను. అశోకుడు బౌద్ధం స్వీకరించిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. అది నాకు స్ఫూర్తిదా యకం' అన్నారు అంబేడ్కర్. 1956, అక్టోబర్, 14 విజయదశమి రోజున నాగపూర్‌లో ఆయనతో పాటూ అయిదు లక్షల మందికి పైగా బౌద్ధాన్ని స్వీకరించడం దేశ చరిత్రలోనే ఒక అపురూప ఘట్టం. యుద్ధ నాదం-శాంతి సందేశం! 'ఈ దీక్షా ఉత్సవం కోసం నాగపూర్నే ఎందుకు ఎంచుకున్నారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్కి నాగపూర్ కేంద్రస్థానం కనుకనే.. బౌద్ధ ధమ్మ దీక్షను ఇక్కడ నిర్వహించాలని తలపెట్టినట్టు కొందరు అపోహపడుతున్నారు. నాకు అలాంటి ఉద్దేశ్యమే లేదు... ఆర్యులకు, ఆర్యేత రులకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి... ఆర్యులు, నాగాలను తగులబెట్టి చంపారు. తీవ్ర అణచివేతకు గురైన నాగాలకు బుద్ధుడు అండదండగా నిలిచాడు. నాగాలే మొదట బౌద్ధాన్ని సొంతం చేసుకొని, ప్రపంచానికంతటికి విస్తరింపజేశారు. నాగాలు నివసించిన నేల కాబట్టే దీనికి నాగాపూర్ అనే పేరు వచ్చింది. అందుకే ఈ గొప్ప సందర్భానికి ఈ ప్రాంతాన్నే ఎంపిక చేసు కున్నాం’’ అంటూ అంబేడ్కర్ నాగపూర్ వేదిక నేపథ్యాన్ని వివరించారు. దేశంలోని బౌద్ధులు విజయదశమిని అశోక విజయదశమిగా, ధమ్మ చక్ర పరివర్తన దివస్‌గా పిలుచుకుంటారు. హిందువుల దృష్టిలో దసరా పండుగ అమ్మవారి నవరాత్రుల సందర్భం. రావణ వధ, శ్రీరామ విజయాలతో ముడిపడినది. దసరా అనగానే దశకం ఠుని పది తలలను నరికిన కథను చెబుతారు. కొందరు తాత్వికంగా పది రకాల చెడులపై మంచి సాధించిన విజయమే విజయదశమి అంటారు. ఆ పది చెడులేమిటి? వాటికి బౌద్ధంతో ఉన్న సంబంధమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎన్నో విషయాలు బోధపడతాయి. చరిత్ర నుంచి చెబుతున్న ఈ విషయాలు కఠినంగా, చేదుగా ఉంటే ఉండొచ్చు. అలా అని వాటిని విస్మరించడం చారిత్రక తప్పిదమే అవుతుంది. చరిత్రను తిరగదోడి, నిజా నిజాలను తరచి చూసుకోవాల్సిన బాధ్యత వర్తమాన సమాజంపై ఉంటుంది. అందులోనే బుద్ధుని అష్టాంగ మార్గం కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, స్వార్థం, అన్యాయం, అమానవీయం, అహంకారం అనే పది చెడులు రావణుడిలో మూర్తీభవిం చాయని, అతడి సంహరంతో అవి నశించాయని, అందువల్లన్నే దీన్ని దసరా అంటారని హిందూ గ్రంథాలు చెబుతాయి. మరోవైపున బౌద్ధం ప్రతిపాదిం చిన అష్టాంగ మార్గానికి ఇవి ఒక రకం నకలుగా కనిపిస్తాయి. మంచి దృష్టి, మంచి సంకల్పం, మంచి మాటలు, మంచి పనులు, మంచి జీవితం, మంచి ప్రయత్నం, మంచి మనసు, మంచి దీక్ష అనేవే అష్టాంగ మార్గం. సమాజ ప్రగతిని కోరుకునే వారికి అది దిక్సూచి. హిందూ మతంలో కొంత మార్పు తీసుకురావడానికి అష్టాంగమార్గాన్ని కొంత సవరించి, అశోక విజయదశమి సందర్భంగా దసరాను తెరమీదకు తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది. చరిత్ర నుంచి అశోకుని పేరును నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కూడా ఇది జరిగి ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. రోమిలా థాపర్ ఈ విషయంలో విశేష పరిశోధన చేశారు. వైదిక మతానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధాన్ని ఖండాంతరాల్లో ప్రచారం చేసినందువల్లే అశో కుని ప్రస్తావన పురాణాల్లో, హిందూ చరిత్రలో కనిపించదని ఆమె అభిప్రా యం. అశోకుడు బౌద్ధం స్వీకరించిన విజయదశమినే ఆయుధ పూజా సందర్భం చేయడాన్ని కూడా ఇందులో భాగంగానే చూడాలి. 'అశోక విజయదశమి' అశోకుడి పాలనకు సంబంధించిన విషయాలు పాళీగ్రంథాల్లో బయటప డ్డాయి. ‘మహావంశ’, ‘దీపవంశ’ లాంటి శ్రీలంక గ్రంథాలు క్రీ.శ.5వ శతాబ్ది మొదట్లో బయటపెట్టాయి. భారతదేశంలో మాత్రం వాటికి ఎటువంటి ప్రాచుర్యం లభించలేదు. 1915లో మాస్‌కి శాసనం ద్వారా అశోకుడి వివరాలు కొన్ని బయటపడ్డాయి. అశోకుని శిలాశాసనాల ద్వారా ఆయన పాలన వెలుగులోకి వచ్చింది. విన్సెంట్ స్మిత్, రాయ్ చౌదరి, భండార్కర్, బీఎం బారువా, నీలకంఠ శాస్త్రి లాంటి వాళ్ళు విస్తృత పరిశోధనలతో అశోకుని పాలన గురించిన సత్యాలను బయటపెట్టారు. అయినా నేటికీ అశోకుడి పాలనను, ఆయన అనుసరించిన ధమ్మ మార్గాన్ని మరుగున పడేయడానికి, అవి ప్రజల్లోకి రాకుండా అణచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కొందరు చరిత్రకారులమని చెప్పుకుంటూ, అశోకుడి పాలనా కాలం, ప్రాంతం విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. అశోకుడి పాలనను ఆదర్శంగా తీసుకోవాలనుకోవడం వల్లనే మన జాతీయ పతాకంలోకి అశోకుడి పాలనా చిహ్మమైన ధర్మచక్రాన్ని, రాజ ముద్రగా అశోకుడి సింహాలను ఎంచుకున్నారు. 'అశోకుడి పాలన భారతదేశ చరిత్రకే కాదు ప్రపంచ చరిత్రకే తలమానికంగా నిలిచింది... ఈ జెండాతో, ఈ రాజముద్రతో ఇతర దేశాలకు రాయబారులుగా వెళ్ళే వారు దురాక్రమణ స్వభావాన్ని, పెత్తనం చేసే తత్వాన్ని గాక శాంతి, స్నేహాలతో కూడిన ఒక మంచి సంస్కృతిని మోసుకెళతారు'అంటూ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ వాటి ప్రాముఖ్యాన్ని చాటారు. అందుకే అశోకుడు నేటికీ విశ్వ శాంతి కాముకుడిగా, ప్రజాప్రేమికుడిగా నిలిచిపోయాడు. అందువల్ల కూడా విజయదశమి అశోక విజయదశమిగానే మనందరికీ ఒక కొత్త మార్గాన్ని ప్రబోదిస్తుంది. రావణ ఆరాధన నేరమా? మనం మన గత చరిత్రలోని మంచిని ఆదర్శంగా తీసుకోవాలి. అందుకు బదులుగా ద్వేషం, శతృత్వం, అసహనం, అహంకారాలను మాత్రమే ఎక్కు వగా తవ్వితీసే ధోరణి ఎక్కువవుతోంది. దసరా సందర్భంగా మనం పునరా లోచించుకోవాల్సిన అంశాల్లో ప్రధానమైనది దేశ వ్యాప్తంగా జరిగే రావణ దహనం. దేశంలో చాలా మందికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పాండవుల మీద భక్తి ఉన్నది. అది తప్పేమీ కాదు. అయితే అది ఇతరుల మీద ద్వేషానికి కార ణంగా మారడానికి వీల్లేదు. రావణుడు చెడుకు ప్రతీకని దేశంలో చాలా చోట్ల మనం రావణ దహనం చేస్తున్నాం. కానీ మన పొరుగు దేశమైన శ్రీలంకలో రావణుడు ఆరాధ్య దైవం. ఆయనకు గుళ్లు కట్టి భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. మన దేశంలోనూ పలు చోట్ల రావణుని గుళ్లున్నాయి. ఇటీవల మనదేశంలో రాముడు రాజకీయ చిహ్నంగా మారినట్టే, శ్రీలంకలో సింహళీయులు రావణున్ని కూడా విస్తృతంగా రాజకీయం చేస్తున్నారు. ఇలా దేవుళ్లను రాజకీయం చేయడం భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయవచ్చు. తెలంగాణలోని మెదక్ జిల్లా మిర్దొడ్డి మండలం, లింగుపల్లి గ్రామంలో రావణుడికి బదులు రాముడి బొమ్మను దహనం చేసినందువల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, అశాంతి ప్రబలుతుందని కేసులు పెట్టారు. ముందే పేర్కొన్న పరాస్వాడ గోండు ప్రజలు కూడా అలాగే రావణ దహనం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వాదిస్తే? దేశంలో రావణ దహనం చేసిన వారందరిపైన ఎందుకు కేసులు పెట్టకూడదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాముడు, కృష్ణుడు తదితర దేవతలను ఇతర దేశాల్లో కించపరిచినా మనం తీవ్రంగా స్పందిస్తుంటాం. ఇటీవల బెంగళూరులో ఒక ఆస్ట్రేలియా యువకుడు తన కాలిపై రేణుకా ఎల్లమ్మ బొమ్మను టాటూగా వేసుకున్నందుకు పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్ళి వేధించారు. మా మతాన్ని అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పద్ధతిలో రావణ దహనం ఘటనను ఎందుకు చూడకూడదు? అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అంతేకాదు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రభుత్వాధి నేతల సమక్షంలో రావణ దహనం జరపడం ఎంతమాత్రం సరియైన చర్య కాదు. మనకు నచ్చని వారి చరిత్రలను మరుగుపర్చడం, లేదంటే ధ్వంసం చేయడం లౌకిక, ప్రజాస్వామ్య స్వభావానికి విరుద్ధమైనది. మనం వేనోళ్ళ కొనియాడే భారతీయతలోని భిన్నత్వానికి పూర్తిగా వ్యతిరేకమైనది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
గోండుల దేవుడు రాముడు కాదు రావణుడు!
విభిన్నం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి ఆనుకుని ఉంటుంది విదిశ జిల్లా. ఆ జిల్లా కేంద్రానికి 40 కి.మీ.ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. దాని పేరు రావణ్. ఇది కన్యాకుబ్జ బ్రాహ్మణులు, గోండులు నివసించే గ్రామం. వీరి ఆరాధ్యదైవం రావణుడు. ఆ ఊళ్లో అందరికీ వారి దేవుడంటే అమితమైన భక్తి. ఊళ్లో ఎవరికి పెళ్లి కుదిరినా తొలి ఆహ్వాన పత్రిక అందుకునేది ఆ దేవుడే. వధూవరుల తల్లిదండ్రులు ఆహ్వానపత్రికను దేవుడి పాదాల ముందు పెట్టి తమ బిడ్డల వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోయేటట్లు ఆశీర్వదించమని వేడుకుంటారు. ఇదంతా చూస్తే ఆ దేవుడు రాముడేమో అనిపిస్తుంది. కానీ రాముడు కాదు. అయితే కథానాయకుడిగా రాముడి పాత్రను హీరోచితంగా చూపించడానికి దోహదపడిన ప్రతినాయకుడు రావణుడే ఇక్కడ దేవుడు. గోండుల ఆరాధ్యదైవం రావణుడు. రావణ్ గ్రామస్థులకు రావణుడు హీరో. స్కూలు పిల్లలు ఆలయం పక్క నుంచి వెళ్లేటప్పుడు ‘జై లంకేశ్’ అంటూ హుషారుగా సాగిపోతుంటారు. ఈ గ్రామస్థులు దేశంలో అందరిలాగానే అన్ని పండుగలనూ చేసుకుంటారు. కానీ దసరా పండుగను చేయరు. దసరాని రాముని విజయ వేడుక అని భావించరు. రామరావణ యుద్ధాన్ని... ఆర్యులు భారత దేశం మీదకు దండెత్తి గోండుల రాజ్యాలను ఆక్రమించుకునే క్రమంలో జరిగిన ఘర్షణగానే భావిస్తారు. స్థానికులను ఆర్యుల దాడి నుంచి కాపాడడానికి ప్రాణాలొడ్డి పోరాడిన వీరుడిగా రావణుడిని గౌరవిస్తారు. మరో విశేషం ఏమిటంటే... రావణ్ గ్రామంలోని రావణుడి ఆలయంలో విగ్రహం పడుకుని ఉన్న భంగిమలో ఉంటుంది. ఆ విగ్రహాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తే వైపరీత్యాలు సంభవిస్తాయని వారి నమ్మకం. భారతదేశంలో రావణుడికి ఆలయం ఉండడమే విశేషం. అనుకుంటే అది ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పటికి మూడు ఆలయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా రావణ్ గ్రామంలోని ఆలయం. రెండవది రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌కు సమీపంలో ఉంది. జోధ్‌పూర్ రాజ్యానికి ప్రాచీన కాలంలో మాండోర్ నగరం రాజధాని. అది రావణుడి భార్య మండోదరి పుట్టినిల్లని స్థానికుల అభిప్రాయం. అక్కడ ముద్గల్ గోత్రీకుల కుటుంబాలు ఇప్పటికీ వందకు పైగా ఉన్నాయి. వారంతా రామరావణ యుద్ధం తర్వాత శ్రీలంక నుంచి జోధ్‌పూర్‌కు వచ్చి స్థిరపడిన వారి వారసులమని చెబుతారు. వారితోపాటు ఇతర గోత్రికులు కూడా కొంతమంది ఉన్నట్లు సమాచారం. వారు కూడా రావణుడిని గొప్ప వీరుడిగానే గౌరవిస్తారు. మూడవది కాన్పూర్‌లో ఉంది. ఇందులో ఓ వైవిధ్యం ఉంది. ఈ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరుస్తారు. ఆ రోజు రావణుడికి విశేష పూజలు చేస్తారు. రాముడి పేరుతో ఊళ్లుంటాయి. రాముడికి ఆలయం ఉంటుంది. మనదేశంలో రాముడి గుడి లేని ఊరు లేదనేటంత అతిశయోక్తిలో చెప్పుకుంటారు కూడా. ఇది సహజం. సర్వసాధారణం. అయితే రావణుడి ఆలయం ఉండడంలో కొంత భిన్నత్వం, వైవిధ్యం దాగి ఉందనే చెప్పాలి. ప్రతి విషయానికీ, విజయానికీ రెండో కోణం ఉంటుంది. ఆ రెండో కోణానికి ప్రతీకలు ఈ ఆలయాలు.