breaking news
p.v sindu
-
గురు పూజోత్సవంలో పాల్గొన్న సింధు
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు తాను చదువుకునే కళాశాల వేడుకల్లో పాలుపంచుకుంది. క్రీడల్లో ఎంత బిజీగా ఉన్నా గురువారం మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాలకు వచ్చి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇటీవలి విజయాలను పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ డాక్టర్ ఆంథోనమ్మ సింధూను అభినందించారు. కళాశాలలో నిర్వహించిన టీచర్స్ డేలో సింధు పాల్గొని తోటి విద్యార్థులతో ఆడి పాడింది. చాలా రోజుల తర్వాత తను కళాశాలకు రావడంతో తోటి విద్యార్థులు సింధుతో ముచ్చటించడానికి ఆసక్తి ప్రదర్శించారు. అంతేకాకుండా ఆమె చేసిన డాన్సులను విద్యార్థులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించిన అనంతరం కళాశాలకు ఇదే మొదటిసారి రావడంతో అధ్యాపకులు, విద్యార్థులు ఆమెను ప్రశంసించారు. -
సైనాతో ‘ఢీ’కి సిద్ధం: సింధు
సైనాతో ‘ఢీ’కి సిద్ధం: సింధు న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్యంతో ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్న పి.వి. సింధు తన జోరు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. త్వరలో జరిగే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో సహచర క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో సమరానికి సై అంటోంది. ‘నా తదుపరి లక్ష్యం ఐబీఎల్‌లో సత్తాచాటడం. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తా. భారత నంబర్‌వన్ సైనాతో పోరుకు నేను రెడీగా ఉన్నా’ అని 18 ఏళ్ల ఏపీ స్టార్ సింధు తెలిపింది. సైనా హైదరాబాద్ తరఫున, సింధు లక్నో ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఈ నెల 15న డీడీఏ బ్యాడ్మింటన్ స్టేడియంలో జరిగే సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘బాయ్’ నజరానా రూ.15 లక్షలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ.15 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ‘చైనాలో సింధు చూపించిన తెగువ ప్రశంసనీయం. అందుకే ఆమెకు రూ.15 లక్షల నజరానాను ప్రకటించాం. అంతర్జాతీయ సర్క్యూట్లో మంచి ఫలితాలను సాధించిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ముందుంటాం. వీరికి కేవలం సన్మానాలే కాకుండా నగదు రూపేణా సహాయం కూడా ఉంటుందని చెప్పదలుచుకున్నాం’ అని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేష్ దాస్‌గుప్తా అన్నారు. క్రీడల మంత్రి ప్రశంస రాష్ట్ర క్రీడాకారిణి సింధును కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ‘అద్భుతమైన ప్రదర్శన చూపినందుకు అభినందనలు. దేశానికి గర్వకారణంగా నిలిచావు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి పేరు తేవాలని క్రీడా శాఖ కోరుకుంటోంది’ అని ఓ ప్రకటనలో మంత్రి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ క్రీడల మంత్రి వట్టి వసంతకుమార్, క్రీడాశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ‘శాప్’ ఎండీ రాహుల్ బొజ్జా కూడా సింధును అభినందించారు.