breaking news
pune doctors
-
ఆలుమగలకు 5 కారణాలే విలన్లు
పెళ్లి భార్యాభర్తలను దగ్గరకు చేయాలి. రోజులు గడిచే కొద్ది అనుబంధం పెరగాలి. ఆకర్షణ నిలవాలి. ‘కాని నేడు చాలా పెళ్లిళ్లలో ఆలుమగల మధ్య నిర్లిప్తత చోటు చేసుకుంటోంది’ అంటున్నారు డాక్టర్ సప్నా శర్మ. పూణెలో చాలా గుర్తింపు పొందిన ఈ మేరేజీ కౌన్సిలర్ ఆలుమగల మధ్య ఆకర్షణ నశించడానికి ఐదు ముఖ్యకారణాలను తెలియచేస్తున్నారు అవి...‘గతంలో మనకున్న ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు పాఠశాలలుగా ఉండేవి. పెద్దవాళ్లు కష్టసుఖాల్లో ఎలా సర్దుకుపోయేవారో, ఒకరికి ఒకరు సపోర్ట్ ఎలా ఇచ్చేవారో గమనించి పిల్లలు నేర్చుకునేవారు. కాని ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. పైగా పిల్లలకు తల్లిదండ్రులు చదువు తప్ప వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టనీకుండా చేస్తున్నారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి గురించి, భార్యాభర్తలు ఉండవలసిన తీరు గురించి, పెళ్లి డిమాండ్ చేసే బాధ్యతల గురించి, అత్తమామలు ఇతర అనుబంధాలు తెచ్చే ఒత్తిడి గురించి ఏమాత్రం తెలియచేయకుండా సంసారంలో పడేస్తే వాళ్లు కన్ఫ్యూజ్ కారా?’ అంటున్నారు డాక్టర్ సప్న శర్మ.నాగపూర్‌లో జన్మించి ఐ సర్జన్‌గా పని చేసి తర్వాతి రోజుల్లో పర్సనాలిటీ కోచ్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా, మేరేజ్ కౌన్సిలర్‌గా గుర్తింపు పొందిన సప్న శర్మ భారతీయ ఆలుమగల మధ్య వస్తున్న ఘర్షణలకు కారణాలను అర్థం చేసుకుంటూ వాటిని తిరిగి సమాజానికి చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఆలుమగల మధ్య జీవితం నిస్సారం అనిపించడానికి ఐదు కారణాలను ఆమె తెలియ చేస్తున్నారు. అవి ఇవి:1. అనురాగానికి ఆటంకాలు పెళ్లయిన స్త్రీ, పురుషులు ఒకరితో మరొకరు ప్రేమగా బహిరంగంగా కనిపించడంపై మన సమాజంలో కనపడని నిషేధాజ్ఞలు ఉన్నాయి. పెళ్లయి జీవితం మొదలుపెట్టాక ఇంట్లో అత్తామామలో తల్లిదండ్రులో ఉంటే భార్యాభర్తలు సరదా భాషణం చేయడం, ఒకరినొకరు తాకడం తప్పు అనే భావన ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ప్రేమగా ఉండటం ఏ అర్దరాత్రో తలుపు చాటున చేయవలసిన పనిగా మారుతుంది. అసలు భార్యభర్తలు తమ ప్రేమను ప్రదర్శించడానికి అవకాశమే లేనప్పుడు ప్రేమ జనించే అవకాశం ఎక్కడ? ఇది ఒక పెద్ద సమస్య.2. దొరకని ఏకాంతంభారతదేశంలో పెళ్లయ్యాక యువ జంట ఎక్కడికి ఆఖరుకు సినిమాకు వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటారు. కలిసి ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిందే తప్ప వీరు తమ మానామ తాము వెళ్లడం దోషంగా చెప్పబడుతుంది. ఇక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలి నాలుగు రోజులు విహారంగా వెళ్లడం దాదాపు చోద్యంగా, పాపంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే, ప్రేమను పెంచుకునే అవకాశాలే లేని కుటుంబ వ్యవస్థ వల్ల వారి మధ్య బంధం తప్ప ప్రేమతో కూడిన బంధం ఉండటం లేదు.3. ఆసక్తి లేకపోవడంవీటన్నింటి దరిమిలా భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఆసక్తి పోతోంది. చక్కగా తయారవడం అనేది బయటకు వెళ్లేటప్పటి సంగతిగా భావిస్తారు. మంచి బట్టలు, నగలు అన్నీ బయట వారికి చూపించడానికే. ఇంట్లో ఉన్నప్పుడు దారుణమైన బట్టలతో, సింగారం లేకుండా భార్య భర్తకు కనపడుతుంటుంది. భర్త కూడా ఏ పైజామో వేసుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి అవతారాల్లో భార్యాభర్తలు ఒకరి ఎదుట మరొకరు ఉంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుంది?4. ఫిట్నెస్ను పట్టించుకోకపోవడంపెళ్లి అయ్యే వరకు అబ్బాయి, అమ్మాయి ఎంతో కొంత ఫిట్నెస్ గురించి దృష్టి పెట్టినా మన దేశంలో పెళ్లయ్యాక ఆకారాలు ఎలా ఉన్నా పర్లేదులే అనే నిర్ణయానికి వస్తారు. ఫిట్నెస్ను పూర్తిగా వదిలేస్తారు. స్త్రీలు పిల్లలు పుట్టాక తిరిగి శరీరాన్ని ఫిట్‌గా మార్చుకుందాం అనుకోరు. పురుషులు బరువు పెరిగి, బొజ్జలు పెంచి వికారంగా ఉన్నామని తెలిసినా వ్యాయామం మాట ఎత్తకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యాభర్తలు లోలోపల ఒకరిపై మరొకరు అసంతృప్తిని పెంచుకుంటారు.5. ఒకరి ఆసక్తులు మరొకరివైభార్యాభర్తలు భౌతిక ఆకర్షణను కోల్పోయినా మానసికంగా దగ్గరగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. భర్త ఆసక్తులు భార్యకు పట్టకపోవడం భార్య ఇష్టాలు భర్తకు రుచించకపోవడం ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఉమ్మడి అభిరుచులే లేకపోతే వారి మధ్య అనుబంధం పెనవేసుకోవడం కష్టమవుతుంది. భర్తను భార్య మెచ్చుకోకపోగా సూటిపోటి మాటలు అనడం, భార్యను కాంప్లిమెంట్ చేయడం... హగ్ చేసుకోవడం భర్త ‘అహాని’కి అడ్డుగా మారడం... ఇవి మానసిక బంధానికి విఘాతంగా మారుతున్నాయి.భార్యాభర్తలే కాదు ఇంటి పెద్దలు కూడా ఈ కారణాలను కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ల మధ్య గమనిస్తూ సరి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి.అప్పుడే వివాహం నూరేళ్ల బంధం అవుతుంది. -
వైద్యుల ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు
వాళ్లంతా వైద్యులు. నిరంతరం వైద్యవృత్తిలో మునిగి తేలుతుంటారు. ఆ ఒత్తిడి నుంచి బయట పడేందుకు షోలాపూర్‌లో ఒక నదిలో బోటింగ్ చేద్దామని వెళ్లారు. ఇందపూర్ సమీపంలో భీమా నదిలోని ఉజేన్ డ్యాం వద్ద బోటింగ్‌కు వెళ్లిన తర్వాత నది మధ్యలో సీన్ చాలా బాగుందని, అక్కడ సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. అలా సెల్ఫీలు తీసుకునే క్రమంలో పడవ అదుపుతప్పి.. తిరగబడింది. దాంతో నలుగురు వైద్యులు నీళ్లలో మునిగి చనిపోయారు. వారిలో ఒకరి మృతదేహం సాయంత్రానికే బయటపడగా మిగిలిన మూడింటినీ మర్నాటి ఉదయానికి తీయగలిగారు. వారాంతంలో సరదాగా గడుపుదామని మొత్తం 10 మంది వైద్యుల బృందం బయల్దేరింది. సాయంత్రం సమయంలో వాళ్లు స్థానిక మత్స్యకారుల వద్ద అడిగి ఓ బోటు అద్దెకు తీసుకున్నారు. అయితే వారికి సరిగా ఈత రాకపోవడంతో పాటు.. బోటింగ్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏమీ తెలియవు. పడవ నడిపేందుకు కూడా ఎవరినీ తీసుకెళ్లకుండా తమంతట తామే వెళ్లిపోయారు. వద్దని మత్స్యకారులు ఎంత వారించినా వాళ్లు వినలేదు. తాము వైద్యులమని, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తమకు తెలుసని చెప్పారు. నది సగంలోకి వెళ్లిన తర్వాత కొంతమంది వైద్యులు సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. దాంతో బోటు ఒకవైపు ఒరిగిపోయింది. కొంతమంది బోటు నుంచి నీళ్లలోకి దూకేశారు. వారిలో ఒకరు మళ్లీ బోటు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన కాలు చేపల వలలో ఇరుక్కుపోయి బోటు మునిగిపోయింది. వారిలో ఆరుగురికి ఈత రావడంతో ఎలాగోలా జాగ్రత్తగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. -
వ్యక్తి మూత్రాశయంలో 51 రాళ్లు
పింప్రి, న్యూస్‌లైన్ : పుణే వైద్యులు ఓ యువకుని మూత్రాశయం నుంచి 51 రాళ్లను శస్త్రచికత్స ద్వారా తొలగించారు. పుణేలోని ససూన్ ప్రభుత్వాస్పత్రికి చెందిన వైద్యులు సుధీర్ దుబే, ఆవిష్కార్ బారసే, వైభవ్ షాహ, పాండే విజయ్ పాటిల్‌ల బందం ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు. సంతోష్ హిరవే (21) అనే యువకుడు తరచు మూత్ర సంబంధమైన వ్యాధితో బాధపడుతుండేవాడు. అతనికి తరచుగా తలనొప్పి కూడా వచ్చేదని వైద్యులు చెప్పారు. అతనికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మూత్రాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతనికి శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు. సంతోష్ తల్లి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ శస్త్ర చికిత్స వీరిపై మరింత ఆర్థిక భారాన్ని మోపింది.