breaking news
pulicharla
-
పులిచర్లలో సచివాలయ కన్వీనర్లు, గృహాసారథులకు శిక్షణా కార్యక్రమం
-
174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం
పెద్దవూర: బాలికలు బారులు తీరి కనిపిస్తున్న ఈ ఫొటో మూత్రశాల వద్దది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల పరిస్థితి ఇది. ఈ పాఠశాలలో మొత్తం 398 మంది విద్యార్థులున్నారు. బాలికల సంఖ్య 174 కాగా, మరో ఆరుగురు బోధన సిబ్బంది ఉన్నారు. ఇంతమందికి పాఠశాలలో ఉన్న మూత్రశాలలు మాత్రం రెండే. అందులో ఒకటి మరమ్మతులకు గురికాగా, వినియోగంలో ఉన్నది ఒకటి మాత్రమే. దీంతో విరామ సమయంలో ఇలా బారులు తీరాల్సి వస్తోంది. అరగంట ముందు నుంచే బాలికలను తరగతుల వారీగా విరామానికి పంపిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చదవండి: టాయిలెట్స్ ఎవరు కడగాలి? -
జిల్లాలో భూ కబ్జాల పర్వం
– రెవెన్యూ అధికారుల సాయంతో అక్రమాలు – తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్ – ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు – అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లకే అధికారుల పెద్దపీట – రిజిస్టర్ డాక్యుమెంట్లకు విలువివ్వని వైనం చిత్తూరు(కలెక్టరేట్): జిల్లాలో కబ్జాదారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, మఠం భూములన్న తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమించేస్తున్నారు. అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్ల సాయంతో వెబ్‌ల్యాండ్‌లో వివరాలు నమోదు చేసుకుని బ్యాంకుల నుంచి అడ్డదిడ్డంగా రుణాలు పొందడమేకాకుండా, భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిజమైన లబ్ధిదారులు రిజిస్టర్ డాక్యుమెంట్లను చూపిస్తున్నా రెవెన్యూ అధికారులు కబ్జాదారులకే వంతపాడుతుండడం గమనార్హం. జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరగా చేసుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇదిగో సాక్ష్యం.. – పులిచెర్ల మండలం దేవళంపేట గ్రామలెక్కల దాఖలా సర్వే నెం. 125 లోని 7.96 ఎకరాల స్థలం 1954 ముందు మూడు కుంటల సముదాయం. అదేగాక సర్వే నెం. 128–10 లోని జమీందారుల ఆధీనంలోని పాళ్యంకట్టుబడి భూములు, దేవాదాయ భూములను అప్పటి కరణం బంజరు భూములుగా మార్పు చేశారు. సర్వే నెం. 146–11 లో 18 సెంట్ల శ్మశాన స్థలంతో పాటు, హంద్రీ నీవా కాలువ గట్టు భూములను కూడా ఇటీవల ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. సర్వే నెం. 296–4 లోని 1.96 ఎకరాల విస్తీర్ణం ఉన్న గంగమ్మ చెరువు గత మూడేళ్ల క్రితం కూడా ప్రభుత్వ లెక్కల్లో చెరువుగానే ఉంది. అయితే ప్రస్తుతం ఓ వ్యక్తి ఆధీనంలో పూర్తిగా సాగులో ఉంది. వీటిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు సాక్షికి తెలియజేశారు. – పూతలపట్టు మండలం అయ్యప్పగారి పల్లెకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా 10 మంది రైతులకు చెందిన 67 సర్వే నంబర్ల పరిధిలోని దాదాపు 17.50 ఎకరాల స్థలానికి తప్పుడు రికార్డులు సృష్టించి ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడు. అదేగాక వెబ్‌ల్యాండ్‌లోని 1 (బీ) ఆధారంగా ఏకంగా ఆ భూములను పక్కాగా రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఆ భూమలు గ్రామస్తుల అనుభవంలోనే ఉన్నాయి, కానీ రికార్డులు మాత్రం ఇతనిపై ఉన్నాయి. అంతటితో ఆగని కబ్జాదారు రికార్డుల ప్రకారం భూములను స్వాధీనం చేసుకునేందుకు సర్వేకు సన్నద్ధమయ్యాడు. దీంతో విషయం తెలుకున్న గ్రామస్తులు లబోదిబోమంటూ గత నెల 25 తేదీ కలెక్టరేట్‌కు విచ్చేసి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ లీలలు గతంలో భూములకు సంబంధించి కొనుగోలు, విక్రయాలను రిజిస్టర్ డాక్యుమెంట్ల ద్వారా చేసేవారు. ఫలితంగా రిజిస్ట్రేష్లలో అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉండేది కాదు. అయితే రైతులు తమ భూముల ఆధారంగా బ్యాంకు రుణాలు పొందాలంటే డాక్యుమెంట్లను తాకట్టు పెట్టేవారు. ఈ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రభుత్వం భావించింది. రికార్డుల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలను రెవెన్యూ అధికారుల ద్వారా పొంది, వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందే సౌలభ్యాన్ని కల్పించారు. దీంతో కొందరు స్వార్థపరులు రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై ఇతరుల భూముల సర్వే నంబర్లతో అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి, వాటి ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొంది బ్యాంకు రుణాలు పొందారు. తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్ ప్రస్తుత ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా ఆన్లైన్లోని వె»Œ ల్యాండ్ రికార్డులను పక్కా చేసే పనులు ముమ్మరం చేస్తోంది. దీంతో గతంలో అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లతో పట్టాదారు పుస్తకాలు పొంది, ఆన్లైన్లోని 1(బీ)లో సర్వే నెంబర్లను నమోదు చేసుకున్న వారు అధికంగా ఉన్నారు. దీనికారణంగా భూముల యజమానులు ఒకరైతే, వెబ్‌ల్యాండ్‌లో నకిలీ పత్రాలు, పట్టాదారు పుస్తకం కల్గిన వారు యజమానులుగా మారుతున్నారు. దీంతో పక్కాగా రిజిస్టర్ డాక్యుమెంట్లు కల్గిన భూస్వాములు వెళ్లి తమ రికార్డులు చూపినా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. గుడ్డిగా రిజిస్ట్రేషన్లు రికార్డులు పక్కాగా ఉన్నా, అన్‌లైన్‌లోని 1 (బీ)లో స్వార్థపరుల పేరున ఉండే సర్వే నంబర్లను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు అనేక నిబంధనలు చెబుతున్నారు. నకిలీ పట్టాదారు పుస్తకమయినా, ఆ పుస్తకాన్ని రద్దుచేసే, 1 (బీ)లో నంబర్లను తొలగించే అర్హత తహశీల్దార్లకు లేదని, ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవాలని తెలుపుతున్నారు. భూస్వామి రికార్డుల ప్రకారం ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా, వాటికి సంబంధించిన సర్వే నంబర్లను 1 (బీ)లో కనీసం బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టడం లేదు. దీనికారణంగా భూస్వామి ఫిర్యాదు చేసినా ఆక్రమ రికార్డు దారులు ఆ భూములను వెబ్‌ల్యాండ్ ఆధారంగా ఇతరులకు విక్రయించుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు. దీంతో అసలు యజమాని ఆ భూములపై పట్టుకోల్పోవాల్సి వస్తోంది. ఆఖరుకు వ్యవహారం కోర్టుకు వెళ్లడం, వాటిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తరువాతనే రెవెన్యూ అధికారులు 1 (బీ)లో అసలు యజమానికి మార్పు చేస్తున్నారు. ఈ తతంగం అంతా పూర్తి చేసుకోవాలంటే భూస్వామికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు మా గ్రామ పరిధిలోని భూములకు తప్పుడు రికార్డులతో కొందరు పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించుకుని ఆన్లైన్ 1 (బీ)లో నమోదు చేసుకున్నారు. ఏకంగా చెరువు, శ్మశాన స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారు. దీనిపై గ్రామస్తులందరు కలిసి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – వెంకటరమణ, దేవళంపేట – పులిచెర్ల మండలం -
సంప్రదాయాన్ని ధిక్కరించాడని..
పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం పెద్దవూర మండలం బాసోనిబావి తండాలో జరిగింది. పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బాసోనిబావితండాలో గిరిజనులు పవిత్రంగా భావించే హోలీమాత (కాముడి) పండగను వారం రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ. గతంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ పండగను ఈ సారి పది సంవత్సరాలకు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రంతా తండావాసులు నిద్రాహారాలు మాని గిరిజన సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి వేకువజామున కాముడిని దహనం చేశారు. దీనిని చూడటానికి పరిసర తండాలైన కోమటికుంటతండా, నంభాపురంల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాముడిని దహనం చేస్తున్న సమయంలో కోమటికుంట తండాకు చెందిన బాణావత్ బాలు కూడా వచ్చాడు. ఎవరైనా కాముడి దహనాన్ని చూడొచ్చు కానీ బూడిదను ముట్టుకోవడం, నోట్లో వేసుకోవడం గానీ చేయరాదనేది సంప్రదాయం. కాముడిని కాల్చిన తర్వాత వచ్చే బూడిదను గ్రామ పెద్ద అయిన మదిగేరియా మొదటగా తీసుకుని బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్న తరువాత గ్రామ పెద్దలు, అనంతరం తండావాసులు దానిని తీసుకుంటారు. కేకే తండాకు చెందిన బాలు పవిత్రమైన కాముడి బూడిదను ఎవరూ తీసుకోకముందే దానితో బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్నాడు. గిరిజనుల సంప్రదాయం ప్రకారం ఇది తండాకు అరిష్టం. దీంతో బాలును తండాకు చెందిన గిరిజనులు పట్టుకుని చితక బాదారు. కోపంలో అతనిని ఏమైనా చేసారేమోనని తండాకు చెందిన గ్రామపెద్ద ఒకరు అతన్ని తీసుకుని వెళ్లి ఇంట్లో తాళం వేసి నిర్బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి హాలియా సీఐ శివశంకర్, పెద్దవూర, హాలియా, సాగర్ ఎస్ఐలు ఇండ్ల వెంకటయ్య, బోజ్యానాయక్, రజినీకర్లు తమ సిబ్బందితో చేరుకున్నారు. ఇంటిలో బంధించిన బాలును స్టేషన్‌కు తరలించే క్రమంలో తండావాసులు అతన్ని తీసుకుపోవద్దని, తమకు అప్పగించాలని అతడిని అంతం చేస్తామని పోలీసులను అడ్డుకుని రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ క్రమంలో పెద్దవూర ఏఎస్ఐ తాడిపర్తి శేషుబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్యాంసుందర్‌రెడ్డి, మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో ఏఎస్ఐకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సాగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంప్రదాయానికి భంగం కలిగించిన బాలుపై కేసు నమోదు చేశామని, అదేవిధంగా అక్కడికి వెళ్లిన పోలీసులపై దాడి చేసి విధులకు ఆటంకం కల్గించినందుకు తండావాసులపై కూడా కేసులు పెట్టి రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు.