breaking news
pslv- c 28
-
ఇస్రో పాంచ్ పటాకా!
- ఐదు విదేశీ ఉపగ్రహాల ప్రయోగం సూపర్ సక్సెస్ - విజయవంతంగా నింగికి చేర్చిన పీఎస్ఎల్వీ-సీ28 రాకెట్ - అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రో టాప్ గేర్ - 1,440 కిలోల బరువైన ఐదు ఉపగ్రహాలతో పేలోడ్ - వాణిజ్యపరంగా తొలిసారి అత్యంత ‘బరువైన’ ప్రయోగం సూళ్లూరుపేట(శ్రీహరికోట): స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలకు దీటుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విదేశీ ఉపగ్రహాలను సైతం నింగికి పంపి వాణిజ్యపరమైన భారీ ప్రయోగంలోనూ సత్తా చాటింది. బ్రిటన్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో కదనాశ్వం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్ఎల్వీ) రాకెట్ శుక్రవారం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం ఈ విజయానికి వేదికైంది. శుక్రవారం రాత్రి 9.57 గంటలు.. షార్ డెరైక్టర్‌గా పి.కున్హికృష్ణన్కు తొలి ప్రయోగం కావడం, పీఎస్ఎల్వీ రాకెట్‌కు ఆయనే మిషన్ డెరైక్టర్ కావడంతో అంతటా ఉత్కంఠ.. కౌంట్‌డౌన్ ముగియవచ్చింది.. 3.. 2.. 1.. 0.. అందరికళ్లు తూర్పుదిక్కున ఆకాశం వైపు మళ్లాయి. చీకటిని చీల్చుకుంటూ, నిప్పులు చిమ్ముకుంటూ పీఎస్ఎల్వీ-సీ28 నింగికి ఎగిసింది. శ్రీహరికోట వెలుగులతో నిండిపోయింది. కరతాళ ధ్వనులు మిన్నంటాయి. రాకెట్ విజయవంతంగా దూసుకెళ్తూ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్‌లు శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో వాణిజ్య విభాగం ‘యాంత్రిక్స్’కు రూ. 180 కోట్ల ఆదాయం లభించినట్లు ఇస్రో తెలిపింది. ప్రయోగం జరిగిందిలా... నిర్దేశించిన విధంగానే.. 108.1 సెకన్లకు 68.82 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ మొదటి దశ పూర్తయింది. 260.2 సెకన్లకు 231.85 కి.మీ. ఎత్తులో రెండోదశ, 521.8 సెకన్లకు 506.29 కి.మీ. ఎత్తులో మూడోదశ, 1037 సెకన్లకు 652.32 కి.మీ. ఎత్తులో నాలుగో దశ పూర్తయ్యాయి. మొత్తం 19.16 నిమిషాల్లో ప్రయోగం పూర్తయింది. సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో.. 653.8 కి.మీ. ఎత్తులో డీఎంసీ3-1ను, 653.9 కి.మీ. ఎత్తులో డీఎంసీ3-2ను, డీఎంసీ3-3ను, డీ ఆర్బిట్సెయిల్ను, 654.75 కి.మీ. ఎత్తులో సీఎన్బీటీ-1ను రాకెట్ ప్రవేశపెట్టింది. సమష్టి కృషితో సాధించాం: ఇస్రో చైర్మన్ కిరణ్ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ఇది సమష్టి విజయం. వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఐదు ఉపగ్రహలనూ నిర్ణీత సమయంలోనే నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగాం. ఈ విజయం స్ఫూర్తితో మరిన్ని భారీ ప్రయోగాలకు శ్రీకారం చుడతా’న్నారు. తాను పదవీబాధ్యతలు చేపట్టాక మొదటి ప్రయోగం విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందని కున్హికృష్ణన్ అన్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. బ్రిటన్ ఉపగ్రహాలు, వాటి ప్రత్యేకతలు డీఎంసీ3-1, డీఎంసీ3-2, డీఎంసీ3-3, సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్‌సెయిల్. వీటిలో డీఎంసీ3 ఉపగ్రహాలు ఒక్కోటి 447 కిలోలు, సీబీఎన్‌టీ-1 శాటిలైట్ 91 కిలోలు, డీ-ఆర్బిట్‌సెయిల్ 7 కిలోలు మొత్తం 1,440 కిలోల బరువున్నాయి. డీఎంసీ3 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ 647 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలోకి, ఒక్కో ఉపగ్రహానికి మధ్య 120 డిగ్రీల కోణంలో తేడా ఉండేలా ప్రవేశపెట్టింది. ప్రతిరోజూ భూమిపై ఏ లక్ష్యాన్ని నిర్దేశించినా, ఇవి ఫొటోలు తీయగలవు. వనరులను సర్వే చేయడం, పర్యావరణ అధ్యయనం, ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ వంటి వాటికి ఇవి ఉపయోగపడతాయి. ఒక్కోటి 3 మీటర్ల పొడవుండే 3 ఉపగ్రహాలనూ ప్రస్తుత పేలోడ్లోనే ఉంచి ప్రయోగించడమనేది ఇస్రోకు సవాలుగా మారింది. ఇందుకోసం వృత్తాకార లాంచర్ అడాప్టర్‌ను, త్రికోణాకారంలోని మల్టిపుల్ శాటిలైట్ అడాప్టర్-వెర్షన్ 2(ఎంఎస్ఏ-వీ2) వేదికనూ ఇస్రో తయారుచేసి ఉపయోగించింది. ఇక సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్‌సెయిల్ ఉపగ్రహాలను సాంకేతికత ప్రదర్శన కోసమే బ్రిటన్ రూపొందించింది. సీబీఎన్‌టీ-1ని భూ పరిశీలన టెక్నాలజీని పరీక్షించుకోవడం కోసం పంపగా.. పలుచని తెరచాప లాంటి సెయిల్ ఆధారంగా వస్తువులను క్రమంగా దిగువ కక్ష్యలోకి రప్పించే టెక్నాలజీని పరీక్షించుకోవడం కోసం డీ-ఆర్బిట్‌సెయిల్ నానో ఉపగ్రహాన్ని పంపింది. పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించటం ఇది 30వ సారి. ఇప్పటిదాకా 19 దేశాలకు చెందిన 40 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించగా, తాజా ప్రయోగంతో ఆ సంఖ్య 45కు చేరింది. -
ఇస్రో ఖాతాలో మరో విజయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ28 రాకెట్ విజయవంతంగా క్షక్షలోకి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి 9.58 గంటలకు ప్రయోగించిన ఈ రాకెట్.. నిర్ణీత సమయానికి (గం.10:17 ని.లకు) నిర్దేశించినట్లుగానే ఐదు ఉపగ్రహాలను సరైన కక్షలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్ష వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఐదు బ్రిటన్ ఉపగ్రహాలను నింగికి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగానికి గత రెండు రోజుల క్రితమే కౌంట్‌డౌన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. బుధవారం మొదటి దశలో రాకెట్ లో ఘన ఇంధనం నింపగా, గురువారం ఉదయం నుంచి రాకెట్‌లోని సాంకేతిక వ్యవస్థలను పరీక్షించారు. విపత్తుల నిర్వహణ, భూ ఉపరితల పరిశీలన, వనరుల అధ్యయనం కోసం గాను బ్రిటన్‌కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్ఎస్టీఎల్) రూపొందించిన ఐదు ఉపగ్రహాలను ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ సీ28 రాకెట్ నింగికి చేర్చింది. పీఎస్ఎల్వీ-సీ-28 నింగిలోకి తీసుకెళ్లిన ఉపగ్రహాల మొత్తం బరువు 1440 కిలోలు. ఇంత బరువుగల ఉప గ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి.