breaking news
producer sushant reddy
-
'డ్రగ్స్ ముఠాతో సినీ పరిశ్రమకు సంబంధం లేదు'
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ ముఠాను వెస్ట్‌జోన్ పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు డ్రగ్స్ ముఠా వివరాలను వెల్లడించారు. నలుగురు నైజీరియన్లతో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 90 గ్రాముల కొకైన్‌తో పాటు, 40 ప్యాకెట్ల గంజాయిని, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా పట్టుబడ్డవారిలో నల్గొండ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి ఓ సినిమాకు దర్శకత్వం వహించారని అలాగే అదే జిల్లాకు చెందిన పనాస రవి కూడా సినీ రంగానికి సంబంధించి వ్యక్తి అని తెలిపారు. వీరిద్దరు తప్ప... సినిమా రంగానికి చెందినవారితో డ్రగ్స్ ముఠాకు ఎలాంటి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు. ఆధారాలు లేకుండా తాము మాట్లాడలేమని ఆయన తెలిపారు. నిందితుల్లో నలుగురు నైజీరియన్లు ఇక్కడే ఉంటూ నిజాం కళాశాలలో చదివారని, వారిలో ఒకరికి వీసా గడువు పూర్తయినా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్నారని డీసీపీ పేర్కొన్నారు. పట్టుబడ్డ నైజీరియన్స్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ...టాలీవుడ్‌తో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చారు. కాగా ఈ కేసులో యువ నటుడు నందు పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్ని అవాస్తవాలేనని నందు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
డ్రగ్స్ పట్టివేత, సినీ నిర్మాతతో పాటు నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లను జూబ్లిహిల్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 1లో యువ నిర్మాత సుశాంక్ రెడ్డి, మరో సినీ ప్రముఖుడికి శనివారం రాత్రి ఇద్దరు నైజీరియన్లు డ్రగ్స్ అందచేయడానికి వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు యువ నిర్మాతతో పాటు మరో ప్రముఖుడిని, ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని త్వరలో మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ల వద్ద లభించిన లాప్ ట్యాప్, సెల్‌ఫోన్ డాటా ఆధారంగా మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.