breaking news
Prodduturu Municipality
-
టీడీపీ నేతల దౌర్జన్యం
ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై టీడీపీ వర్గీయులు శనివారం దౌర్జన్యం చేశారు. దాడి చేయడానికి ప్రయత్నించారు. అడ్డువచ్చిన వైఎస్సార్సీపీ నేతలను తోసేశారు. పోలీసుల రంగ ప్రవేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత ఆసం రఘురామిరెడ్డి ఇటీవల ప్రారంభించారు. అక్కడ ట్యాంక్ నిర్మిస్తే ఆహ్లాదకర వాతావరణం దెబ్బతింటుందని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు. ట్యాంక్‌ను అక్కడ కాకుండా.. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. దీంతో ఎమ్మెల్యే ట్యాంక్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ వర్గీయులు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంలో మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే టీడీపీ శ్రేణులు జోక్యం చేసుకుని.. వాగ్వాదానికి దిగారు. ప్రొద్దుటూరు టౌన్ : స్థానిక మున్సిపల్ గాంధీ పార్కులో ట్యాంకు నిర్మించడాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అడ్డుకోవడం లేదని, మరో ప్రాంతంలో నిర్మించాలని చెప్పారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రాచమల్లు రమాదేవి, రాగుల శాంతి, ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి ప్రజలకు వివరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ కౌన్సిలర్ గణేష్‌బాబు, తలారి పుల్లయ్య, వారి బంధువులు, ఆ ప్రాంత ప్రజలతో శనివారం ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఫ్లెక్సీని రాసి కార్యాలయ ప్రధాన ద్వారానికి కట్టి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో.. ఎమ్మెల్యే డౌన్ డౌన్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్కులో ట్యాంకు నిర్మాణంతో ప్రజలకు ఆహ్లాద వాతావరణం పోతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వద్దన్నారని, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించవచ్చని అధికారులకు చెప్పారని ఆందోళనకు వచ్చిన ప్రజలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కౌన్సిలర్ గణేష్‌బాబు, టీడీపీ కౌన్సిలర్లు.. వైఎస్సార్సీపీ నాయకుడు బంగారురెడ్డిని దుర్భాషలాడారు. ‘మీతో మేము మాట్లాడటం లేదు, ప్రజలకు చెబుతున్నాం’ అని అంటుండగానే.. మరో టీడీపీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య బంగారురెడ్డి భుజంపై చేయి వేసి పక్కకు లాగి దౌర్జన్యానికి దిగాడు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కౌన్సిలర్ గణేష్‌బాబు, ఆయన వర్గీయ మహిళలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పరుష పదజాలంతో దూషించడంతో.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు ఫిర్యాదు చేస్తేనే.. ఎమ్మెల్యే అలా చెప్పారని, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తే తప్పేంటని టీడీపీ కౌన్సిలర్లను ఆయన ప్రశ్నించారు. అయితే వారు ఆవేశంతో ఊగిపోయారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, కంట్రోల్ రూం సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ లక్ష్మీనారాయణ, బ్లూకోల్ట్ సిబ్బంది అక్కడికి వచ్చి ఇరు వర్గాలను బయటికి పంపించారు. -
మళ్లీ ..ఫస్టే
ప్రొద్దుటూరు టౌన్ : స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విధంగా రావడం ఇప్పటికి ఐదోసారి. పేదరికాన్ని అధిగమించి స్వశక్తిపై లక్ష్యాన్ని చేరుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని మహిళామణులు. బ్యాంకుల నుంచి రూ.కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లిస్తూ ఆర్థికస్వాలంబన సాధించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కంటే ముందంజలో ఉన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి. జనాభా దాదాపు 1.65 లక్షలు. ఇందులో స్లమ్ ఏరియాల్లో నివాసం ఉంటున్న మహిళలు 54,317 మంది ఉన్నారు. 2500 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో సభ్యులు దాదాపుగా 25,000 లకు పైగానే ఉన్నారు. వీరందరినీ నడిపించేది టౌన్ లెవెల్ కో ఆర్డినేటర్ కెజియాజాస్లిన్. వారి తరువాత 6 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఒకరు సీఎల్ఆర్పీగా, మరో 72 మంది ఆర్పీలుగా ఉంటూ మహిళలకు చేదోడుగా ఉంటున్నారు. వీరందరూ గ్రూపుగా ఏర్పడి ప్రతి నెల పొదుపు చేసుకుంటూ వారి పొదుపు డబ్బును అవసరమున్న వారికి ఇచ్చుకొని తిరిగి బ్యాంకులకు జమ చేస్తున్నారు. బ్యాంకుల రుణాలు తీసుకుని తిరిగి బ్యాంకుకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారంటే మహిళలు ఎంత ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో అర్థం అవుతోంది. పిల్లల చదువుల నుంచి కుటుంబానికి మగవారితో ధీటుగా వారు దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. మరి కొందరు హోటళ్లు నిర్వహిస్తూ బ్యాంకు ద్వారా తీసుకున్న డబ్బుతో మరింత ఎదుగుతున్నారు. ప్రొద్దుటూరు ప్రస్థానాన్ని పరిశీలిస్తే... 2011-12 ఏడాదికి గాను ప్రభుత్వం 80 గ్రూపులు టార్గెట్‌గా ఇస్తే 158 గ్రూపులను ఏర్పాటు చేశారు. 2012-13 ఏడాదిలో 29కి గాను 147 గ్రూపులు ఏర్పాటు చేసి 506 శాతం అచ్యూవ్‌మెంట్ సాధించారు. 2013-14కు గాను 46 టార్గెట్‌కు 85 గ్రూపులు చేసి 184 శాతం అచ్యూవ్‌మెంట్ సాధించారు. 2014-15కు 41 గ్రూపులకు 51 గ్రూపులు చేసి రూ.20 కోట్లు టార్గెట్‌ను అధిగమించారు. మొత్తం గ్రూపుల్లోని సభ్యులకు రూ.20.04 కోట్ల రుణాలు ఇచ్చి ఈఏడాది జనవరి నెలకే 100.23శాతం అచ్యూవ్‌మెంట్ సాధించారు. మెప్మా సిబ్బందికి అభినందనలు తెలిపిన కమిషనర్... బ్యాంకు లింకేజీలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలచడంతో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ మెప్మా టీఎంసీ కెజియాజాస్లిన్, సీఓలు శ్రీదేవి, విమల, రసూలమ్మ, రమణారెడ్డి, హరిత, సర్తాజ్‌లను అభినందించారు. మార్చి వరకు మరో రూ.కోటి దాకా రుణాలు ఇస్తామని వారికి తెలిపారు.