breaking news
Private tour operators
-
చైనా వీసా లేకుండా మానససరోవర్‌కు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస మానససరోవర్ యాత్రకు బయల్దేరే పౌరులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. చైనా భూభాగంలోకి వెళ్లేందుకు అవసరమైన ఎంట్రీ పర్మిట్, వీసా తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ రెండూ లేకుండా యాత్రకు వెళ్లి నేపాల్‌లో చిక్కుకుపోయిన యాత్రికులు సాయం కోరుతూ విజ్ఞప్తులు చేస్తుండటంపై ఈ మేరకు స్పందించింది. ప్రయాణానికి అవసరమైన అన్ని ట్రావెల్ డాక్యుమెంట్లు పొందిన తర్వాతే బయలుదేరాలని స్పష్టం చేసింది. ధ్రువ పత్రాలు లేకుండా, లేదా తర్వాత వస్తాయనే అంచనాతో ప్రయాణం మొదలుపెడితే మార్గమధ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. చైనా భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక పర్మిట్, వీసా తప్పనిసరని, వీటిని పొందకుండా నేపాల్ వరకు వెళ్లిన పలువురు యాత్రికులు అక్కడే చిక్కుకుపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. అందుకే యాత్రికులు తాము ఎంచుకున్న టూర్ ఆపరేటర్ సక్రమంగా రిజిస్టరైందేనని ముందుగా ధ్రువీకరించుకోవాలని సూచించింది. అన్ని అధికారిక అనుమతులు పొందిన తర్వాతే యాత్ర ప్రారంభించాలని విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. కాగా, జూన్ నుంచి ఆగస్ట్ వరకు కొనసాగే మానససరోవర్ యాత్ర ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్, సిక్కింలోని నాథు లా కనుమ మార్గాల్లో సాగుతుంది. -
మూడు భాషల్లో హజ్ యాత్ర వెబ్సైట్
సాక్షి, న్యూఢిల్లీ: హజ్ యాత్ర చేసేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హెచ్ఏజే.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసింది. ఈ వెబ్‌సైట్‌ను ఆ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ వెబ్సైట్లో మైనారిటీ వ్యవహారాల శాఖ సమాచారం, హజ్ విభాగం, హజ్ యాత్ర వివరాలు, నిబంధనలు, నియమావళి, హజ్ కమిటీ వివరాలు, ప్రైవేటు టూర్ ఆపరేటర్ల వివరాలు, ఈ యాత్రలో చేయాల్సినవి, చేయకూడనివి తదితర వివరాలను పొందుపరిచినట్టు తెలిపారు. హజ్–2017 యాత్రకు జనవరి 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.


