breaking news
private school management
-
ప్రైవేటు బడుల్లో భద్రతెంత?
కడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకునే విషయంలో ఉన్నంత శ్రద్ధ వారికి మౌలిక వసతులను కల్పించడంలో లేదనే చెప్పాలి. విద్యార్థులకు ఆటపాటలటుంచితే మలమూత్రాలను కూడా ప్రశాంతంగా విసర్జించని పరిస్థితి దాపురించింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, విద్యార్థుల భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలాగా ఉంచుతున్నారు. జిల్లాలో చాలా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను ఇరుకు గదులు, వ్యాపార సంస్థలు, అపార్టుమెంట్లలో నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 వందలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వీటిలో అధికశాతం ఇరుకుగదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపకశాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. కానీ కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడితో అటు, ఇటుగా ఉన్నా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తరువాత రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతులు, రెన్యువల్స్‌కు గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కనీస వసతులు కరువు కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులను కల్పించడం లేదనే విమర్శలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులకు తాగేందుకు సరిపడా మంచినీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలున్నాయి. వీటితోపాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు గానీ మూత్రశాలలు కానీ ఉండటం లేదు. సహజంగా భార్య,భర్తతోపాటు ఇద్దరు పిల్లలున్న ఓ కుంటుంబం సింగిల్ బాత్రూంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది వందల మంది విద్యార్థులున్న పాఠశాలల పరిస్థితిని గమనిస్తే దారుణంగా ఉంది. కడపలో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 300 మొదలుకుని వెయ్యికి పైగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలున్నాయి. ఆ పాఠశాలల్లో కూడా నాలుగైదు మరుగుదొడ్లతోపాటు తొమ్మిది పది మూత్రశాలలుంటాయి. పాఠశాల విరామ సమయంలో వాటి ముందు పిల్లలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని పలువురు వాపోతున్నారు. ఇక అమ్మాయిల ఇబ్బందులు వర్ణనాతీతం. కొంతమంది బాలికలు బాత్రూముల సమస్యతో తగినంత నీరుతాగడం మానేçస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇది కొన్ని రుగ్మతలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు పాఠశాలల్లో మౌలిక వసతులపై స్పందించాల్సిన అవసరం ఉంది. పరిశీలిస్తా అపార్టుమెంట్లు, ఇరుకైన సముదాయాల్లో పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే పరిశీలిస్తాం. నిబంధనలు పాటించకుండా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు కూడా పాఠశాలలను నిర్వహించకూడదు. – చెప్పలి దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన గదులు, ఆటస్థలంతోపాటు, మంచినీటి సౌకర్యం అలాగే ఆధునిక వసతులతో మరుగుదొడ్లు, పరిమితి గంటల్లో బోధన ఉంటుంది. దీంతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని కూడా ప్రవేశ పెట్టింది. అయినా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలనే ఆశ్రయిస్తున్నారు. అదే అదనుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది ఈ పాఠశాలల్లో చదివిన వారేనన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
సాక్షి, కొత్తగూడెం: అవినీతి నిరోధక శాఖ వలలో మరో అవినీతి చేప చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం (డి.ఇ.ఓ) కార్యాలయంలో సైదులు అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. తమ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేశారని ఆ పాఠశాల యాజమాన్యం లిఖితపూర్వకంగా ఏసీబీకీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటుండగా వలపన్ని సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. -
మల విసర్జన చేశాడని బట్టలూడదీత
బాలుడిని నగ్నంగా ఇంటికి పంపిన ప్రైవేట్ పాఠశాల సిబ్బంది శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో నాలుగేళ్ల బాలుడిపట్ల ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అమానవీయంగా ప్రవర్తించింది. తరగతి గదిలో మలవిసర్జన చేసినందుకు గాను సిబ్బంది బాలుడి బట్టలూడదీయించి నగ్నంగా ఇంటికి పంపారు. మండలంలోని రత్నాపూర్‌కు చెందిన మణిదీప్(4) శివ్వంపేట సువిద్య కిట్స్ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి దుస్తుల్లో మలవిసర్జన చేశాడు. దీంతో పాఠశాల సిబ్బంది ఆ బాలుడి దుస్తులు ఊడదీయించారు. అనంతరం ఆటోలో నగ్నంగా ఇంటికి పంపించారు. దీంతో కుటుంబ సభ్యులు కం గుతిన్నారు. బుధవారం ఉదయం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లేందుకు గ్రామానికి వచ్చిన ఆటోను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారిపట్ల అమానవీయంగా ప్రవర్తించిన పాఠశాలపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో చెప్పారు. ఈ విషయమై సదరు పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరేశ్‌ను వివరణ కోరగా.. తాను మంగళవారం పాఠశాలకు వెళ్లలేదని, ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
స్కూల్లో విద్యార్థినులతో అసభ్యకర నృత్యాలు
పామిడి: ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నిర్వాకం అనంతపురం జిల్లా పామిడిలో గత కొన్ని రోజులుగా జరుగుతోందని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి... పామిడిలోని ఓ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తమతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా స్కూలు యాజమాన్యం అడ్డుపడుతోందని కూడా విద్యార్థినులు వాపోయారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.