breaking news
Primary medical
-
పేదల ప్రాణాలంటే ‘లెక్క’లేదా?
సాక్షి, అమరావతి: పేద ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రోడ్ యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాలు సంభవించిన ఆపద సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే 108 అంబులెన్స్ వ్యవస్థ పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాల్లోని పేదలకు వైద్య సేవలందించే 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)పైనా చిన్న చూపు చూస్తోంది. 2014–19 మధ్య ఈ రెండు వ్యవస్థలను అంపశయ్య ఎక్కించిన బాబు.. మరోసారి అదే పంధాను అనుసరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి నిర్వహణ సంస్థ అరబిందోకు పైసా విదల్చక పోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో 108, 104 సేవలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి . రూ.140 కోట్లపైనే బకాయి.. సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. కాగా, ఏప్రిల్, మే, జూన్ నెలల బిల్లులను జూలై నెలలో చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కనీసం బిల్లులను వెరిఫై చేసి ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయలేదని తెలిసింది. మరోవైపు జూలై, ఆగస్టు, సెపె్టంబర్ నెలల బిల్లులు వచ్చే నెలలో చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పరిశీలించినట్లైతే ఆరు నెలల బిల్లులు బకాయి పడినట్లవుతోంది. మొత్తంగా రూ.140 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడడంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. నిలిచిపోయిన ఆగస్టు నెల వేతనాలు.. ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో నిర్వహణ సంస్థ 104, 108 వాహనాల డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఈఎంటీలకు వేతనాలు సరిగా చెల్లించడం లేదు. సెప్టెంబర్ నెల ముగస్తున్నా.. ఆగస్టు నెల వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్, జూలై నెలల వేతనాలను సైతం సంస్థ ఆలస్యంగా చెల్లించిందని చెబుతున్నారు. 2019కు ముందు రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు 336 మాత్రమే ఉండేవి. వీటిని 768కి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెంచారు. అదే విధంగా 104 ఎంఎంయూలను 936 ప్రవేశపెట్టారు. డ్రైవర్లు, ఈఎంటీలకు వేతనాలను సైతం పెంచి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. -
నలత చేస్తే..దేవుడే గతి
అన్నవరం (తొండంగి) :నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే రత్నగిరిపై ఎవరికి నలత చేసినా పరిస్థితి దైవాధీనమే అన్నట్టుంది. ఇక పుష్కరాల సందర్భంగా వెల్లువెత్తే లక్షల మంది అవసరమైతే ఓ మాత్రకు నోచుకునే అవకాశం లేదంటే అతిశయోక్తి కాదు. గతంలో మంత్రి తోట నరసింహం (ప్రస్తుతం ఎంపీ)కు కొండపై సుస్తీ చేస్తే సకాలంలో ప్రాథమిక వైద్యం అందలేదు. ఇక సాధారణ భక్తుల పరిస్థితి సత్యదేవునికే ఎరుక. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరానికి ఏటా రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకూ ఆదాయం వస్తున్నా భక్తులకు కనీస సౌకర్యాల కల్పనపై దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రత్నగిరికి వివాహాలు, ముఖ్యమైన మాసాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో తరలివస్తుంటారు. ఏటా 50 లక్షల మంది పైనే సత్యదేవుని దర్శిస్తారని అంచనా. ప్రధానంగా మాఘ, శ్రావణ, కార్తీక, వైశాఖ మాసాల్లో భక్తుల తాకిడి ముమ్మరంగా ఉంటుంది. మాత్ర కొనాలన్నా గతి లేదు.. రత్నగిరిపై సీతారామసత్రం, సత్యదేవా అతిథిగృహం,సెంటినరీ కాటేజీ, వనదుర్గ సత్రం, టీడీడీ సత్రం, ప్రకాష్‌సదన్, న్యూసీసీ, హరిహర సదన్ తదితర సత్రాల్లో 400 పైగా వసతి గదులుఉన్నాయి. వివాహాలు, ముఖ్యమైన మాసాల్లో భక్తులు రాష్ట్రంలో పలు ప్రాంతాలతోపాటు, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఈసత్రాలన్నీ నిండిపోతుంటాయి. ప్రస్తుతం సమాజంలో అనేకులకు చక్కెర వ్యాధి, రక్తపోటు వంటి సమస్యలు ఉంటున్నాయి. రత్నగిరిపై ఎవరికి ఆకస్మికంగా సుస్తీ చేసినా కనీస వైద్యం కరువే. అవసరమైన మందులు కొనుక్కోవాలంటే షాపు కూడా లేదు. గతంలో మెయిన్ క్యాంటీన్ ఎదురుగా డీసీ కాటేజీలో హోమియో, ఆయుర్వేద ఆస్పత్రులు నిర్వహించేవారు. తర్వాత వాటిని తీసివేశారు. ఏడాదిన్నర క్రితం రాష్ట్ర మంత్రి తోట నరసింహం రత్నగిరిపై అస్వస్థతకు గురైనప్పుడు కొండ దిగువనుంచి వైద్యుని తీసుకు రావలసి వచ్చింది. అనంతరం మెయిన్ క్యాంటీన్ ఎదురుగా ప్రథమ చికిత్స కేంద్రాన్ని దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసినా మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. కనీసం బోర్డు కూడా లేకుండా ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నర్సు, ఇతర సిబ్బంది పనివేళల్లో మాత్రమే చిన్న బ్యానర్ పెట్టి నిర్వహిస్తున్నారు. ప్రాథమిక చికిత్స లేక పోతున్న ప్రాణాలు రత్నగిరిపై గతంలో వనదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో ఎస్టాబ్లిష్మెంట్లో అటెండర్‌గా పనిచేసే ఈసరపు సూరి అర్జున్ గుండెపోటుతో మృతి చెందారు. తక్షణవైద్యం అందకే ఆయన మృతి చెందారని సహోద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల ఒక యాచకుడు అస్వస్థతకు గురి కాగా భక్తులు, సిబ్బంది 108లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రత్నగిరిపైనే కనీస వైద్యం అంది ఉంటే అతడు బతికేవాడని పలువురు అన్నారు. కాగా రత్నగిరి దిగువన కాంప్లెక్స్ పక్కన ఓదాత సహకారంతో దేవస్థానం ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. 30 మందికి అత్యవసర వైద్యం అందించే సౌకర్యాలున్నా ప్రస్తుతం ఒక వైద్యుడు అదీ పగటి వేళల్లో సేవలందిస్తున్నారు. ఏటా ఆస్పత్రి నిర్వహణకు వైద్యుడు, కాంపౌడర్, ఇద్దరు నర్సులు, సిబ్బంది జీతాలు, మందులకు రూ.20 లక్షలు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ కనీసం ఈసీజీ సౌకర్యం కూడా లేదు. వీల్చైర్లూ కరువే.. వికలాంగులు, నడవలేని వృద్ధులు స్వామి దర్శనానికి వెళ్లాలన్నా, వ్రతం ఆచరించాలన్నా కనీసం వీల్చైర్లు కూడా దేవస్థానంలో అందుబాటులో లేవు. గతంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు బహూకరించిన వీల్ చైర్లు ఎక్కడున్నాయో తెలియదు. ఇక రత్నగిరిపై ఎలాంటి ప్రమాదం జరిగినా బాధితులది అరణ్యరోదనే. కొండపై భక్తులు అస్వస్థతకు గురైతే కొండదిగువన 108లో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లున్నారు. అయితే ఇదే అంబులెన్స్ రౌతులపూడి, శంఖవరం, తొండంగి మండలాల్లో ప్రజలకు కూడా సేవలందించాల్సి ఉండటంతో అనేక సందర్భాల్లో అందుబాటులో ఉండడం లేదు. అమలుకు నోచని మంత్రి హామీ.. ప్రముఖక్షేత్రాల్లో ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులుగా అభివృద్ధి చేస్తామన్న దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. మరో నాలుగు నెలల్లో పుష్కరాలు వస్తున్నాయి. రత్నగిరికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో ఘాట్లు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. అదే సమయంలో కనీస వైద్యసౌకర్యాల కల్పనపై కూడా దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.