breaking news
PRICING STRATEGIES
-
భారత ఎయిర్‌పోర్ట్‌ల వ్యూహాలు మారాలి
న్యూఢిల్లీ: భారత విమానాశ్రయాలు తమ ధరల వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నాన్ ఏరో నాటికల్ ఆదాయాలను మరింత పెంచుకోవడం ద్వారా లాభదాయకతను వృద్ధి చేసుకోవాలని ఈ రంగానికి చెందిన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సూచించింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీ పౌర విమానయాన మార్కెట్‌గా అవతరించగా, ఏటేటా ఎయిర్ ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) పెరుగుతూ వెళుతుండడం తెలిసిందే. దీంతో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు తమ సేవలను విస్తరిస్తుండడం గమనార్హం. ఈ తరుణంలో కాపా ఇండియా విడుదల చేసిన నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో నడిచే విమానాశ్రయాలు నాన్ ఏరో మర్గాల (విమానయేతర) ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని ఇది సూచించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలోని విమానాశ్రయలతో పోలిస్తే పీపీపీ విధానంలోని విమానాశ్రయాల్లో నాన్ ఏరో ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ ఇవన్నీ పీపీపీ విధానంలో నడిచే విమానాశ్రయాలు కాగా, 2019–2020లో నాన్ ఏరో ఆదాయంలో వీటి వాటాయే 71 శాతంగా ఉంది. మొత్తం ప్రయాణికుల ట్రాఫిక్‌లో మాత్రం వీటి వాటా 53 శాతమే’’అని కాపా ఇండియా తెలిపింది. ఇంకా అవకాశాలున్నాయి..విమానాశ్రయాలను ప్రైవేటీకరించిన తర్వాత వాటి నాన్ ఏరో ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ.. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా మరింత పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు కాపా ఇండియా అభిప్రాయపడింది. ఇందుకోసం విమానాశ్రయాలు తమ ధరల విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌ల వనరుల విషయంలో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు ఉన్నాయా? ఎయిర్‌లైన్ వ్యాపార నమూనా, ఫ్రీక్వెన్సీ, ప్యాసింజర్ల ప్రొఫైల్ మధ్య భారీ వైరుధ్యం ఉందా అనేది పరిశీలించాలని సూచించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశీ ఎయిర్‌లైన్స్ 6.61 కోట్ల ప్రయాణికులకు సేవలు అందించడం గమనార్హం. క్రితం ఏడాదిలో విమానాల్లో ప్రయాణించిన వారు 6.36 కోట్లుగా ఉన్నారు. -
డాట్సన్ మళ్లీ వచ్చెన్..
న్యూఢిల్లీ: జపాన్ వాహన దిగ్గజం, నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌ను మరలా అంతర్జాతీయ మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ బ్రాండ్‌లో ఎంట్రీ లెవల్ కార్, డాట్సన్ గోను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్ తర్వాత ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ కార్లను నిస్సాన్ కంపెనీ విడుదల చేయనున్నది. ఈ కారు ధరలు రూ.3.12 లక్షల నుంచి రూ.3.70 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత డాట్సన్ బ్రాండ్‌ను నిస్సాన్ కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది. నిస్సాన్ కంపెనీ 1980ల్లో డాట్సన్ బ్రాండ్ కార్లను విక్రయించడం ఆపేసింది. అప్పటికి 80 ఏళ్లుగా 190 దేశాల్లో 2 కోట్లకు పైగా డాట్సన్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ డాట్సన్ గో కారు రాకతో చిన్న కార్ల సెగ్మెంట్లో పోటీ తీవ్రం కానున్నదని నిపుణులంటున్నారు. ఈ కారు మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800(రూ.2.37లక్షలు-రూ.3.52 లక్షలు), ఆల్టో కే10(రూ.3.15 లక్షలు-రూ.3.31 లక్షలు), హ్యుందాయ్ ఈఆన్(రూ.2.83 లక్షలు-రూ.3.85 లక్షలు)లకు గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లలో మూడు మోడళ్లు.. భారత కార్ల మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్లోకి డాట్సన్ బ్రాండ్‌తో ప్రవేశిస్తున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో కెనిచిరో యోముర చెప్పారు. నిస్సాన్ కంపెనీ మొత్తం భవిష్యత్తు అమ్మకాల్లో డాట్సన్ అమ్మకాలు సగం నుంచి మూడో వంతు వరకూ ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. రెండేళ్లలో మూడు డాట్సన్ మోడళ్లను అందించనున్నామని, త్వరలో రెండో మోడల్ డాట్సన్ గో ప్లస్‌ను తేనున్నామని పేర్కొన్నారు. భారత్, రష్యా, బ్రెజిల్ వంటి అధిక వృద్ధి ఉన్న దేశాల్లో తొలిసారిగా కార్లను కొనుగోలు చేసే వినియోగదారుల కారణంగా కొత్త కార్లకు డిమాండ్ పెరుగుతోందని డాట్సన్ గ్లోబల్ ప్రోగ్రామ్ డెరైక్టర్ అశ్విని గుప్తా చెప్పారు. అందుకే తొలిసారిగా కార్లు కొనే వినియోగదారులు లక్ష్యంగా ఈ కారును అందిస్తున్నామని వివరించారు. కారు ప్రత్యేకతలు... ఐదు డోర్ల ఫ్రంట్ వీల్ డ్రైవ్ డాట్సన్ గో కారులో 1.2 లీటర్ల ఇంజిన్, 5 గేర్లు(మాన్యువల్), టిల్ట్ ఎడ్జెస్ట్‌మెంట్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోలు, మొబైల్ డాకింగ్ స్టేషన్, 4 ఏసీ వెంట్లు, ఫాలో మి హెడ్‌ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. పెట్రోల్ మోడల్ డాట్సన్ గో కారు డి, ఏ, టీ... మూడు వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. నిస్సాన్ మైక్రా ఇంజిన్నే దీంట్లోనూ వాడారు. 0-100 కి.మీ వేగాన్ని 15-16 సెకన్లలో అందుకోగల ఈ కారు 20.64 కిమీ మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. ఈ సెగ్మెంట్ హ్యాచ్‌బాక్ కార్లలో విశాలమైన స్పేస్ (బూట్ స్పేస్ 296 లీటర్లు)ఉన్న కారు ఇదని కంపెనీ పేర్కొంది. ముందు సీట్లు కలిసి ఉండడం వల్ల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు మాత్రం లేవు.