breaking news
the price
-
ఎరువు.. బరువు
ధరలపై కేంద్రప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఎరువుల కంపెనీల ఇష్టారాజ్యంగా మారింది. ఒక్కో కంపెనీ ఒక్కోలా ధర పెంచేశాయి. రబీసాగులో దుక్కిలో వేయాల్సిన కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు సుమారు రూ.127కు పైగా పెరిగింది. ఖరీఫ్ సాగులో వచ్చిన నష్టాన్ని రబీలోనైనా పూడ్చుకుందామనుకున్న రైతన్నకు ఎరువుల ధరలు అశనిపాతంలా మారాయి. బ్యాంకుల నుంచి రబీ సీజన్లోనైనా వ్యవసాయ రుణాలు వస్తాయా, రావా అనే సందిగ్ధంలో రైతులున్నారు. ఊహించని విధంగా ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడి భారంగా మారింది. పంట సాగు చేయాలంటేనే అన్నదాతలు భయపడుతున్నారు. నెల్లూరు(హరనాథపురం) జిల్లాలో రబీసీజన్‌లో 2.76425 హెక్టార్లలో వరి, మినుము, వేరుశనగ, చెరకు, పత్తి తదితర పంటలను సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వరి అత్యధికంగా 1.98295 లక్షల హెక్టార్లు, మినుము 27,316 హెక్టార్లు, వేరుశనగ 4910 హెక్టార్లు, చెరకు 70,100 సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రతి రైతూ దుక్కిలో హెక్టారుకు రెండున్నర బస్తాల డీఏపీని కచ్చితంగా వేయాలి. రెండు రోజుల కిందట డీఏపీ బస్తా రూ.1181 ఉండగా, ఈ ధర ప్రస్తుతం రూ.1249కు చేరింది. డీఏపీ బస్తాపై రూ.68 పెరిగింది. 14:35:14 ధర రూ.1120 నుంచి రూ.1207కు చేరింది. బస్తాపై రూ.127 పెరిగింది. అదేవిధంగా 10: 26: 26 ధర రూ.1083 ఉండగా, రూ.1139 అయింది. 20:20:0:13 ధర రూ.919 నుంచి రూ.956కు పెరిగింది. ఒక్కో హెక్టారుకు రైతుపై రూ.200 నుంచి రూ.300 అదనపు భారం పడుతోంది. జిల్లాలో సాగవుతున్న 2.78 లక్షల హెక్లార్లకు రూ.2 కోట్లకు పైగా భారం పెరగనుంది. ఇందులో ప్రధానంగా నత్రజని మొక్క పెరుగుదలకు, భాస్వరం వేర్ల అభివృద్ధికి, పోటాష్ గింజ నాణ్యతకు, బరువు పెరుగుదలకు, పురుగులు, తెగుళ్లు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దీంతో కాంప్లెక్స్ ఎరువులను రైతులు కచ్చితంగా వాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు రైతులకు భారంగా మారనున్నాయి. అధిక ధర వసూలు చేస్తోన్న దుకాణదారులు పెరిన ధరలు రైతులకు పెనుభారం కాకగా మరోవైపు వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎరువుల దుకాణాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బదులు పడుతున్నారు. రబీ సీజన్‌కు 52,500 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కాగా, అందుబాటులో కేవలం రూ.11,200 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. యూరియా 8 వేలు, డీఏపీ 3500, ఎంఏపీ 3500 మెట్రిక్ టన్నులు ఆవసరం ఉండగా ప్రస్తుతం కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంఆర్పీ ప్రకారం యూరియా బస్తా రూ.283, వేప నూనె కలిపిన యూరియా రూ.298కి విక్రయించాల్సి ఉంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో 50 కిలోల బస్తాను రూ.360 నుంచి రూ.400 వరకు వ్యాపారులు అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బస్తాకు రూ.100 అదనంగా చెల్లించాల్సి రావడం రైతులకు పెను భారంగా మారింది. జిల్లాలోని 99 పీఏసీఎస్‌లు ఉండగా 95 మాత్రమే ఎరువుల అమ్మకాలు సాగిస్తున్నాయి. ఎరువుల ధరలను దృష్టిలో ఉంచుకుని రైతులకు విక్రయించాల్సిన ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై వ్యవసాయ అధికారులు స్పందించక పోవడం విమర్శలకు తావిస్తోంది యూరియా కోసం పడిగాపులు సూళ్లూరుపేట: స్థానిక సహకార సంఘ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రబీ సాగుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా యూరియా కొరత ఏర్పడింది. రాష్ట్రంలో యూరియా ఉత్పత్తి తగ్గిపోవడంతో కొరత నెలకొందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాను ప్రభుత్వం కేవలం సహకార సంఘాలకు మాత్రమే పంపిణీ చేస్తుందని తెలిపారు. సూళ్లూరుపేట, తడ మండలాల రైతులు బస్తా యూరియా కోసం రెండు రోజులుగా సహకార సంఘ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. సహకార సంఘానికి లారీలకు లారీలు యూరియా తెప్పిస్తున్నా రైతులకు సరిపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రైవేట్ డీలర్లు తమిళనాడులోని కొరతను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు ఆందోళనతో సాగు చేపట్టక ముందే కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ కొరతను తీర్చేందుకు వ్యవసాయాధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు తెచ్చిన వారికే యూరియా ఇస్తామని చెబుతుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధరలు తగ్గించాలి ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల నుంచి రుణాలు అందక బయట అప్పులు తెచ్చుకుని పంటలు సాగు చేశాం. రబీ సీజన్లో ఎరువుల కంపెనీలు తమ ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచడం మంచిది కాదు. ఇలా అయితే రైతులు వ్యవసాయం నుంచి పక్కకు వెళ్లే అవకాశం ఉంది. తద్వారా ఆహార కొరత ఏర్పడుతుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన ధరలు తగ్గించాలి. - కోటపూరి రమణయ్య, రైతు, పడుగుపాడు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు కృత్రిమ కొరత సృష్టించి ఎంఆర్పీకంటే అధిక ధరకు ఎరువుల బస్తా విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన కాంప్లెక్స్ ఎరువులను ఎంఆర్పీ ధరకే విక్రయిస్తున్నాం. సొసైటీలకు కేటాయించిన ఎరువులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే వారిపై శాఖా పరమైన చర్యలను తీసుకుంటాం. రబీ సీజన్‌కు అవసరమైన 52,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 11వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. సీజన్‌కు అవసరమైన ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. జిప్సమ్, జింకు సల్ఫేటు 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కేవీ సుబ్బారావు, జేడీ, వ్యవసాయ శాఖ -
చుక్కల్లో ‘చిక్కుడు’
భగ్గుమంటున్న కాయగూరలు ధరాఘాతంతో జనం విలవిల దిగుబడి లేక రెండింతలు పెరిగిన వైనం సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో చిక్కుడు కాయల ధర చుక్కలను తాకుతోంది. పచ్చి మిర్చి ఘాటు జేబుపై పడింది. బీన్స్ బేజారెత్తిస్తోంది. ఉల్లి సైతం లొల్లి చేస్తోంది. దీంతో సామాన్యులు పచ్చడి మెతుకులే పరమాన్నంగా భావిస్తున్నాడు. గత ఐదు రోజుల దాకా అందుబాటులో ఉన్న కూరగాయల ధర ఒక్కసారిగా రెండింతలు పెరిగింది. సోమవారం రైతుబజార్లో కిలో చిక్కుడు కాయలు రూ.38 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.50 చొప్పున విక్రయించారు. ఇదే సరుకు కార్పొరేట్ మాల్స్‌లో నాణ్యత (బెస్ట్ క్వాలిటీ) పేరుతో కేజీ రూ.60 వసూలు చేస్తున్నారు. స్థానికంగా పంట సాగు లేకపోవడంతో చిక్కుడుతో పాటు పచ్చిమిర్చి, కాప్సికం, ఫ్రెంచ్ బీన్స్, బెండ, బీర కాయల ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం చిక్కుడు, బెండ, గోకర కాయలను విజయవాడ నుంచి, క్యాప్సికంను బెంగళూరు, ఫ్రెంచ్ బీన్స్‌ను మహారాష్ట్ర నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల వర్షాల కారణంగా అక్కడ పంట దెబ్బతినడంతో నగరానికి దిగుమతులు బాగా తగ్గాయి. దీంతో డిమాండ్- సరఫరాల మధ్య అంతరం పెరిగింది. ఇదే అదనుగా భావించి రిటైల్ వ్యాపారులు ధరలు పెంచేశారు. పచ్చిమిర్చి ఘాటు: పచ్చి మిర్చి ధర వింటేనే కళ్ల వెంట నీళ్లొస్తున్నాయి. ప్రతి ఇంటిలోనూ నిత్యం వినియోగించే పచ్చిమిర్చి హోల్‌సేల్‌గా కేజీ రూ.28 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.40కి అమ్ముతున్నారు. ఇదే సరుకు ఇంటి ముంగిటకు తెచ్చే బండ్ల వ్యాపారులు రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా కర్నూలు, అనంతపూర్, మదనపల్లి ప్రాంతాల నుంచి నగరానికి పచ్చిమిర్చి దిగుమతి అవుతుంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల అక్కడ పంట సాగు దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు మార్కెటింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానికంగా కొత్త పంట వస్తే తప్ప మిర్చి ధరలు తగ్గవని వ్యాపారులు చెబుతున్నారు. ధరల అదుపునకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
శనగ విత్తనాల ధర ఖరారు
క్వింటా రేటు రూ.3800 కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్లో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయనున్న శనగ విత్తనాల ధరను ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. మార్కెట్లో శనగ ధర రూ.2 వేలు మించని పరిస్థితి. మంచి ధర వస్తుందనే ఆశతో గోదాముల్లో నిల్వ చేసుకున్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో గగ్గోలు పెడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సబ్సిడీ శనగ విత్తనాలకు అధిక ధర ఖరారు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. క్వింటా శనగ ధర రూ.3800గా నిర్ణయించి.. 33.33 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ లెక్కన రైతులు రూ.2,533.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు 50 కిలోల వరకు(రెండు ప్యాకెట్లు) పంపిణీ చేయనున్నారు. 25 కిలోల ప్యాకెట్‌కు రూ.633.50 చెల్లించాలని నిర్ణయించారు. సబ్సిడీ పోను రైతులు చెల్లించాల్సిన ధర కంటే తక్కువకే మార్కెట్లో శనగలు లభిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం దళారులకే వరం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు జిల్లాకు 60770 క్వింటాళ్ల శనగ మంజూరైంది. ఇందులో ఏపీ సీడ్స్ 25,770 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ 15 వేలు, ఆయిల్‌ఫెడ్ 20 వేల క్వింటాళ్లు సరఫరా చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యవసాయాధికారులు సాగు విస్తీర్ణాన్ని బట్టి సబ్ డివిజన్లకు విత్తనాలను కేటాయించారు. కర్నూలు సబ్ డివిజన్‌కు 8200 క్వింటాళ్లు, డోన్‌కు 800, నందికొట్కూరుకు 6000, కోవెలకుంట్లకు 6500, ఎమ్మిగనూరుకు 4100, ఆదోనికి 1150, నంద్యాలకు 5000, ఆళ్లగడ్డకు 5200, ఆలూరుకు 7500, పత్తికొండకు 6320 క్వింటాళ్ల ప్రకారం కేటాయించారు.