ఐష్ గర్భవతి?
పలు వాణిజ్య ఉత్పత్తుల ప్రచార చిత్రాల దర్శకునిగా ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్. అంకుర్(1974), భూమిక (1977) చిత్రాలకు దర్శకుడు శ్యామ్ బెనగళ్ దగ్గర సహాయకునిగా పనిచేసిన అనుభవం ఆయనది. 21 ఏళ్ల ఓ అమ్మాయికి 29 ఏళ్లు వచ్చే వరకూ మధ్య జరిగిన సంఘటనల సమాహారంగా ఓ కథ తయారు చేశారాయన. ఇందులో 21ఏళ్ల ఆ అమ్మాయి పాత్రను ఐశ్వర్యరాయ్‌తో చేయించాలనేది ఆయన సంకల్పం. ఓ వారంలో ఈ కథను ఐష్‌కు చెప్పబోతున్నారు కక్కర్. తన కథ గురించి కక్కర్ చెబుతూ -‘‘కథానాయికగా ఐష్ సెకండ్ ఇన్నింగ్స్ నా సినిమా నుంచే మొదలవుతుందని నేను చెప్పలేను.
ఎందుకంటే... నేను నా కథను ఇంకా ఆమె చెప్పలేదు. ఇప్పటికే ఎవరి కథకైనా ఐష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. అనే విషయం కూడా నాకు తెలీదు. ఒక వారంలో నా కథ ఆమెకు చెప్పబోతున్నా. వినగానే మరో ఆలోచనకు తావివ్వకుండా నా సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని నా నమ్మకం. ఇందులో ఐష్ 21 ఏళ్ల అమ్మాయిగా కనిపించాలి. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆమెను అలా చూపించలేం. సో... కచ్చితంగా ఆమె బరువు తగ్గాల్సిందే. శ్రమించి బరువును తగ్గించుకునే మనో నిబ్బరం ఐశ్వర్యకు ఉంది. అయితే... నన్ను వెంటాడుతున్న సంశయం ఒక్కటే..
కథ రీత్యా ఎక్కువ భాగం దక్షిణాఫ్రికాలో చిత్రీకరించాలి. కేవలం అవుడ్డోర్ షూటింగే రెండు నెలలు పడుతుంది. మరి అన్ని రోజులు తన ముద్దుల కుమార్తెను వదిలి ఐష్ ఉండగలరా! అని. దేవుడిదయవల్ల అన్నీ కుదిరితే... త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తెలియజేస్తా. మరో ముఖ్యమైన విషయం... ఈ సినిమాలో ఐష్ గర్భవతిగా నటించాలి. మామూలు గర్భవతి కాదు.. కవలల్ని మోస్తున్న గర్భవతి. ఇందులో హీరోగా ఎవర్ని అనుకుంటు న్నానో చెప్పలేదు కదు... తనెవరో కాదు అభిషేక్ బచ్చనే’’ అని వివరించారు.