breaking news
postgraduate courses
-
ఓబీసీలకు 27%.. ఈడబ్ల్యూఎస్‌కు 10%
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో అఖిల భారత కోటా(ఏఐక్యూ) పథకంలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2021–22) నుంచే ఇది అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న కీలకమైన ఈ నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఏటా వేలాది మంది యువత ప్రయోజనం పొందుతారు. వారికి మరిన్ని గొప్ప అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలో సామాజిక న్యాయానికి ఇదొక నూతన ఉదాహరణ’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. చరిత్రాత్మక నిర్ణయం ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. ‘‘వెద్య విద్య రంగంలో కేంద్ర సర్కారు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్/పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీ విద్యార్థులు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 10 శాతం రిజర్వేషన్ పొందుతారు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రిజర్వేషన్ అంశానికి ప్రభావవంతమైన పరిష్కారం కనిపెట్టాలని ప్రధాని మోదీ సోమవారం సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏటా ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీ విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 2,500 మంది ఓబీసీ విద్యార్థులు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 1,000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ధి పొందుతారు. వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు తగిన రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది’’ అని పేర్కొంది. ఆరేళ్లలో 179 కొత్త మెడికల్ కాలేజీలు దేశంలో గత ఆరేళ్లుగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఏకంగా 56 శాతం పెరగడం విశేషం. 2014లో 54,348 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 2020 నాటికి ఆ సంఖ్య 84,649కి చేరింది. ఇక మెడికల్ పోస్టుగ్రాడ్యుయేట్(పీజీ) సీట్లు సైతం 80 శాతం పెరిగాయి. 2014లో కేవలం 30,191 పీజీ సీట్లు ఉండగా, 2020 నాటికి 54,275కు చేరుకున్నాయి. దేశంలో 2014–2020 కాలంలో179 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశంలో 558 మెడికల్ కాలేజీలు(289 ప్రభుత్వ, 269 ప్రైవేట్ కాలేజీలు) ఉన్నాయి. ఆలిండియా కోటా అంటే... అఖిల భారత కోటా(ఏఐక్యూ) పథకంలో దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులంతా ప్రయోజనం పొందవచ్చు. కేవలం సొంత రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లోని ఏఐక్యూ మెడికల్, డెంటల్ సీట్ల కోసం పోటీ పడవచ్చు. ఇది కేంద్ర పథకమే కాబట్టి ఓబీసీలు ఎవరన్నది కేంద్ర జాబితా ఆధారంగా ఖరారు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలుత 1986లో ఆలిండియా కోటా పథకాన్ని ప్రవేశపెట్టారు. స్థానికతతో సంబంధం లేకుండా ప్రతిభను బట్టి ఇతర రాష్ట్రాల్లోని అత్యున్నత మెడికల్ కాలేజీల్లో సైతం చదువుకొనే అవకాశాన్ని కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ సీట్లలో 15 శాతం, మొత్తం పీజీ సీట్లలో 50 శాతం సీట్లను ఆలిండియా కోటా కిందకు చేరుస్తారు. వాస్తవానికి 2007 దాకా ఈ కోటా సీట్ల భర్తీకి ఎలాంటి రిజర్వేషన్లు ఉండేవి కావు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ 2007లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు సైతం 27 శాతం రిజర్వేషన్ ఇస్తూ 2007లో ‘కేంద్ర విద్యా సంస్థలు(ప్రవేశాల్లో రిజర్వేషన్) చట్టాన్ని’ అమల్లోకి తీసుకొచ్చింది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ వంటి కేంద్ర విద్యా సంస్థల్లోని ఈ రిజర్వేషన్లు అమలయ్యాయి. రాష్ట్రాల పరిధిలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఆలిండియా కోటా భర్తీకి రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో కేంద్ర సర్కారు రాజ్యాంగ సవరణ చేసింది. ఈ వర్గం కోసం 2019–20, 2020–21లో మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను (సూపర్ న్యూమరరీ సీట్ల ద్వారా) పెంచింది. దాంతో అన్‌రిజర్వుడ్ కేటగిరీకి అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య తగ్గలేదు. అయితే, ఆలిండియా కోటా సీట్ల భర్తీ విషయంలో ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ లభించలేదు. 2021–22 నుంచి ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. -
16 నుంచి కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు
ఇంకా అందుబాటులోకి రాని హాల్‌టికెట్లు గడువు ముగిశాక కూడా అడ్మిషన్లు ఇచ్చిన అధికారులు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య పీజీ కోర్సులు ప్రీవియస్, ఫైనల్ ఇయర్ పరీక్షలను ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఎంఏ, ఎంకాం, హెచ్ఆర్ఎం, రూరల్ డెవలప్మెంట్, ఎల్ఎల్ఎం, ఎమ్మెస్సీ మ్యాథ్‌మెటిక్స్ కోర్సుల ప్రీవియస్ పరీక్షలు ఈనెల 16, 18, 20, 23, 25వ తేదీల్లో, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17, 19, 22, 24, 26వ తేదీల్లో నిర్వహించేందుకు కేయూ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. పీజీ ప్రీవియస్ పరీక్షలను 7,465మంది, ఫైనల్ ఇయర్ పరీక్షలను 5,937మంది రాయనుండగా, టైంటేబుల్‌ను కేయూ ఎస్డీఎల్సీఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. హాల్‌టికెట్లు ఏవీ? పరీక్షల నిర్వహణకు రెండు రోజులే గడువు ఉన్నా అభ్యర్థుల హాల్‌టికెట్లు శనివారం రాత్రి వరకు కూడా వెబ్సైట్లో అందుబాటులో లేవు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సెల్ఫోన్ల ద్వారా మెసేజ్‌లు పంపించిన అధికారులు ఆచరణలోకి వచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయమై దూరవిద్య కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ డి.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా సోమవారం వరకు ఎస్డీఎల్సీఈ వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల వద్ద హాల్‌టికెట్లు ఇస్తామని, ఒక రోజు ముందు విద్యార్థులు వాటిని తీసుకోవచ్చని సూచించారు. ఇష్టారాజ్యంగా ప్రవేశాలు కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య పీజీ ప్రీవియస్, ఫైనల్ ఇయర్ పరీక్షల టైంటేబుల్‌ను అధికారులు కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. అయితే, పరీక్షల తేదీకి నాలుగైదు రోజుల ముందు కూడా పీజీ ప్రీవియస్ కోర్సుల్లో పలువురికి ప్రవేశాలు కల్పించారనే విమర్శలు వస్తున్నాయి. కొంతకాలం క్రితమే అడ్మిషన్ల ప్రక్రియకు గడువు ముగియగా.. విషయం తెలియని కొందరు విద్యార్థులు ప్రవేశాల కోసం ఎస్డీఎల్సీఈకి వస్తే అధికారులు తిప్పిపంపించారు. కానీ ఒకటి, రెండు స్టడీ సెంటర్ల నుంచి వచ్చిన వారికి మాత్రం నాలుగు రోజుల క్రితం వరకు పీజీ ప్రీవియస్‌లో అడ్మిషన్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రవేశాలు పొందిన వారం లోపే ఆయా అభ్యర్థులు పరీక్షలు రాయనుండడం గమనార్హం. ఎస్డీఎల్సీఈ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి తప్పకుండా తరగతులకు హాజరుకావాలనే నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను విస్మరించి ఫీజులు వస్తే చాలునన్న చందంగా అధికారులు ప్రవేశాలు కల్పిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొందరు ఎంఓయూ సెంటర్ల నిర్వాహకులు ప్రవేశాలు లేకున్నా అభ్యర్థులతో పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేయూ అధికారులు ఇప్పటికైనా నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలని పలువురు కోరుతున్నారు.