breaking news
Popatrao Pawar
-
ఈయన లాంటోడు గ్రామానికి ఒకడుంటే చాలు
హివరె బజర్!... పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ కరువును ఆమడ దూరం పారదోలిన అద్భుత ఆదర్శ గ్రామం. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో మారుమూల సహ్యాద్రి పర్వతప్రాంతంలో ఉంది. 400 ఎం.ఎం. వర్షపాతం. కరువు కాటకాలు. కటిక పేదరికం. హింసాత్మక వాతావరణం.. వెరసి జీవితేచ్ఛ అడుగంటిపోతున్న గడ్డు పరిస్థితుల్లో పొపట్రావ్ పవార్ కంకణం కట్టుకున్నాడు. సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్న కొద్ది ఏళ్లలోనే ఆ గ్రామం రూపు రేఖలను మార్చేశారు. ఆ కొద్ది వాన నీటినీ ఒడిసిపట్టి, గ్రామీణుల్లో సమష్టి భావనను మేల్కొల్పి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని నిబద్ధంగా నడిపించారు. ‘వాటర్ బడ్జెటింగ్’కు పట్టం కట్టి వ్యవసాయ విప్లవం కలను సాకారం చేసింది హివరె బజార్. వాటర్ మేనేజ్మెంట్ ఫోరం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం సంయుక్త ఆహ్వానంపై ఇటీవల హైదరాబాద్ వచ్చిన గాంధేయ వాది, ప్రసిద్ధ జలయోధుడు పొపట్రావు పవార్‌తో ‘సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ఉన్నత విద్యావంతులై, రాష్ట్రస్థాయి క్రికెటర్‌గా పేరు గడించిన తర్వాత మారుమూల ప్రాంతంలోని మీ స్వగ్రామం హివరె బజార్లో స్థిరపడ్డారు. 28 ఏళ్ల నుంచి గ్రామాన్నే అంటిపెట్టుకొని ఉంటూ అద్భుత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు.. ప్రస్తుతం మీ గ్రామం ఎలా ఉంది? 1989లో నేను మా ఊరిపై దృష్టి పెట్టే నాటికి తీవ్ర కరువు ఉండేది. పంటలు లేవు. తాగు నీటికీ కటకటగా ఉండేది. గ్రామంలో ఉపాధి లేదు. గొడవలు, హత్యల వల్ల మా గ్రామాన్ని అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. 95% కుటుంబాలు పొట్ట చేతపట్టుకొని పట్టణాలు, నగరాలకు వలసపోయి జీవించేవారు. మా ఊరికి ఏదైనా చెయ్యాలని ఉద్యోగానికి వెళ్లకుండా 28 ఏళ్ల క్రితం నుంచి అక్కడే ఉండిపోయాను. తొలి ఏడాదే నేను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. రిజర్వేషన్ లేనప్పుడు సర్పంచ్‌గా, రిజర్వేషన్ ఉన్నప్పుడు ఉపసర్పంచ్‌గా ఉంటున్నాను. రెండేళ్లుగా ఉప సర్పంచ్‌గా ఉన్నాను. మౌలిక మార్పు తెచ్చే పనికి వాన నీటి సంరక్షణ పనులతో శ్రీకారం చుట్టాం. 40 వేల మీటర్ల పొడవున మీటరు లోతు, మీటరు వెడల్పుతో కొండల చుట్టూతూ కందకాలు తీయించాం(40 మీటర్లకు ఒక చోట 1–2 మీటర్లు వదిలేసి కందకం తీయాలి). వాననీటిని ఇంకించే 2 పర్క్యులేషన్ చెరువులు, 54 మట్టి కట్టలతో కూడిన చెరువులు, 9 సెమీ స్టోరేజ్ టాంక్లు నిర్మించాం. వీటన్నిటినీ గ్రామస్తులతో ఉపాధి హామీ పథకం కింద అమలుపరిచాం. ఇప్పుడు మా భూముల్లో 30–40 అడుగుల లోతులో నీరుంటుంది(చుట్టుపక్కల గ్రామాల్లో 300–400 అడుగుల లోతులోనే నీరుంటుంది). అయినా, ఎంత వర్షపు నీరు భూగర్భంలోకి చేరిందో, అంత నీటిని మాత్రమే తిరిగి వాడుకుంటున్నాం. రబీ, వేసవి కాలపు పంటలకు లెక్కగట్టి మరీ వాడుకుంటాం. ఖరీఫ్‌లో పంటలకు నీటి తడులు ఇవ్వం. రబీ, వేసవి పంటలకు మాత్రమే డ్రిప్, స్ప్రింక్లర్లు వాడుతూ పొదుపుగా నీటిని వాడుతున్నాం. నీటిని అధికంగా తీసుకునే చెరకు, అరటి, దానిమ్మ, వరి తదితర పంటలను పూర్తిగా నిషేధించాం. 400 ఎం.ఎం. మా గ్రామం సగటు వర్షపాతం. 100 ఎం.ఎం. వర్షం పడితే మంచినీటికి కొరత ఉండదు. 400 ఎం.ఎం. పడిన సంవత్సరం రబీ, వేసవి పంటలు కూడా సాగు చేస్తాం. 300 ఎం.ఎం. వర్షం మాత్రమే కురిస్తే ఖరీఫ్, రబీ లతోనే సరిపెడతాం. వేసవిలో ఏ పంటా వేయం. టమాటా తొటలో తోటి రైతులతో పవార్ ‘వాటర్ బడ్జెటింగ్’ అంటే..? అవును. 1995 నుంచి గ్రామసభలో ‘వాటర్ బడ్జెటింగ్’ చేసుకుంటున్నాం. వర్షం తక్కువ కురిస్తే ఆ ఏడాది తక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తాం. భూ గర్భంలోకి ఆ ఏడాది అదనంగా చేరిన నీటిని మాత్రమే బావుల ద్వారా తోడుకొని, ఆ నీటితో పండించగలిగే రకం పంటలను, తగిన విస్తీర్ణంలో మాత్రమే పండిస్తాం. ప్రతి రెండు నెలలకు గ్రామ సభ జరుగుతుంది. అందరిముందూ చర్చించి నిర్ణయం తీసుకొని అమలు చేస్తాం. బోర్లను పూర్తిగా నిషేధించాం. అందరి పొలాల్లోనూ బావులే (మొత్తం 376) ఉంటాయి. నీటి సంరక్షణ ఫలితంగా పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా పోయింది. పశుసంపద పెరిగింది. రోజుకు 5 వేల లీటర్ల పాలు అమ్ముతున్నాం. దాదాపు ప్రతి ఇంట్లో బయోగ్యాస్ ఉంటుంది. స్లర్రీని పంటలకు ఎరువుగా వాడుతున్నాం. క్రమంగా 80 శాతం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించేశాం. మా భూములు సారవంతమయ్యాయి. తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. సేంద్రియ కర్బనం 1 శాతం కన్నా ఎక్కువగానే ఉంది. నీటి నాణ్యత, భూసారం, పంటల ఉత్పాదకత పెరిగింది. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణ గత రెండేళ్ల పరిస్థితి ఎలా ఉంది? గత రెండేళ్లలో వర్షం సరిగ్గా లేదు. గత ఏడాది 168 ఎం. ఎం. కురిసింది. అంతకుముందు ఏడాదీ దాదాపు అంతే. ఖరీఫ్‌లో వర్షాధారంగా పంటలు పండించాం. పశుగ్రాసపు పంటలు తప్ప రబీ, వేసవి పంటలకు పూర్తిగా విరామం ప్రకటించాం. దాదాపు ప్రతిఇంట్లోనూ గేదెలు, ఆవులు ఉన్నాయి. అందరికీ రోజువారీగా పాడి ఆదాయం వస్తుంది. అడవిలో పశువులు మేపడం నిషేధించాం. దసరా, దీపావళి తర్వాత గడ్డి కోసుకోవడానికి రైతులకు వీలు కల్పించాం. ఏడాదికి రూ. 100 రుసుము. బలహీనవర్గాలకు రూ. 25 మాత్రమే. చెట్లు నరకడంపై నిషేధం మొదటి నుంచీ ఉంది. మా గ్రామ పరిసరాల్లో 10 లక్షల చెట్లు నాటాం. పచ్చగా అలరారుతున్న హివరె బజార్ గ్రామం గ్రామస్తులను భాగస్వాములను చేయడం ద్వారా 28 ఏళ్లుగా ప్రకృతి వనరులను పరిరక్షించుకుంటూ నిజమైన అభివృద్ధికి బాటలు వేశారు కదా.. పేదరికాన్ని పూర్తిగా జయించగలిగారా? అవును. మా గ్రామంలో 1995లో 95% కుటుంబాలు పేదరికంలో మగ్గేవి. ఇప్పుడు మా గ్రామంలో పేదరికంతో బాధపడేవారు ఒక్కరూ లేరు. ఉపాధి హామీ పని కావాలని అడిగే వారే లేరు. నెలకు తలసరి ఆదాయం అప్పట్లో రూ. 830 ఉండేది, ఇప్పుడు రూ. 32,000కి పెరిగింది. ఆర్థికాభివృద్ధి కన్నా ఆనందంగా ఉండటంపైనే దృష్టి పెడుతున్నాం. మా ఊళ్లో రైతులెవరూ ఇతరులకు భూములు అమ్మకూడదని నియమం పెట్టుకున్నాం. ఊళ్లో నలుగురికి తప్ప మిగతా అందరికీ భూమి ఉంది. వారికి కూడా త్వరలో భూమి ఇప్పిస్తాం. 79% కుటుంబాల్లో కనీసం ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. టీచర్లు, సైనికులుగా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. మీ గ్రామంలో సాంఘిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ, కుల, మత గొడవలు లేవు. చాలా ఏళ్ల క్రితమే ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. దోమల్లేకుండా చేశాం. దోమను పట్టి చూపితే రూ. వంద బహుమతి ప్రకటించాం. మద్యపానాన్ని నిషేధించాం. హోటల్ లేదు. ఎటువంటి విగ్రహాలూ పెట్టం. సిగరెట్, తంబాకు, మాదకద్రవ్యాలకు అనుమతి లేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నేతలు ఊరి బయటే వాహనాలు, జెండాలు వదిలి గ్రామంలోకి వచ్చి ప్రచారం చేసుకోవాలి. నినాదాలు ఇవ్వకూడదు. ఏజెంట్లను గ్రామసభే ఎంపిక చేస్తుంది. పోలింగ్ గొడవలకు తావులేదు. 90%పైగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మా ఊళ్లో మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అన్ని ఇళ్లలోనూ వంటగ్యాస్ ఉంది. వంట చెరకు కోసం, నీటి కోసం కడవలతో కిలోమీటర్లు తిరగాల్సిన బాధ తప్పటం, మద్యనిషేధం, మంచి నడవడిక నేర్పే చదువు 10వ తరగతి వరకు ఊళ్లోనే అందుబాటులోకిరావడంతో ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉన్నారు. నీటిని పొదుపుగా వాడుకునే పంటల సరళి గురించి చెప్పండి..? మార్కెట్‌ను బట్టి పంటలను ఎంపిక చేసుకొని పండించడం వల్లనే రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో పంటల సరళిని రూపొందించుకోవాలి. నీటి అక్షరాస్యత, పంటల సరళి అక్షరాస్యత, గ్రామ ప్రజల భాగస్వామ్యం.. గ్రామాల అభివృద్ధికి చాలా కీలకం. మన భూములు ఎలాంటివి? ఆ భూములకు నీటి తేమను పట్టి ఉంచే శక్తి ఎంత మేరకు ఉంది? భూగర్భంలోకి ఎంత వాన నీటిని ఇంకింపజేసుకోవచ్చు? వర్షాకాలంలో వ్యవసాయ బావుల్లోకి నీరు ఎంత మేరకు వస్తోంది? ఈ వివరాలను అధ్యయనం చేస్తే మూడేళ్లకు ఆ గ్రామంపై పూర్తి అవగాహన వస్తుంది. ఆ తర్వాత సాగుకు నీరు ఎంత అందుబాటులో ఉండేదీ అంచనా వేసుకొని, ఆ ఏడాది ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది నిర్ణయించుకోవాలి. హివరె బజార్లో జలసంపదను చూపుతున్న పొపట్రావు పవార్ మీ గ్రామంలో ఎలా చేశారు? ఉన్నది వెయ్యి హెక్టార్ల సాగు భూమి. 250 హెక్టార్లలో చింత, వేప, మామిడి, బత్తాయి వంటి తోటలు వేసి వర్షాధారంగానే సాగు చేస్తున్నాం. ఈ తోటల్లో అంతరపంటలుగా మునగ, తదితర కూరగాయలు వేస్తుంటాం. ఖరీఫ్‌లో వర్షం బాగానే ఉంటే ఉల్లి ఎక్కువ వేస్తాం. ప్రధానంగా తీపి జొన్న, సజ్జ, టమాటా, బంతి పూలు, ఆకుకూరలు వర్షాధారంగానే సాగు చేస్తాం. రబీలో పంటలకు మాత్రమే నీటి తడులు ఇస్తాం. నీటిని పారగట్టడం అసలు లేదు. రబీలో జొన్న, బంగాళదుంప, బఠాణి, టమాట, ఆకుకూరలు వంటి పంటలు వేస్తాం. సగం నీరు వర్షం ద్వారా అందతుంది. మిగతా సగం నీరు డ్రిప్/స్ప్రింక్లర్ ద్వారా ఇస్తాం. ఏడాది పొడవునా ముఖ్యంగా వేసవిలో పశుగ్రాసపు పంటలు వేస్తాం, పాడి పశువులకు ఇబ్బంది లేకుండా. వేసవిలో పూల తోటలు కూడా వేస్తాం. వరుసగా రెండేళ్లు 400 ఎం.ఎం. వర్షపాతం ఉంటే పూర్తిస్థాయిలో పంటలు పండిస్తాం. అంటే.. ఖరీఫ్‌లో 100%, రబీలో డ్రిప్/స్ప్రింక్లర్ల ద్వారా 70%, వేసవిలో 30% విస్తీర్ణంలో తగిన పంటలు వేస్తాం. 200 ఎం.ఎం. మాత్రమే వర్షపాతం ఉంటే ఖరీఫ్‌లో తక్కువ రోజుల్లో తక్కువ నీటితో పండే బఠాణి, ఆకుకూరలు, పశుగ్రాసం, టమాట పండిస్తాం. రబీలోనూ అంతే. నాలుగు సార్లు నీటి తడి అవసరమయ్యే ఉల్లి పంట కూడా వేయం. తీపి జొన్నకు రెండు తడులు, శనగకు ఒక తడి సరిపోతాయి. ఉల్లికి 4 తడులు అవసరమవుతాయి. రైతులంతా ఒప్పుకుంటున్నారా? గ్రామసభలోనే చర్చించి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. మొదటి ఐదేళ్లలో కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు నీటి అక్షరాస్యత పెంపొందించుకోవడంతో రైతులందరూ సంతోషంగానే ఒప్పుకుంటున్నారు. పంట విరామం కాలంలో బంధువుల ఊళ్లకు వెళ్లి సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. హెక్టారుకు ఎంత నికరాదాయం వస్తున్నది? సాధారణంగా హెక్టారుకు ఏడాదికి రూ. 30 వేల నుంచి 50 వేల వరకు రైతులకు నికరాదాయం వస్తున్నది. ఎక్కువ డబ్బు కావాలని లేదు. ఆనందంగా ఎంత వస్తే అంతే చాలు. మీ కుటుంబం గురించి..? మాది ఉమ్మడి కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములం, ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఉమ్మడి భూమి 25 ఎకరాలు. 28 ఏళ్ల నాడూ అంతే, ఇప్పుడూ అంతే. 10 ఎకరాల్లో సీతాఫలం తోట వేశాం. మిగతా 15 ఎకరాల్లో ఉల్లి, తీపి జొన్న, టమాట, బంతి పూలు తదితర పంటలు పండిస్తున్నాం. ఎం.కాం. చదివాను. క్రికెటర్‌గా రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించాను. అయినా, ఉద్యోగం చూసుకోవడం కన్నా ఊరికోసం పనిచేయడం మంచిదని ఊళ్లోనే ఉంటున్నాను. నా కుమార్తెకు పెళ్లి చేశాను. కుమారుడు ఈ మధ్యనే అగ్రి బిఎస్సీ పూర్తి చేశాడు. ఊళ్లోనే ఉండి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా నీటి నిపుణుల దృష్టిని మీ గ్రామం ఆకర్షించింది కదా..? 1995 నుంచి గ్రామస్థాయిలో పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకొని అమలు చేస్తున్నాం. ఉపాధి హామీ, ఆదర్శ గ్రామ పథకం ద్వారా నిధులతో, గ్రామస్తుల శ్రమదానంతోనే అన్ని పనులూ చేసుకున్నాం. అదనపు నిధులు గానీ, విదేశీ నిధులు గానీ, కార్పొరేట్ నిధులు గానీ పైసా కూడా తీసుకోవట్లేదు. గ్రామానికి చెందిన వారి విరాళాలను మాత్రమే తీసుకుంటున్నాం. మా గ్రామాన్ని రోజూ 500 మంది సందర్శిస్తూ ఉంటారు. 60 దేశాల నీటి నిపుణులు సందర్శించారు. అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు మా అభివృద్ధి నమూనాను అధ్యయనం చేస్తున్నాయి. రాజకీయ, కుల, మత ప్రాతిపదికపై చీలిపోయి ఉన్న గ్రామాల్లో మీ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యమేనా? ముమ్మాటికీ సాధ్యమే. మొదట ఒక వ్యక్తి లేదా కుటుంబం గ్రామంలోనే ఉండి దృఢ దీక్షతో పనిచేయాలి. నాలుగైదేళ్ల తర్వాత ఫలితాలు రావడం చూసి ప్రజలు మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఎటొచ్చీ నాయకత్వం వహించే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా నిలబడాలి. అంతే. నాకు అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్లు ఇస్తామని అనేక పార్టీలు ఆఫర్ ఇచ్చినా నేను తిరస్కరించి, గ్రామం కోసమే నిలబడ్డాను. రాజధానిలో ప్రణాళికలు రచించి ఒక శాఖ లేదా సంస్థ ద్వారా వాటిని అమలు పరిస్తే.. ఇక గ్రామీణ సమాజానికి భాగస్వామ్యం ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచం ఇవ్వాళ ఎదుర్కొంటున్న సమస్యలను మేం 25 ఏళ్ల క్రితమే పరిష్కరించగలిగాం. గ్రామ ప్రజలను భాగస్వాముల్ని చేయగలిగాం కాబట్టే ఇది సాధ్యపడింది. గ్రామాలు, ప్రభుత్వం కలిసి అభివృద్ధి కోసం పాటుపడాలి. అయితే, ఈ ప్రయాణంలో గ్రామాలే డ్రైవర్ సీటులో ఉండాలి! -
మిలియనీర్ల గ్రామం!
ఆదర్శం: కరవు తాండమాడిన చోట కనకపు పళ్లేలలో భోజనం చేస్తున్నారు. చెంబు నీరు దొరకని చోట స్విమ్మింగ్ ఫూల్స్ వెలిశాయి. ఆకలి ఏడుపులు వినిపించిన చోట విందులు దినచర్య అయిపోయాయి. ఇది ఒక ప్రైవేటు ప్రాజెక్టు కాదు, ప్రభుత్వ చొరవ కూడా కాదు... ఒక వ్యక్తి తలంపు, ఒక ఊరి అభివృద్ధి. ఏ గ్రామానికి అయినా ఉనికి... నీరు, పాడి, పంట. ఈ మూడు లేకుంటే ఆ ఊరిలో తిండి దొరకదు. తొలుత జనం, ఆ తర్వాత ఊరు ఉనికిలేకుండా పోతాయి. ఇలాంటి పరిస్థితికి దగ్గరగా వెళ్లివచ్చిన గ్రామం హివ్రే బజార్(మహారాష్ట్ర). 1972లో తీవ్ర కరవు ఛాయలు మొదలైన ఆ ఊరు ఉపాధి లేక ఆకలికేకలతో అల్లాడింది. పంట లేదు, పని లేదు. జనంలో అసమానతలు భేదాభిప్రాయాలు పెరిగిపోయాయి. దొంగతనాలు, అల్లర్లు, మద్యపానం వంటివి పెచ్చరిల్లాయి. 1980ల చివరకు ఊరు దాదాపు ఖాళీ అయ్యింది. 90 శాతం మంది బతుకు తెరువును వెదుక్కుంటూ ఊరు వదిలేశారు. అప్పటికున్న ఊరి సర్పంచి వయసులో పెద్దాయన. పేరుకు సర్పంచి కానీ ఉపయోగం లేదు. అలాంటి సమయంలో ఆ ఊరిలో పీజీ చదువుకున్న ఏకైక వ్యక్తి పొపట్రావు పవార్‌కు మిత్రులు అందరూ నువ్వు సర్పంచిగా పోటీ చేయమని సలహా ఇచ్చారు. చేతనైన విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. పవార్‌కు ఆసక్తి లేదు. వాళ్లింట్లో వారికి ఇష్టం లేదు. నగరానికి పోయి ఉద్యోగం చేయాలని ఇంట్లోవాళ్లు, క్రికెటర్ కావాలని పవార్ ఆలోచించేవాడు. కానీ మిత్రులు నిరంతరం పోరే సరికి ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. తనకిష్టం లేకున్నా పోటీ చేసి గెలిచాడు. కానీ గెలిచాక మాత్రం అదొక అద్భుతమైన అవకాశంగా అనిపించింది. పేదరికానికి నిలయమైన ఆ ఊరిలో 22 బెల్టుషాపులు, సారా దుకాణాలుండేవి. అసలు గొడవలన్నీ వాటివల్లే. వాటిని తొలగించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ర్టతో మాట్లాడి గ్రామంలో ఉపాధి కోసం స్వల్పకాలిక రుణాలు మంజూరుకు చర్చలు జరిపి విజయం సాధించాడు. తీవ్ర కరవుతో అల్లాడిన ఆ గ్రామంలో పొపట్రావు మొదలుపెట్టిన మొదటి అభివృద్ధి పని వర్షపు నీటి యాజమాన్యం. ఊరి పొలిమేరలో కురిసిన ఒక్క చుక్క కూడా వృథా కాకుండా ఆ ఊరిలో ఎక్కడ పల్లముంటే అక్కడ వర్షపు నీటి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించాడు. అలాంటివి 52 భారీ ఇంకుడు గుంతలు తవ్వించాడు. గుట్టల నుంచి వచ్చే నీరు వృథా కాకుండా రాతి గట్లు నిర్మించాడు. వర్షాకాలపు కాలువలు పారే చోట తొమ్మిది చెక్‌డ్యాములు కట్టించాడు. వీటికి అవసరమైన డబ్బును ప్రభుత్వం వెంటపడి మరీ సంపాదించాడు సర్పంచ్ పొపట్రావు. ఇవన్నీ నిర్మించడం పూర్తయ్యాక ఏడాది కాలంలోనే సాగు పొలం 20 హెక్టార్ల నుంచి 70 హెక్టార్లకు పెరిగింది. నీటి నిల్వ కారణంగా భూగర్భజలాలు విపరీతంగా పెరగడంతో బోర్లలో నీరు పైకి వచ్చాయి. దానివల్ల అనేకరకాల పంటలు పెట్టే అవకాశం వచ్చింది. ఇపుడు 40 అడుగుల లోపే కావల్సినన్ని నీళ్లు. హివ్రే బజార్ ఇపుడు అహ్మద్‌నగర్ జిల్లాలోనే సస్యశ్యామలంగా ఉండే గ్రామం. నీటితో పాటు సిరులు 90 శాతం స్థానికులు ఖాళీ అయిన హివ్రేబజార్లో నీళ్లు వచ్చాక వలసపోయిన జనం సొంతూరికి తిరిగి రావడం మొదలుపెట్టారు. 1995లో ఆ ఊరి తలసరి ఆదాయం 830 రూపాయలు. ఇపుడు అది 30,000 రూపాయలు. 1995లో ఆ ఊరిలో 170 పేద కుటుంబాలుంటే వాటిలో 165 కుటుంబాలు బీపీఎల్ కిందున్నవే. ఇపుడు 255 కుటుంబాలుంటే కేవలం 3 కుటుంబాలే పేదవి. మిగతా వారిలో 60 మంది మిలియనీర్లు. దేశంలో అత్యధిక మిలియనీర్లున్న ఏకైక గ్రామమిది. జనాభా ప్రాతిపదికన అత్యధిక కార్లున్న గ్రామం కూడా ఇదే. దీనికంతటికీ కారణం ఆ గ్రామం చేసుకున్న వర్షపు నీటి నిర్వహణ. ఆ ఊరిలో పడిన ప్రతి చుక్క వాననీరు భూమిలోకైనా ఇంకాలి, పొలంలో అయినా పారాలి. వరితో నీరు వృథా చేయకుండా మొక్కజొన్న, జొన్న, సజ్జలు, ఉల్లిగడ్డలు, పొటాటోలు వంటి వేర్వేరు పంటలు శాస్త్రీయంగా, తక్కువ మందులతో పండించారు. అలా సస్యశ్యామలమైన ఈ ఊరు ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మారింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాటర్‌షెడ్ ఇన్స్టిట్యూషన్ను పెట్టింది. ఇలా ఆ ఊరిలో ప్రతిఒక్కరికి తమ స్థాయికి ఉపాధి, ఉద్యోగం లభించాయి. ఊరి నుంచి ప్రతిరోజు 4000 లీటర్ల పాలు ఎగుమతి చేస్తున్నారు. ఇలా క్రమం తప్పని వ్యవసాయం, ఉపాధి పనులతో మిలయనీర్లయ్యారు.