breaking news
Pooja Chopra
-
నమ్మకాన్ని నిలబెడతా
నిర్మాత విపుల్ షా సినిమాలో మళ్లీ అవకాశం లభించడం సంతోషంగా ఉందని బాలీవుడ్ నటి పూజా చోప్రా తెలిపింది. ‘రూప్ నగర్ కీ ఛీతే’ సినిమాలో నటించడం ఓ వైపు ఆనందాన్ని కలిగి స్తున్నా, అదే సమయంలో తనను తాను నిరూపించుకునేందుకు ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించింది. గతంలో విపుల్ షా నిర్మించిన కమాండోలో నటించిన పూజా చోప్రా అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈ మాటలు మాట్లాడింది. ‘అవును. ఎంతో ఉద్వేగంతో ఉన్నా. విపుల్ షా లాంటి నిర్మాతలు తనకు మరో చాన్స్ ఇచ్చి ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. ఈ సినిమాలో నటించాలంటే ఎంతో ఒత్తిడిగా ఉంది. అయితే దీనివల్ల వచ్చే ఫలితంతో అమితమైన ఆనందం కలుగుతుంది. షా నాకు రెండో అవకాశమిచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నటిస్తాన’ని పూజా చోప్రా సోమవారం మీడియాకు తెలిపింది. కమాండో సినిమాలో ఓ చిన్న పట్టణ యువతి సిమ్రిత్ కౌర్ పాత్రను పోషించిన తాను ఈ సినిమాలో విభిన్న పాత్రలో నటిస్తున్నానని వివరించింది. ‘వచ్చే ఏడాది జనవరి నాలుగు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. కమాండో సినిమాకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. స్నేహం గురించే ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యూత్‌ఫుల్ స్టోరీ’ అని ఆమె పేర్కొంది. ఈ సినిమాలో ఢిల్లీలోని ఓ మోడ్రన్ గర్ల్ పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ఇందుకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది. షా నిర్మిస్తున్న రూప్ నగర్ కీ ఛీతే సినిమాకి విహాన్ సూర్యవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. -
ఆత్మరక్షణ విద్య అవసరం: పూజాచోప్రా
న్యూఢిల్లీ: ఆపద సమయాల్లో మహిళలు తమను తాము రక్షించుకోవడానికి తప్పకుండా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని కమాండోతో బాలీవుడ్‌కు పరిచయమైన పూజాచోప్రా అంటోంది. మనదేశంలో ఇటీవల జరిగిన ఘటనలు మహిళల భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని బాధపడింది. ‘మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వేధింపులే పత్రికలకు పతాక వార్తలుగా మారుతున్నాయి. కాబట్టి మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకుంటే విపత్కర పరిస్థితుల నుంచి బయటపడే అవకాశముంటుంది’ అని పూజ చెప్పింది. తన తొలిచిత్రం కమాండో ‘అండ్ పిక్చర్స్’ చానెల్లో ప్రసారం కావడంతో ఎంతో సంతోషంగా ఉండని, నవతరం అభిరుచులకు అనుగుణంగా అండ్ పిక్చర్స్ కార్యక్రమాలను రూపొందిస్తోందని ప్రశంసించింది. కమాండో సినిమాను ప్రతి మహిళా చూడాలని, ప్రస్తుత సమస్యలకు ఈ చిత్రం పరిష్కారాలను చూపిస్తుందని వివరించింది. అంతేకాదు కమాండో సీక్వెల్‌కు కూడా నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విద్యుత్ జమ్వాల్ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. సీక్వెల్లోనూ పూజకే చాన్స్ దక్కింది. మరింత బాగా నటించేందుకు వీలుగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కొన్ని సినిమాలు చూడాల్సిందిగా నిర్మాత విపుల్‌షా పూజకు సూచించాడు. తాను ఇది వరకే మిల్క్, ది హెల్ప్ వంటి సినిమాలు చూశానని ఈ బ్యూటీ చెప్పింది. ఫెమీనా మిస్ ఇండియా కూడా అయిన పూజకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం. ‘చిన్నప్పుడు ఒక చిలిపిపని చేసేదాణ్ని. దార్లో కనిపించే శునకాలకు నా టిఫిన్ బాక్సులోని చపాతీలు తినిపించేదాణ్ని. ఒక రోజు కుక్కలన్నీ నా చుట్టూ తిరగడం అమ్మ చూసి ఇదేంటని అడిగింది. నిజం చెప్పేశాను. మొదట్లో కోప్పడ్డా.. తరువాత జంతువులపై నేను చూపించే ప్రేమను మెచ్చుకుంది’ అని వివరించింది.