breaking news
podutur
-
ఆ గెజిట్ రీషెడ్యూల్ కోసమేనా!
ప్రొద్దుటూరు: వరదలు వచ్చి 8 నెలలైంది. ప్రస్తుతం వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరద నష్టంపై గెజిట్ విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది తుపాన్ ప్రభావం కారణంగా జరిగిన నష్టంపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జిల్లాకు సంబంధించి 41 మండలాల పరిధిలోని 308 రెవెన్యూ గ్రామాల్లో వరద నష్టం జరిగినట్లు ఈ జాబితాలో పేర్కొన్నారు. గ్రామాల వారిగా వివరాలను గెజిట్‌లో ప్రకటించారు. ఈ ప్రకారం ఈ మండలాలను వరద ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పంట రుణాల రీషెడ్యూల్ కోసమే ప్రభుత్వం ఈ గెజిట్‌ను తయారు చేసిందనే చర్చ జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో పాలిన్ తుపాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ నష్టాన్ని ప్రకటించలేదు. అక్టోబర్‌లో వరదలు వచ్చినా ఇంత కాలం దీని ఊసేలేదు. కాగా అక్టోబర్ 8 నుంచి 27వ తేదీ వరకు పాలిన్ తుపాన్ ప్రభావం కారణంగా జిల్లాలో ప్రాణనష్టం, పశుసంపద నష్టం, ఇళ్ల నష్టం, పంట నష్టం, ఉద్యానవన, మత్స్యశాఖ, రోడ్లు మరియు భవనాలు, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర శాఖలకు సంబంధించి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లోని విపత్తు నిర్వహణ మండలి వారు సూచించిన మేరకు జిల్లాలోని 41 మండలాల పరిధిలో ఉన్న 308 రెవెన్యూ గ్రామాల్లో ఈ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 13న ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రీ షెడ్యూల్ కోసమేనా! పంట రుణాల రీ షెడ్యూల్ కోసమే ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో ప్రకృతి వైపరీత్యాల కింద నష్టం జరిగినట్లు గెజిట్‌ను ప్రచురించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా జూన్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం చేసినట్టే చేసి సాధ్యాసాధ్యాల కోసం కోటయ్య కమిటీని నియమించారు. కొన్ని షరతులకు బ్యాంకర్లు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం ఈ అంశంపై శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. మరో వైపు గడువు మీరిపోవడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 661 మండలాలకుగాను 113 మండలాల్లో కరువు, 462 మండలాల్లో తుపాన్ ప్రభావానికి గురయ్యాయని ప్రకటించారు. కరువు తుపానులు వచ్చిన నేపథ్యంలో పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలని ఆయన కోరారు. దీనిని బట్టి ప్రభుత్వం వ్యూహం ప్రకారం గెజిట్‌ను విడుదల చేయించినట్లు తెలుస్తోంది. -
26న విజయమ్మ, 28న షర్మిల రాక
ప్రొద్దుటూరు/జమ్మలమడుగు/రాయచోటి, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 26న వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిల ఈనెల 28న జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 26న రాయచోటిలో వైఎస్ విజయమ్మ రోడ్‌షో నిర్వహిస్తారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 28న ఉదయం ఎర్రగుంట్లలో, సాయంత్రం జమ్మలమడుగులో షర్మిల మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తెలిపారు. అదే రోజు ఉదయం 11గంటలకు షర్మిల ప్రొద్దుటూరులో జరిగే సభలో పాల్గొంటారని నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
ప్రచార వేడి
సాక్షి, కడప: పుర సమరంలో ప్రచార పర్వం ఉరకలేస్తోంది. వరుస ఎన్నికల పరంపరలో తొలిదైన మున్సిపోల్స్‌కు కేవలం ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అభ్యర్థులకు మండే ఎన్నికలు పరీక్షగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. మున్సిపాల్టీల్లో పాగా వేసి సార్వత్రిక ఎన్నికలకు బాటలు వేసుకునేందుకు ప్రధాన పార్టీలు శత విధాల ప్రయత్నిస్తున్నాయి. సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.. వైఎస్సార్సీపీ దూకుడు.... మున్సిపోల్స్‌లో వైఎస్సార్ దూకుడు పెంచింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఠమొదటిపేజీ తరువాయి ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే వ్యూహలకు పదును పెడుతోంది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఎక్కువ హడావిడి చేస్తున్న డివిజన్లు, వార్డులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్కడ అభ్యర్థులకు మట్టి కరిపించేందుకు తన దైన శైలిలో ప్రచారాన్ని ఉధృతం చేసింది. వైఎస్సార్సీపీ ప్రవేశ పెట్టేబోయే పథకాలను వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను దింప లేక ఇప్పటికే చేతులెత్తేసింది. వైఎస్ఆర్ జిల్లా స్థానిక పరిశీలకులు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. నాయకులతో మంతనాలు జరుపుతూ గెలుపు బాటలకు మార్గం సుగమం చేస్తున్నారు. కడప కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థి కె.సురేష్ బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథరెడ్డి, నియోజక వర్గ సమన్వయ కర్త అంజాద్బాషాతో పాటు ముఖ్య నేతలు వ్యూహత్మకంగా వెళుతూ అన్నీ తామై నడిపిస్తున్నారు. డివిజన్లలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రచారంలో బాగా వెనకబడింది. ఆపార్టీ నాయకుల మధ్య సయోధ్య లేక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. టీడీపీ మేయర్ అభ్యర్ధి బాలకృష్ణా యాదవ్ అంత ప్రభావం చూపలేక పోతున్నారని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. మున్సిపాలిటీలలో.... ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. అక్కడ వైఎస్సార్సీపీ నియోజక వర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి, ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ఏక తాటిపై నిలబడి గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారంలో దూసుకు పోతున్నారు. టీడీపీ స్థానిక నేతల మధ్య లుకలుకలతో అక్కడ పార్టీ సతమతమవుతోంది. పులివెందుల్లో వైఎస్సార్సీపీ దూసుకు పోతోంది. అక్కడ టీడీపీ, కాంగ్రెస్ ప్రభావం నామ మాత్రంగానే ఉంది. బద్వేలులో నియోజక వర్గ సమన్వయ కర్త డీసీ గోవిందరెడ్డి, రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి అధ్వర్యంలో ఇప్పటికే జనాదరణ పెంచుకున్న వైఎస్సార్సీపీ ప్రచారంలో ముందంజలో పయనిస్తోంది. ఇక్కడ టీడీపీ నాయకులు సర్వ శక్తులు ఒడ్డుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆపార్టీ అపసోపాలు పడుతోంది. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి నేతృత్వంలో అన్నివిధాల పార్టీ ముదంజలో ఉంది. ఇక్కడ టీడీపీ పరువు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై పడరాని పాట్లు పడుతోంది. మైదుకూరు మున్సిపాలిటీలో ఎస్ .రఘరామిరెడ్డి అధ్వర్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ శ్రేణులను ఏక తాటిపైకి తెచ్చి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పరువు నిలుపుకునేందుకు డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి సుధాకర యాదవ్ పడరాని పాట్లు పడుతున్నారు. మొత్తం మీద మున్సిపోల్స్‌కు గడువుకు ఆరు రోజులే ఉండటంతో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది.