breaking news
P.Murali
-
‘రాయల్ కమిషన్’ను నియమించిన రాజప్రతినిధి?
బ్రిటిష్ ఆర్థిక విధానం వ్యవసాయ వ్యాపారీకరణ: బ్రిటిష్ పాలనలో వ్యవసాయ ‘వ్యాపారీకరణ’ ప్రారంభమైంది. వారి పరిశ్రమలకు తగిన ముడిసరుకు కోసం వ్యవసాయాన్ని వ్యాపార స్థాయిలో కొనసాగించారు. బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల కంటే భారత్ పారిశ్రామికంగా వెనుకబడి ఉండేది. యూరప్, అమెరికా మార్కెట్లలో వాణిజ్య లాభాలు పొందడానికి బ్రిటిష్ పరిశ్రమల్లో ఇక్కడి ఉత్పత్తులను ఉపయోగించేవారు. మాంచెస్టర్‌లోని పత్తి సరఫరా సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయించింది. 1869లో రాయల్ కమిషన్ పత్తి పంట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి రాష్ర్టంలోనూ ఒక ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయాలని కోరింది. పారిశ్రామిక విప్లవం తర్వాత బ్రిటన్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న వస్త్ర పరిశ్రమకు నాణ్యమైన ముడి పత్తి అవసరమైంది. బ్రిటిషర్లు భారత్‌లో నీలిమందు, తేయాకు, కాఫీ తోటల సాగును ప్రోత్సహించారు. ఈ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉండేది. ఈ తోటలన్నీ బ్రిటిషర్ల ఆధీనంలోనే ఉండేవి. జౌళి ఉత్పత్తిని కూడా ప్రోత్సహించారు. దీనికి అమెరికాలో మంచి డిమాండ్ ఉండేది. ఇలా బ్రిటిషర్లు వారి పరిశ్రమలకు కావాల్సిన, వ్యాపారపరంగా అధిక లాభం ఉన్న వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వ్యవసాయ వ్యాపారీకరణ వల్ల బ్రిటిషర్లతో పాటు కొంత మంది భారతీయ వ్యాపారులు, రుణదాతలకు ప్రయోజనం చేకూరింది. దీనివల్ల కొన్ని పరిశ్రమల స్థాపనకు వీలు కలిగింది. ప్రారంభంలో పరిశ్రమలు స్థాపించింది బ్రిటిష్ పెట్టుబడిదారులే. వీరి విధానం వల్ల భారత ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఆహారపంటల కింద ఉండే భూమి తగ్గిపోయింది. వ్యవసాయ శాఖ వాణిజ్యపంటల అభివృద్ధికే కృషి చేసింది. 1892-93 నుంచి 1919-20 ఏళ్ల మధ్య వ్యవసాయ పంటల కింద ఉన్న భూమి 7 శాతం మాత్రమే. వ్యవసాయేతర పంటల కింద పెరిగిన భూమి 43 శాతం. తిరిగి 1934-35 నుంచి 1939-40 మధ్య వ్యవసాయేతర పంటల కింద భూమి 1.6 మిలియన్ల ఎకరాలు పెరిగింది. ఆహార పంటల కింద భూమి 1.5 మిలియన్ల ఎకరాలకు పడిపోయింది. ముడి పత్తి ఎగుమతి 1900-01లో 1,78,000 టన్నులుండగా 1936-37కి 7,62,133 టన్నులకు పెరిగింది. అంటే.. ఈ పెరుగుదల 328 శాతం. 1939-40లో అది 5,26,411 టన్నులుగా ఉంది. తేయాకు ఎగుమతులు 1900-01లో 190 మిలియన్ పౌండ్లు ఉండగా 1939-40 లో 359 మిలియన్ పౌండ్లకు పెరిగింది. నూనె గింజలు 1900-01లో 5,49,000 టన్నులుండగా 1938-39లో 11,72,802 టన్నులకు పెరిగింది. బ్రిటిషర్లు కేవలం వాణిజ్య పంటలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత్‌లో జనాభాకు సరిపోయే ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాలేదు. జనాభా పెరిగే కొద్దీ ఈ పరిస్థితి విషమించింది. వ్యవసాయంపై ఆధారపడటం పెరిగే కొద్దీ భూకమతాలు తరిగిపోయాయి. 1914లో ధరల విచారణ సంఘం పేర్కొన్న వివరాలు కూడా ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేశాయి. భారత్‌లో వ్యవసాయానికి కావాల్సిన ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టలేదు. ఈ విధానాలు పేద ప్రజలను నష్టపర్చాయి. కనీస ఆహారాన్ని సమకూర్చుకోవడం కూడా వారికి కష్టమైంది. గ్రామీణ రుణాలు: బ్రిటిషర్లు అనుసరించిన రెవెన్యూ విధానం వల్ల ప్రభుత్వానికి, రైతులకు మధ్య అనేక దళారులు పుట్టుకొచ్చారు. భూమి చిన్న చిన్న కమతాలుగా మారింది. రైతులు కఠిక దారిద్య్రంలో కూరుకుపోయారు. రుణభారం వ్యవసాయానికి ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఈ సమస్యలన్నీ 1870కి పూర్వమే అంటే జనాభా విస్ఫోటనానికి ముందే ఉత్పన్నమయ్యాయి. 1921లో జనాభా పెరుగుదల అధికమవడంతో ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఆర్థికంగా లాభంలేని భూకమతాలు, వ్యవసాయ నీటిపారుదల తక్కువగా ఉండటం, వ్యవసాయాన్ని ఆధునికీకరణ చేయకపోవటం లాంటి అంశాలు తక్కువ దిగుబడికి కారణాలయ్యాయి. దీనికితోడు వసూలు చేసే రెవెన్యూ మొత్తం చాలా ఎక్కువగా ఉండేది. రైత్వారీ, మహల్వారీ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మధ్యవర్తులను తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అస్సాం లాంటి ప్రాంతాలు మినహా మిగిలినచోట్ల ప్రభుత్వం 19వ శతాబ్దం నుంచే రెవెన్యూ వసూలు ధనరూపంలోనే చేయడం ప్రారంభించింది. దీన్ని ఒక నిర్ణీత తేదీలోపు వసూలు చేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వ్యాపారుల నుంచి ఎక్కువ వడ్డీలకు ధనాన్ని తీసుకురావాల్సి వచ్చేది. పేద రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపడం, దొంగ సంతకాలు లాంటివి చేసేవారు. జమీందారీ విధానం అమల్లో ఉన్నచోట రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. అక్రమంగా పన్ను వసూలు చేసేవారు. రైత్వారీ, మహల్వారీ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం జమీందార్ల స్థానాన్ని ఆక్రమించి పండిన పంటలో 1/2వ వంతు లేదా 1/3వ వంతు పన్ను నిర్ణయించేది. మధ్యవర్తుల కారణంగా రైతులపై అదనపు భారం పడేది. ప్రభుత్వం, రైతుల మధ్య ఉండే దళారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అనేక సందర్భాల్లో రైతులు భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవడమో, పంటను తక్కువ ధరకు స్థానిక వ్యాపారస్థులకు విక్రయించడమో జరిగేది. సరైన మార్కెట్ విధానం లేకపోవడం, వ్యవసాయ వ్యాపారీకరణ పెరగడం వల్ల స్థానిక వ్యాపారస్థులకు రైతులను దోచుకోవడం సులభమైంది. రుణ సౌకర్యం పొందే అవకాశంలేక తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక వడ్డీ వ్యాపారుల వద్దకే వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల రైతులు రుణభారంతో కుంగిపోయేవారు. ప్రభుత్వం వడ్డీ వ్యాపార వ్వవస్థకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయలేదు. రైతుల బాధలను తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విజయవంతం కాలేదు. రుణాల విషయంలో గరిష్ఠ పరిమితి వడ్డీని నిర్ణయిస్తూ ప్రభుత్వం ్ఖటఠటజీౌఠట ఔౌ్చట అఛ్టిను అమలు చేసింది. 1918-26లో ఈ చట్టాన్ని సవరించినప్పటికీ వడ్డీ వసూలు విషయంలో ఫలితాలను సాధించలేకపోయింది. 1904లో సహకార సంఘాల చట్టాన్ని రూపొందించి, రుణభారాన్ని తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది. 1939-40 నాటికి 60 లక్షల మంది సభ్యులతో 1,37,000 సంఘాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. పంజాబ్‌లో సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 10.2 శాతం కుటుంబాలు లబ్ధి పొందగా, ఇతర రాష్ట్రాల్లో ఈ సంఖ్య 4 శాతంగానే ఉండేది. 1936 తర్వాత రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు కూడా కొన్ని శాసనాలు చేసినప్పటికీ అవి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోలేకపోయాయి. 1931లో కేంద్రబ్యాంకు విచారణ కమిటీ తన నివేదికలో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల్లో మొత్తం గ్రామీణ రుణభారం తొమ్మిది వందల కోట్ల రూపాయలని తెలిపింది. వ్యవసాయంపై వేసిన రాయల్ కమిషన్ గ్రామ ప్రాంతాల్లో రుణాలను నియంత్రించాలని సూచించింది. వడ్డీ వ్యాపారులకు లెసైన్సులివ్వాలని కొన్ని రాష్ర్ట బ్యాంకింగ్ ఎంక్వయిరీ కమిటీలు ప్రతిపాదించాయి. భూమి మార్పిడిని తగ్గించడానికి లాండ్ ఎలినేషన్ యాక్ట్ (ఔ్చఛీ అజ్ఛ్చ్టీజీౌ అఛ్టి)ను అమల్లోకి తెచ్చారు. పంజాబ్‌లో వ్యవసాయేతరులు వ్యవసాయదారుల వద్ద నుంచి భూమిని కొనుగోలు చేయడం గానీ, తాకట్టు పెట్టుకోవడం గానీ చేయకూడదని ప్రభుత్వం ఈ చట్టం ద్వారా శాసించింది. మాదిరి ప్రశ్నలు 1. వ్యవసాయంపై ‘రాయల్ కమిషన్’ను నియమించిన రాజప్రతినిధి ఎవరు? 1) కర్జన్ 2) హార్డింగ్ 3) ఇర్విన్ 4) రిప్పన్ సమాధానం: 3 వివరణ: వ్యవసాయంపై మెక్‌డొనాల్డ్ కమిషన్‌ను కర్జన్ నియమించాడు. హార్డింగ్ పత్రికలపై ఎమర్జెన్సీ చట్టం ప్రవేశపెట్టాడు. ఇర్విన్ 1926లో వ్యవసాయంపై రాయల్ కమిషన్‌ను నియమించాడు. రిప్పన్ ‘స్వపరిపాలన పితామహుడు’గా ప్రసిద్ధి చెందాడు. 2. కేంద్ర బ్యాంకింగ్ ఎంక్వయిరీ కమిటీ ఏర్పడిన సంవత్సరం? 1) 1929 2) 1935 3) 1930 4) 1931 సమాధానం: 4 3. లార్డ కర్జన్ వ్యవసాయ కళాశాలను ఎక్కడ స్థాపించాడు? 1) కలకత్తా 2) కటక్ 3) పూసా 4) పైవన్నీ సమాధానం: 3 4. పంజాబ్‌లో వ్యవసాయేతరులు వ్యవసాయదారుల నుంచి భూమిని కొనడం, తాకట్టు పెట్టుకోవడాన్ని నిషేధించింది? 1) ల్యాండ్ ఎలినేషన్ యాక్ట్ 2) ‘లీ’ కమిషన్ 3) మెక్‌డొనాల్డ్ కమిషన్ 4) మెక్లాన్‌గన్ కమిటీ సమాధానం: 1 5. {ఫెడరిక్ నికాల్సన్ నివేదిక ప్రకారం సహకార సంఘాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1904 2) 1905 3) 1903 4) 1902 సమాధానం:1 6. ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ గ్రంథ రచయిత? 1) జె.ఎస్. మిల్ 2) రికార్డో 3) ఆడమ్ స్మిత్ 4) దాదాబాయ్ నౌరోజీ సమాధానం: 1 7. ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్’ గ్రంథ రచయిత? 1) రమేష్ చంద్రదత్ 2) అంబేద్కర్ 3) రికార్డో 4) గున్నార్ మిర్దాల్ సమాధానం: 3 8. మహల్వారీ విధానాన్ని ఎవరి సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు? 1) థామస్ మన్రో 2) హాల్డ్ మెకంజీ 3) జాన్ షోర్ 4) బర్డ సమాధానం: 2 9. 1900-01లో భారత తేయాకు ఎగుమతులు ఎన్ని మిలియన్ పౌండ్లు? 1) 120 2) 190 3) 210 4) 350 సమాధానం: 2 -
తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి చెందినవారు?
బిటిష్ పాలనలో విద్యా సంస్కరణలు ప్రాచీన కాలంలో తక్షశిల, నలందా, విక్రమశిల మొదలైన విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధిగాంచినవి. 19వ శతాబ్దంలో మన విద్యా వ్యవస్థలో అనేక లోపాలున్నందువల్ల, ఆంగ్ల పద్ధతిలో బోధన ఉత్తమంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఆంగ్ల విద్యనే ప్రవేశపెట్టాలని, ఆ విద్యను అభ్యసించిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల భారతదేశంలో ప్రాచీన విద్య మనుగడ ప్రమాదంలో పడింది. ఆంగ్లేయులు వచ్చిన మొదటి శతాబ్దంలో విద్య గురించి ఎక్కువ శ్రద్ధ చూపలేదు. క్రీ.శ. 1781లో వారన్ హేస్టింగ్స తొలిసారిగా కలకత్తాలో పర్షియా, అరబిక్ భాషల్లో బోధన కోసం ‘కలకత్తా మదర్సా’ అనే విద్యా సంస్థను స్థాపించాడు. క్రీ.శ. 1791లో డంకన్ బెనారస్‌లో సంస్కృత కళాశాలను ఏర్పాటుచేశాడు. లార్డ వెల్లస్లీ క్రీ.శ. 1802లో ఆంగ్లేయ అధికారులకు భారతీయ భాషలను, సాంఘిక ఆచారాలను బోధించడానికి ‘విలియం కోట’ కళాశాలను స్థాపించాడు. కానీ, ఈ కళాశాలను బోర్డ ఆఫ్ డెరైక్టర్‌స ఆదేశం మేరకు మూసివేశారు. 1813 చార్టర్ చట్టం వచ్చేంతవరకు విద్యకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ ఎలాంటి చర్యలనూ చేపట్టలేదు. 1813 చార్టర్ చట్టంలో ఈస్టిండియా కంపెనీ విద్యావ్యాప్తికి ఏటా లక్ష రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించింది. విద్యావ్యాప్తి కోసం చట్టం ద్వారా ధనాన్ని కేటాయించడం అదే తొలిసారి. ఆంగ్లేయాది పరభాష గ్రంథాలను దేశీయ భాషల్లోకి అనువాదం చేయడానికి, సంస్కృతం, అరబ్బీ, పర్షియన్ భాషల్లో గ్రంథాలను అచ్చువేయడానికి ఈ ధనాన్ని వినియోగించారు. రెండు దశాబ్దాల వరకూ విద్యావిషయమై కంపెనీ ఏ చర్యా తీసుకోలేదు. తర్వాత భారతదేశంలో బోధన ప్రాచ్య విద్యలో ఉండాలా? పాశ్చాత్య (ఇంగ్లిష్) విద్యలో ఉండాలా? అనే వివాదం చెలరేగింది. ప్రాచ్య విద్యను ప్రవేశపెట్టాలని విల్సన్, ప్రిన్సెస్ సోదరులు సూచించారు. ఆంగ్లభాషలో విద్యను బోధించాలని రాజారామ్మోహన్రాయ్ మద్దతుతో ‘చార్లెస్ ట్రావెలియన్’ వాదించారు. ఆంగ్ల మాధ్యమంలో పాశ్చాత్య శాస్త్రాలు, పాండిత్యాన్ని బోధించాలని పాశ్చాత్య విద్యావాదులు చెప్పారు. క్రీ.శ.1835లో మెకాలే భారతదేశంలో బోధన ఇంగ్లిష్‌లో ఉండాలని ప్రకటించిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. దీనివల్ల ఆంగ్లేయులకు, భారతీయులకు ఇద్దరికీ లాభమని మెకాలే అభిప్రాయం. భారతదేశంలోని గ్రంథాలన్నీ కలిపినా ఆంగ్ల భాషలోని కొన్ని పుస్తకాలతో సరితూగవు అని ఇతడు పేర్కొన్నాడు. కాబట్టి ఆంగ్ల భాష నేర్చుకున్నట్లయితే ఆంగ్ల గ్రంథాలను చదివి భాషాశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలవుతుందని, అప్పుడు భారతీయులు ఆంగ్లేయులతో సరితూగగలరని మెకాలే అభిప్రాయం. అందువల్ల ఆంగ్ల విద్య భారతీయులకు లాభదాయకమని వాదించాడు. బొంబాయి ప్రభుత్వం 1845లో ఒక ఆర్డినెన్స జారీ చేస్తూ బెంగాల్, మద్రాస్ ప్రభుత్వాల మాదిరిగానే పాఠశాల, కళాశాల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, పాశ్చాత్య జ్ఞానాన్ని మాతృభాషలోనే బోధించాలని నిశ్చయించింది. ఆంగ్ల విద్య చరిత్రలో క్రీ.శ. 1854కు ప్రాముఖ్యం ఉంది. 1853లో బ్రిటిష్ పార్లమెంట్ భారత విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. ఫలితంగా క్రీ.శ. 1854లో బోర్డ ఆఫ్ డెరైక్టర్‌స అధ్యక్షుడైన సర్ చార్లెస్ ఉడ్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. ఈ కమిటీ విద్య విధానానికి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించింది. అదే ‘ఉడ్‌స డిస్పాచ్’గా ప్రసిద్ధి చెందింది. ఉడ్‌స ప్రణాళికలోని ముఖ్యాంశాలు: * భారతీయులను విద్యావంతులను చేసే బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలి * ప్రభుత్వ సహాయంతో పాఠశాలను, కళాశాలలను ఏర్పాటు చేసేట్లుగా ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహమివ్వాలి. * ప్రతి ప్రావిన్‌సలో పాఠశాల ఇన్స్పెక్టర్లను, విద్యా డెరైక్టర్లను నియమించాలి. * పెసిడెన్సీ పట్టణాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. * భారతీయులకు పాశ్చాత్య విద్య.. ము ఖ్యంగా విజ్ఞానశాస్త్ర, తత్వజ్ఞాన, సాంఘిక శాస్త్రాలను బోధించి కంపెనీలో ఉద్యోగాలివ్వడానికి తగిన అర్హతలు కల్పించాలి. * ఉపాధ్యాయులకు శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలి. పై అంశాలతో కూడిన బృహత్తర ప్రణాళికను ‘సర్ చార్లెస్ ఉడ్’ సూచించాడు. ఆ కాలం లో గవర్నర్ జనరల్‌గా పనిచేస్తున్న లార్డ డల్హౌసీ ఈ ప్రణాళికను అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాడు. ప్రభుత్వం ‘ఆక్స్ఫర్డ విశ్వవిద్యాలయం’ తరహాలో కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో విశ్వ విద్యాలయాలను స్థాపించింది. ఈ విశ్వవిద్యాలయాల్లో చాన్సలర్, వైస్ చాన్సలర్లను నియమించారు. ‘సెనెట్’ అనే ఒక సమావేశ సంఘాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని దశాబ్దాల వరకు చార్లెస్ ఉడ్ సూచించిన విధంగా భారతదేశంలో విద్యా విధానం కొనసాగింది. ఉడ్‌స ప్రణాళిక తర్వాత ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రిప్పన్ కాలంలో 22 మంది సభ్యులతో ‘హంటర్’ అధ్యక్షతన ఒక కమిషన్ ను క్రీ.శ.1882లో నియమించారు. ప్రాథమిక, స్త్రీ విద్యకు ప్రాధాన్యమివ్వాలని ఈ కమిషన్ తన నివేదికలో సూచించింది. విద్య, సాంఘిక సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల మద్దతు పొందాలని ‘హంటర్’ సూచించాడు. క్రీ.శ. 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం, 1887లో అలహాబాద్ విశ్వవిద్యాలయాలను స్థాపించారు. లార్డ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు విద్యారంగంలో అనేక మార్పులు చేపట్టాడు. ఆ మార్పుల్లో భాగంగా విద్యాధికారులందరినీ సిమ్లాలో సమావేశపర్చి కొన్ని అంశాలను చర్చించారు. ఆ అంశాలను పరిశీలించడానికి ‘సర్ థామస్ ర్యాలీ’ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం సమర్పించిన నివేదిక ఆధారంగా లార్డ కర్జన్ క్రీ.శ. 1904లో విశ్వ విద్యాలయ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. విద్య ద్వారా భారతదేశంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక శాఖలోని విద్యాశాఖ సభ్యుడు ‘సర్ హెన్రీ బట్లర్’ క్రీ.శ. 1913లో ఒక ప్రతిపాదన చేస్తూ విశ్వవిద్యాలయాల పూర్తి బాధ్యతను కేంద్రం తీసుకోవాలని సూచించాడు. కొన్ని విషయాల బాధ్యత కష్టతరంగా ఉంటుంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు విశ్వ విద్యాలయాలు స్థాపించాలని తీర్మానించాడు. తర్వాత పాట్నా, నాగపూర్, రంగూన్, కాశీ, అలీఘర్, హైదరాబాద్‌లలో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. క్రీ.శ. 1916లో పుణేలో డి.కె. కార్వే స్త్రీల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. క్రీ.శ. 1917లో నియమించిన ‘శాడ్లర్ కమిటీ’ ఇంటర్మీడియట్ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని సూచించింది. బీఏ (హానర్‌స) కోర్సును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని, టీచర్ ట్రైనింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, స్త్రీ, వృత్తి విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. క్రీ.శ. 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్లో ‘విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని’ ఏర్పాటు చేశారు. క్రీ.శ. 1927లో సైమన్ కమిషన్‌తోపాటు విద్యా విషయాలను పరిశీలించేందుకు ‘హార్టాగ్ (ఏ్చట్టౌజ)’ కమిటీని నియమించారు. తర్వాత 1944లో సార్జంట్ విద్యాప్రణాళికలో కొన్ని ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు. మహాత్మాగాంధీ మరికొంత మంది జాతీయ నాయకులు సమావేశమై క్రీ.శ. 1937లో ‘సేవాగ్రామ్’లో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంతవరకు ఈ ప్రణాళికను అమలు చేశాయి. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంలో అనేకమార్పులు చోటుచేసుకున్నాయి. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో సరికానిది? (2001 సివిల్స్) 1) కలకత్తా మదర్సా:వారన్ హేస్టింగ్స (1781) 2) వారణాసి సంస్కృత పాఠశాల : జోనాథన్ డంకన్ (1792) 3) చార్లెస్ ఉడ్ డిస్పాచ్ : డల్హౌసీ (1854) 4) ఆంగ్ల విద్యాచట్టం: విలియం హార్వే (1828) సమాధానం: 4 వివరణ: 1835లో మెకాలే ‘లా’ కమిషన్ అధ్యక్షతన విలియం బెంటింక్(భారతదేశ తొలి గవర్నర్ జనరల్) ఆంగ్ల విద్యా చట్టాన్ని ప్రవేశపెట్టాడు. జోనాథన్ డంకన్ ‘వారణాసి’లో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశాడు. కలకత్తాలో వారన్ హేస్టింగ్స మదర్సాను ఏర్పాటు చేశాడు. 2. కిందివాటిలో సరైంది ఏది? (2003 సివిల్స్) ఎ) ఇండాలజీ పితామహుడు: సర్ విలియం జోన్స బి) తులనాత్మక పితామహుడు: మాక్స్ ముల్లర్ సి) {పాచ్య పితామహుడు: వి.ఎ. స్మిత్ డి) పాశ్చాత్య పితామహుడు: జె.ఎస్. మిల్ 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, డి మాత్రమే 4) అన్నీ వాస్తవాలే సమాధానం: 4 వివరణ: సర్ విలియం జోన్స 1784లో ‘ఏసియాటిక్ సంస్థ’ను కలకత్తాలో ప్రారంభించి భారత సంస్కృతిని వెలుగులోకి తేవడానికి కృషి చేశారు. ఈ సంస్థ తరఫున కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం (నాటకం)ను, జయదేవుని-గీతాగోవిందం(పద్యకావ్యం)ను, మనుస్మృతి-న్యాయస్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు. ఇతని సహాయకుడు చార్లెస్ విల్కిన్స ‘భగవద్గీతను’ ‘సెలిటీయస్ సాంగ్స’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. మాక్స్ ముల్లర్ తులనాత్మక పితామహునిగా ప్రసిద్ధి. ఇతను 1862లో రుగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించి ‘వేదముల్లర్’గా పేరు గడించారు. ఈ గ్రంథం లో ఆర్యుల జన్మప్రాంతం ‘మధ్య ఆసియా’గా పేర్కొన్నాడు. వి.ఎ. స్మిత్ 1867లో భారతదేశాన్ని సందర్శించి అనేక గ్రంథాలు రచించాడు. ఇతడు సముద్రగుప్తుడిని భారత నెపోలియన్‌గా పేర్కొన్నాడు. 1817లో జేమ్స్ మిల్స్ భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా క్రోడీకరించారు. 3. విద్యా వ్యవస్థపై వచ్చిన కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో వాస్తవమైంది? (2004 సివిల్స్) ఎ) హంటర్ కమిషన్ - లార్డ రిప్పన్ (1882) బి) సర్ థామస్ ర్యాలీ - 1904 కర్జన్ సి) శ్లాడర్ కమిటీ - లార్డ ఇర్విన్ (1926) డి) వార్టాగ్ కమిషన్ - 1917 చేమ్స్‌ఫర్‌డ 1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ సరైనవే సమాధానం: 2 వివరణ: 1882లో లార్డ రిప్పన్ ‘హంటర్’ కమిటీని నియమించారు. దీని ప్రకారం స్త్రీ విద్య, మత విషయాలతో సంబంధం లేని విద్య, నైతిక విద్య అవసరం అని పేర్కొన్నారు. 1904లో కర్జన్ థామస్ ర్యాలీ కమిటీని నియమించారు. కలకత్తా, బొంబాయి, మద్రాస్ సెనెట్లలో 20 మంది సభ్యులు, మిగతా ప్రాంతాల్లో 15 మంది ఉండాలని కమిటీ సూచించింది. శ్లాడర్ 1917లో ఇంటర్మీడియట్ తరగతులను ఉన్నత పాఠశాలలో చేర్చాలని తీర్మానించాడు. 1927లో వార్టాగ్ కమిషన్‌ను లార్డ ఇర్విన్ నియమించాడు. 4. ‘1857 ఉడ్ డిస్పాచ్’ కమిటీ తీర్మానాల్లో లేని అంశం ఏది? 1) ఉపాధ్యాయులకు శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలి 2) తెలివైన విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి 3) ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు వేరే శాఖలో ఉండాలి 4) విద్యావ్యాప్తి కోసం 50 లక్షల రూపాయలు కేటాయించాలి సమాధానం: 4 వివరణ: 1912 చట్టంలో రెండో హార్డింగ్ రాజ ప్రతినిధి విద్యకోసం, ఆధునిక విద్య ప్రోత్సాహానికి 50 లక్షల రూపాయలను కేటాయించారు. వైస్రాయ్ కార్య నిర్వాహక శాఖలోని విద్యాశాఖ సభ్యుడు ‘సర్హెన్రీ బట్లర్’ 1913 లో ఒక ప్రతిపాదన చేస్తూ విశ్వవిద్యాలయాల పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలని సూచించాడు. కొన్ని విషయాల బాధ్యత కష్టతరంగా ఉంటుంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు విశ్వ విద్యాలయాలు స్థాపించాలని తీర్మానించాడు.