breaking news
Pliers
-
పెళ్లికి బాజా మోగింది
జిల్లా అంతటా శుభకార్యాల సందడి ఆర్నెళ్ల ముందే రిజర్వయిన కల్యాణమంటపాలు పేరున్న పురోహితులకు అడ్వాన్స్ చెల్లింపులు ఆ మూడు రోజుల్లోనే మూడుముళ్లకు మొగ్గుచూపుతున్న జంటలు ఆగస్టులో మంచి ముహూర్తాలు అనంతపురం కల్చరల్: జిల్లా వ్యాప్తంగా పెళ్లి సందడి కనపడుతోంది. సాధారణంగా శ్రావణ మాసం పెళ్లిళ్లకు శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో చాలా ముహూర్తాలున్నా ఆగస్టు 09. 12, 17 తేదీల్లోనే ఎక్కువగా వివాహాలు నిశ్చయమైనాయి. ఇవన్నీ కూడా అత్యంత మంచి ముహూర్తాలు కావడంతో వేలాది జంటలు ఒకటి కానున్నాయి. ఇప్పటికే ఈనెల 2న మంచి ముహూర్తం వెళ్లిపోయింది. ఇక రానున్న మంచి ముహూర్తాల్లోనే వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, అన్నప్రాసనలు, నామకరణోత్సవాలు, అక్షరభ్యాసాలు వంటి శుభకార్యాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని కళ్యాణ మంటపాలు, ఫంక్షన్ హాళ్లు , దేవాలయాలు, విద్యా సంస్థలు, ఆఖరుకు కళాసంస్థలు కూడా వివాహాలకు వేదికలుగా మారాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని ఫంక్షన్ హాళ్లు, ఆలయాలలోని కల్యాణ వేదికలు మందుగానే రిజర్వు అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పెన్నహోబిలం, రాప్తాడులోని పండమేటి వేంకటేశ్వరాలయం వంటి ఆలయాల్లోని కల్యాణమంటపాలున్న చోట్ల ఒకేరోజు రెండు, మూడు కంటే ఎక్కువ వివాహాలు జరుగుతున్నాయి. పెరిగిన డిమాండ్ పెళ్లిళ్లలన్నీ ఒకటి రెండు ముహూర్తాల్లోనే ఎక్కువగా ఉండడంతో పురోహితులు, భజంత్రీలు, సప్లయర్స్, క్యాటరింగ్ తదితర వాటికీ విపరీతమైన డిమాండు ఏర్పడింది. అలాగే పూల దుకాణాలు, గిఫ్ట్ షాపులు కూడా జనంతో రద్దీగా మారుతున్నాయి. ఆలయాల్లోని గదులు బంధుమిత్రులకు సరిపోకపోవడంతో సమీప ప్రాంతాల్లోని లాడ్జిలను బుక్ చేస్తున్నారు. ఈనేథ్యంలో జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలలోని లాడ్జిలు రిజర్వ్ అయిపోవడమే కాకుండా వాటి అద్దెలు కూడా పెరిగినట్టు వ«ధూవరుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కల్యాణ మంటపాలకు లక్షలాది రూపాయలు అద్దె వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో కేవలం రూ.6 వేలకే కల్యాణమంటపం అద్దెకు దొరుకుతుండడంతో అందరూ అక్కడికి పరుగు తీస్తున్నారు. అందువల్లే ఇక్కడ ఆర్నెళ్లు ముందుగానే కల్యాణ మంటపం రిజర్వు అవుతోంది. సమయం చాలడం లేదు శ్రావణమాసంలో శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అయినా ఈసారి బలమైన ముహూర్తాలు కేవలం రెండు మూడు మాత్రమే ఉన్నాయి. మళ్లీ అక్టోబర్ నెలలోకూడా ఒకటి రెండు ముహూర్తాలు మాత్రమే బాగున్నాయి. తర్వాత వరుస ముహూర్తాలు కావాలంటే నవంబర్ 23 నుండి 30 వరకు ఆగాల్సిందే. దాంతో ఈ శ్రావణంలో సమయం అసలు చాలడం లేదు. వివాహాలంటే అదరాబదరా చేయించలేం..కొందరు విధి లేక ఒకేరోజు రెండు మూడు శుభకార్యాలు చేయిస్తున్నారు. –కరణం వాసుదేవరావు, పురోహితులు, రాప్తాడు. ఆరు నెలల ముందే బుక్ అయిపోయాయి ఈ సారి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. మంచి ముహూర్తాలున్న రోజుల్లో ఆరు నెలలకు ముందుగానే బుక్ చేసుకున్నారు. కనీసం మూడు నెలల కిందటే చెబితే తప్ప అద్దెకివ్వలేని స్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇదే నెలలో ఎక్కువగా జరుగుతున్నాయి. –మోహనయ్య, మేనేజర్, టీటీడీ కల్యాణమండపం -
శుభకార్యాల శ్రావణం
కడప కల్చరల్ : శ్రావణమాసం అనగానే పండుగలు, శుభ కార్యాల మాసమని భావిస్తారు. ఆగస్టు 2న అమావాస్య అనంతరం 3వ తేది బుధవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. సెప్టెంబరు 2వ తేదీ వరకు ఈ మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో శనివారాలు ఎంతో పవిత్రమైనవని విశ్వసిస్తారు. శుక్ర వారాలు కూడా అంతే పవిత్రంగా భావించి వ్రతాలు నిర్వహిస్తారు. సోమవారాలు సైతం శివాలయాలలో పూజలు చేస్తారు. ఈ సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు శనివారాలు (ఆగస్టు 6, 13, 20, 27), నాలుగు శుక్రవారాలు (ఆగస్టు 5, 12, 19, 26), నాలుగు సోమవారాలు (ఆగస్టు 7, 14, 21, 28) రానున్నాయి. దాదాపు శుక్ర, శనివారాలన్నీ వ్రతాలు, ఆలయాలలో విశేష పూజలతో సందడిగా ఉంటాయి. సోమవారాలు సైతం మహిళలు మంగళ గౌరీమాతకు విశేష వ్రతాలు జరుపుతారు. ఇందులో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అంత్యంత భక్తిశ్రద్ధలతో సామూహికంగా నిర్వహిస్తారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజని, ఆరోజున వ్రతం చేస్తే పుణ్య ఫలాలు తప్పక లభిస్తాయని భక్తుల విశ్వాసం. మిగతా శుక్ర వారాలు కూడా వ్రతాలు నిర్వహించేందుకు మంచి రోజులుగా భావిస్తారు. శివాలయాల్లో..... శ్రావణమాసం వైష్ణవులకు మాత్రమే పవిత్రమైన మాసమని ఎక్కువమంది భావిస్తారు. కానీ శివాలయాలలో సైతం ఈ మాసంలోని ఐదు సోమవారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పార్వతీమాతను మంగళగౌరీగా అలంకరించి శ్రీ మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తారు. శ్రావణపౌర్ణమి నాడు శ్రీ గాయత్రీదేవికి వ్రతాలు నిర్వహిస్తారు. కొందరు భక్తులు మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని జరుపుతారు. అదేరోజున నోములు నోచుకుంటారు. ఈ మాసం శివకేశవులకు అభేదాన్ని సూచిస్తుంది. ఈ మాసంలో 9న మంగళగౌరి వ్రతం, 12న శ్రీ వరలక్ష్మివ్రతం, 18న శ్రావణపౌర్ణమి (రక్షా బంధనం), 24న శ్రీకృష్ణజన్మాష్టమి పండుగలు రానున్నాయి. ఇన్ని పండుగలు వస్తాయి గనుక ఈ మాసాన్ని పండుగల మాసంగా పేర్కొంటారు. ముహూర్తాలు ఏప్రిల్ తర్వాత హిందువుల వివాహాలకు సంబంధించి ముహూర్తాలు లేకపోవడంతో అడపా దడపా దేవాలయాల్లోనూ వివాహాలు నిర్వహించుకున్నారు. మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రావణమాసం మంచి అవకాశాలను ఇస్తుంది. ఈ మాసంలో వివాహాలు చేసుకోవడం శుభప్రదంగా కూడా భావిస్తారు. శ్రావణమాసం దాదాపు పూర్తిగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు మొదటి రెండు వారాలు కూడా అడపాదడపా ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత దసరా పండుగ తర్వాతే ముహూర్తాలు ఉన్నాయి. దీంతో దసరా వరకు వేచి ఉండడం మంచిది కాదన్న భావనతో పలువురు ఈ మాసంలోనే వివాహాలు నిర్వహించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
ఈజిప్టులో వింత వైద్యం.. వీడియో హల్ చల్!
-
శ్రావణం వ్రత సమయం.. శుభతరుణం
సందర్భం - శ్రావణం శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు నోములు, వ్రతాల సందడితో కళకళలాడుతూ లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంది. తన ప్రాణనాథుడు శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం పేరుమీదుగా వచ్చిన మాసం కాబట్టి లక్ష్మీదేవికి ఈ మాసమంటే ఎంతో ఇష్టం. లక్ష్మీవిష్ణువులకు ప్రీతిపాత్రమైన ఈ మాసం శుభకార్యాలు నిర్వహించేందుకు అత్యంత అనువైంది. ఈ నెల 27 నుంచి శ్రావణమాసం ఆరంభమవుతున్న సందర్భంగా ఈ వ్యాస కుసుమం. గృహిణులు ఈ నెలరోజులూ ఇంటిముంగిట శుభ్రంగా ఊడ్చి, కళ్లాపు చల్లి, అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది, గుమ్మానికి మంగళతోరణాలు కట్టి, కళకళలాడుతూ ఉంటే కనుక లక్ష్మీదేవి ఆ ఇంటిముంగిలికి వచ్చి, ముగ్గులో కాలుపెట్టి, తాను కొద్దికాలం పాటైనా వసించడానికి ఆ ఇల్లు యోగ్యమైనదా కాదా అని ఆలోచిస్తుందట. చంచల స్వభావురాలైన లక్ష్మీదేవిని కొద్దికాలం పాటైనా మన ఇంటిలో కొలువుండేలా చేయాలంటే ఒకటే మార్గం... ఏ రూపంలోనైనా మన ఇంటికి రాగల అవకాశం ఉన్న శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన ముత్తయిదువులను మనసారా ఆహ్వానించి, కాళ్లకు పసుపు పూసి, నొసట బొట్టుపెట్టి, పండ్లు, పూలు, రవికెల గుడ్డ వంటి మంగళకరమైన వస్తువులనిచ్చి మర్యాద చేయడమే. శ్రావణమాసంలో నోములు- వ్రతాలు సోమవార వ్రతం: శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో సోమవారం వ్రతం ఎంతో విశిష్టమైనది. ఈ రోజున శివుని ప్రీత్యర్థం ఉపవాసం లేదా నక్తవ్రతాన్ని ఆచరించడం వల్ల సత్ఫలితాలను సాధించవచ్చు. సోమవార వ్రతంలో పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివుని శక్తికొలది అభిషేకించి ఆర్చించాలి. రోజంతా ఉపవసించడం ఈ వ్రతవిధి. ఉండలేనివారు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం పూజానంతరం భుజించవచ్చు. మంగళగౌరీ వ్రతం: శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా వివాహమైన స్త్రీలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నారదుడు సావిత్రీదేవికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించినట్లుగా చెప్పబడింది. ఈ వ్రతంలో పగలు విధివిధానంగా మంగళగౌరీ దేవిని పూజించాలి. పూజలో ఉత్తరేణి దళాలు, గరికతో గౌరీదేవిని అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైవులను పిలిచి నానబెట్టిన శనగలను వాయనంగా ఇవ్వాలి. ఈ వ్రతంలో తోర పూజ ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ వ్రతాన్ని పెళ్లయినప్పటి నుండి అయిదు సంవత్సరాలు ఆచరించాలి. ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి. వరలక్ష్మీవ్రతం: శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కృప కలిగి కోరిన కోరికలు తీరతాయి. సకల శుభాలూ చేకూరతాయని వ్రత మహాత్మ్యం చెబుతోంది. సూపౌదన వ్రతం: శ్రావణ శుద్ధ షష్ఠి రోజున ఆచరించే ఈ వ్రతం శివ సంబంధమైనది. సూపౌదనం అంటే పప్పు -అన్నం (సూప: పప్పు, ఓదనం: అన్నం). ఈ రోజున ప్రదోషంలో శివుని షోడశోపచారాలతో పూజించి, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పసుపు, మిరియాలు, ఉప్పు మొదలైన వాటితో వండిన పులగాన్ని నివేదించాలి. ఈ వ్రతాచరణ వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణోక్తి. అవ్యంగసప్తమీ వ్రతం: శ్రావణశుద్ధ సప్తమి రోజున అవ్యంగ సప్తమీ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతంలో సూర్యుణ్ని షోడశోపచారాలతో పూజించాలి. పూజానంతరం సూర్యుని ప్రీతికొరకు నూలు వస్త్రాన్ని దానంచేయాలి. ఈ వ్రతాచరణవల్ల ఆరోగ్యం చేకూరుతుంది. పుష్పాష్టమీ వ్రతం శ్రావణ శుద్ధ అష్టమి నుండి పుష్పాష్టమీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున పలురకాల పుష్పాలతో శివుణ్ని పూజించాలి. ఆ తరువాత సంవత్సరం పొడవునా ప్రతి నెలలోనూ శుద్ధ అష్టమి రోజు ఆయా నెలలో లభించే పుష్పాలతో శివుని అర్చించాలి. అనంగ వ్రతం: శ్రావణశుద్ధ త్రయోదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్ర తంలో కుంకుమ కలిపిన అక్షతలతోనూ, ఎర్రని పూలతోనూ రతీమన్మధులను పూజించాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు ఈ శ్రావణమాసంలో పర్వదినాలు జులై 30, బుధవారం: నాగచతుర్థి, కొన్ని ప్రాంతాలలో ఈవేళ నాగుల చవితిగా జరుపుకుంటారు. ఆగస్టు 1, శుక్రవారం: నాగపంచమి. సకల శుభకార్యాలకు ఈరోజు మంచిది. ఆగస్టు 6, బుధవారం: శ్రావణ శుద్ధ దశమి. మనిషికి ఉండే ఆశలన్నీ ఈరోజున ఆచరించే వ్రతం వల్ల తీరతాయట. అందుకే దీనికి ఆశాదశమి అని పేరు. ఆగస్టు 7, గురువారం: పుత్రదా ఏకాదశి. ఈరోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహాజిత్తు అనే రాజు సంతానాన్ని పొందాడు కనుక దీనికే పుత్రదా ఏకాదశి అని పేరు. ఆగస్టు 8, శుక్రవారం: దామోదర ద్వాదశి. నేడు శ్రీమహావిష్ణువును దామోదరుని రూపంలో పూజించవలసిన రోజు. ఆగస్టు 10, ఆదివారం: శ్రావణ పూర్ణిమ. యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ నేడు జీర్ణయజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారం. అలాగే సోదరులకు, సోదరవాత్సల్యం కలవారికీ నేడు అక్కచెల్లెండ్లు రక్షాబంధనం కట్టడం పురాణకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఆగస్టు 14, గురువారం: గురురాఘవేంద్రుల జయంతి. గురు రాఘవేంద్రులవారు మంత్రాలయంలో మహాసమాధి పొందిన పుణ్యతిథి ఇది. ఆగస్టు 16, శనివారం: శ్రావణ బహుళ షష్ఠి. దీనికి సూర్యషష్ఠి అని పేరు. ఈరోజున ఆదిత్యహృదయం పారాయణం, సూర్యనమస్కారాలు చేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగి ఆయురారోగ్య ఐశ్యర్యాలు కలుగుతాయని పురాణోక్తి. ఆగస్టు 17, ఆదివారం: శ్రీ కృష్ణాష్టమి. శ్రీమహావిష్ణువు లోకకళ్యాణం కొరకు కృష్ణావతారంలో భూమిమీద అవతరించిన పర్వదినమిది. ఇలా ఒకటేమిటి- అనేకానేక పర్వదినాల మయమైన ఈ మాసంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం, సోమవారాలు ఈశ్వరునికి అభిషేకం చేయించడం, శనివారం నాడు వేంకటేశ్వర స్వామివారికి పిండి దీపారాధన చేయడం శుభఫలితాలనిస్తుంది. లక్ష్మి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. ఆయుష్షు, ఆరోగ్యం, సౌభాగ్యం, ధనం, ధాన్యం, వస్తువులు, వాహనాలు, పశువులు, పంటలు, బంగారం, వెండి, శాంతి, స్థిరత్వం కూడా! కాబట్టి అష్టైశ్వర్యాలను పొందాలనుకునేవారు అమ్మవారి అనుగ్రహం పొందగలగడానికి అనువైన ఈ మాసం రోజులూ అత్యంత నిష్ఠాగరిష్ఠులై, సంప్రదాయబద్ధులై వ్యవహరించాలని శాస్త్రం చెబుతోంది. - డి. కృష్ణకార్తిక