Picasso Artwork
-
బొమ్మల ప్రపంచంలోకి...
ఫ్రెండ్స్, గ్రేట్ పెయింటర్ పికాసో గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆయన మీ గురించి ఏమన్నారో తెలుసా? ‘పిల్లలందరూ చిత్రకారులే!’ అని. మీకు తెలియకుండానే మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారన్నమాట. ఆ ఆర్టిస్ట్‌ను ఈ సెలవుల్లో బయటికి తీసుకువస్తే భలే ఉంటుంది కదూ! మీకో విషయం చెప్పాలి... ‘ఎప్పుడూ కార్టూన్ సీరియల్స్ చూసే బదులు బొమ్మలు వేయడం నేర్చుకోవచ్చు కదా!’ అని మొన్న ఒక అబ్బాయితో వాళ్ల నాన్నగారు అంటే... ‘ఎందుకు టైమ్‌వేస్ట్... ఇలా ప్రాంప్ట్ ఇస్తే అలా బొమ్మలు వచ్చే యాప్స్ చాలా ఉన్నాయి’ అన్నాడట ఆ పిడుగు! మీకు కూడా ‘నిజమే కదా!’ అనిపిస్తుంది. ఇలా ప్రాంప్ట్ ఇవ్వగానే, అలా బొమ్మలు రావడం బానే ఉంటుంది. అయితే మనమే స్వయంగా బొమ్మలు గీయడం వల్ల, బొమ్మలు వేయడం నేర్చుకోవడం వల్ల బో...లెడు ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే...→ కంటితో చూస్తున్నదానికి అనుగుణంగా చేతి కదలికలు (హ్యాండ్ మూమెంట్స్) చేయడానికి మీలాంటి పిల్లలు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. చిత్రకళ ఆ సమస్య లేకుండా చేస్తుంది.→ గీతల లోపల రంగులు వేయడం ద్వారా చేతి–కంటి సమన్వయం(హ్యాండ్–ఐ కోఆర్డినేషన్) మెరుగుపడుతుంది.→ హ్యాండ్–ఫింగర్ స్ట్రెంగ్త్ మెరుగుపడుతుంది.→ స్పాంజ్ ఆర్ట్. వేలితో రంగులు వేయడం, టెక్స్చర్డ్ పేపర్‌ను ఉపయోగించడం ద్వారా స్పర్శజ్ఞానం (టాక్టయిల్ పెర్సెప్షన్) పెరుగుతుంది.→ రకరకాల సైజుల బ్రష్‌లను ఉపయోగించడం వల్ల గ్రిప్ అండ్ కంట్రోల్ పెరుగుతుంది.→ రాయడానికి, పట్టుకోవడానికి, కత్తిరించడానికి... తదితర పనులకు రిస్ట్ స్టెబిలిటీ కావాలి. అడ్డంగా, నిలువుగా బ్రష్‌తో గీతలు గీయడం ప్రాక్టిస్ చేయడం వల్ల రిస్ట్ మజిల్స్ స్ట్రెంతెన్ అవుతాయి.→ చిత్రలేఖనం ఏకాగ్రతను పెంచుతుంది.→ బొమ్మలు గీయడం అనేది కొత్తగా ఆలోచించడాన్ని నేర్పుతుంది. మీరు ఎంపిక చేసుకున్న కలర్స్, బ్రష్ స్ట్రోక్స్, కొల్లాజ్ పీస్ మీలో క్రియేటివిటీని, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తాయి.→ చిత్రకళ మీ దినచర్యలో భాగం అయ్యేలా చూసుకోండి. మీ ఫీలింగ్స్‌ను వ్యక్తీకరించడానికి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు ఆర్ట్ సాధనంగా ఉపయోగపడుతుంది.→ మీలో ఊహశక్తి (ఇమాజినేషన్) విస్తరించడానికి చిత్రకళ ఉపయోగపడుతుంది.ఆల్ఫాబెట్స్‌తో అలవోకగా బొమ్మలే బొమ్మల్!ఆల్ఫాబెట్స్, అంకెలతో స్పీడ్ స్పీడ్‌గా బొమ్మలు గీయడం భలే సరదాగా ఉంటుంది. ‘ఏబిసిడి డ్రాయింగ్’ ‘ఎంటైర్ ఆల్ఫాబెట్ ఏబీíసీ డ్రాయింగ్స్’ ‘హౌ టూ డ్రా విత్ ఆల్ఫాబెట్స్’ ‘ఆల్పాబెట్స్ డ్రాయింగ్స్ ఫర్ కిడ్స్’ ‘ఈజీ డ్రాయింగ్స్ విత్ ఎబిసిడి’ ‘హౌ టు డ్రా ఏ పిక్చర్ ఫ్రమ్ నంబర్ 6’ ‘హౌ టు డ్రా ఎనీథింగ్ ఫ్రమ్ నంబర్స్ ఈజీ’లాంటి వీడియోలు ఎన్నో యూట్యూబ్‌లో ఉన్నాయి.చిన్న వయసులోనే...పెద్ద పేరు!→ అహ్మదాబాద్‌కు చెందిన దుర్వ హిరల్ బ్రహ్మభట్ రెండు సంవత్సరాల ఆరు నెలల వయస్సులోనే కాన్వాస్, కాగితంపై వందకు పైగా చిత్రాలను గీసి రికార్ట్ సృష్టించింది.→ ‘ఆరుషి ఆర్ట్’గా ఫేమస్ అయిన ఆరుషి భట్నాగర్ చిన్న వయసు నుంచి బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. 52 చిత్రాలతో సోలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న ఆరుషి చిత్రకళలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.→ గుజరాత్‌కు చెందిన అవ్యాన్ పటేల్ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో తాను గీసిన 250కి పైగా పెయింటింగ్స్‌తో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన బాలుడిగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.పిల్లలూ... పికాసోఫ్రెండ్స్... పాబ్లో పికాసో చాలా పెద్ద ఆర్టిస్ట్ అనే విషయం మీకు తెలుసుకదా! ‘కళలో స్వచ్ఛత ఉండాలంటే చిత్రకారులలో పసితనం ఉండాలి’ అనేది పికాసో మాట. మీరు (పిల్లలు) అంటే పికాసోకు చాలా ఇష్టం. ఆయన మాటల్లో మీపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. పికాసోకు చిన్నప్పుడు బొమ్మలు గీయడం, పేపర్స్ నుంచి బొమ్మలను కత్తిరించడం అంటే ఇష్టం. క్లాస్‌రూమ్‌లో ఒక మూల కూర్చొని బొమ్మలు వేస్తుండేవాడు! ఎనిమిది సంవత్సరాల వయసులో మొదటి ఆయిల్ పెయింటింగ్ వేశాడు. దీనికి ‘ది లిటిల్ యెల్లో పికాడోర్’ అని పేరు పెట్టాడు. తొమ్మిది సంవత్సరాల వయసులో తనకు ఇష్టమైన పావురాలు, ఎద్దుల పోరాట దృశ్యాలు గీసేవాడు. మనం ఏ రంగంలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నామో...ఆ రంగంలోని పెద్ద వాళ్లపై వచ్చిన పుస్తకాలు లేదా వారు రాసిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. గ్రేట్ ఆర్టిస్ట్ పికాసో గురించి... ఏ లైఫ్ ఆఫ్ పికాసో, పికాసో: ఎ బయోగ్రఫీ, పికాసో క్యూబిజం... మొదలైన పుస్తకాలు ఎన్నో వచ్చాయి.– యాకుబ్ -
లాటరీలో చవకగా పికాసో పెయింటింగ్
పారిస్: అదృష్టం ఉండాలేగానీ సంపద అయినా అంతకంటే విలువైన వస్తువైనా మనల్నే వెతుక్కుంటూ వస్తుందని మరోమారు నిరూపితమైంది. ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో కుంచె నుంచి జాలువారిన కళాఖండాలకు చిత్రకారులు, సంపన్నుల ప్రపంచంలో భలే డిమాండ్ ఉంది. సంపన్నులు మొదలు సాధారణ కళాకారుల దాకా ఎంతో మంది పికాసో ఒరిజినల్ పెయింటింగ్‌లను తమ సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటిది ఒక ఫ్రాన్స్ సేల్స్ ఇంజనీర్‌కు కేవలం 117 డాలర్లకే అంటే 10,915 రూపాయలకే ఏకంగా రూ.9.33 కోట్ల విలువైన పికాసో పెయింటింగ్ దక్కింది. పెయింటింగ్ విక్రయం కోసం దాని యాజమాన్యం చేపట్టిన లక్కీ డ్రాలో 58 ఏళ్ల అరీ హొదారా అనే వ్యక్తి ఈ ‘హెడ్ ఆఫ్ ఏ ఉమెన్’పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నారు. అల్జీమర్స్ వ్యాధి సంబంధ పరిశోధనకు కావాల్సిన నిధుల సమీకరణ కోసం రఫెల్ అనే సంస్థ ఈ పెయింటింగ్‌ను ‘క్రిస్టీస్’అనే వేలంసంస్థకు అప్పగించి అమ్మిపెట్టాలని సూచించింది. లక్కీ డ్రా టికెట్ ధరను 117 డాలర్లు నిర్ణయించారు. మొదారా కొన్న టికెట్‌కే లక్కీ డ్రా తగలడంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ‘‘ఎవరో నన్ను ఆటపట్టించడానికి ఫోన్చేశారనుకున్నా. వేలంసంస్థ ఒకటికి రెండు సార్లు విషయం చెప్పడంతో నాకు ఇది అబద్ధం కాదు అని అర్ధమైంది’’మొదారా తెగ సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా టికెట్ల అమ్మకాల ద్వారా రూ.130 కోట్లు సమకూరాయని రఫేల్ సంస్థ తెలిపింది. పికాసో తన ప్రేయసి డోరా మార్ను ఊహించుకుంటూ విభిన్నంగా 1941లో ఈ పెయింటింగ్వేశారు. -
విశ్వగీతాకారుడు
అక్టోబర్ 25న చిత్రకారుడు పికాసో (1881-1973) జయంతి సత్వం: ‘నా చిన్నప్పుడు మా అమ్మ ఓ మాట అంటుండేది. నువ్వు సైనికుడివైతే జనరల్ అవుతావు. సన్యాసివైతే పోప్ అవుతావు అని. కానీ నేను చిత్రకారుణ్నయి పికాసోనయ్యాను’. తన కొడుకు చాలా పెద్దపేరున్నవాడు అవుతాడని సర్రియలిజంగా చెప్పదలిచిందేమో, పాబ్లోకు డోనా ఇలా నామకరణం చేసింది: పాబ్లితో డీగో జోస్ శాంటియాగో ఫ్రాన్సిస్కో డి పాలా జువాన్ నెపోమ్యూసినో క్రిస్టీస్ క్రిస్పియానో డి లాస్ రెమెడియోస్ సిప్రియానో డి ల శాంటిసియా ట్రినిడాడ్ రూయిజ్ బ్లాస్కో వై పికాసో లోపెజ్. పూర్వీకులు, బంధుమిత్రులు, క్రైస్తవ సన్యాసులు అందరినీ తన పేరులో కలుపుకున్న పికాసో- మాటలు రాకముందే బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. తండ్రి బ్లాస్కోనే తొలిగురువు. బ్లాస్కో పావురాల్ని పెంచేవాడు. వాటిని చూస్తూ కుమారుణ్ని గీయమనేవాడు. స్పెయిన్ సాంస్కృతిక ఉత్సాహంలో భాగమైన గుర్రాల్ని, బుల్‌ఫైట్ దృశ్యాల్ని కొడుక్కు చూపించేవాడు. ఇవన్నీ పికాసో భావి జీవితాన్ని ప్రభావితం చేశాయి. అలాగే తనతో ఆడిపాడిన చెల్లెలి మరణం కూడా! అందుకే దేవుడు దయ్యంగా కనబడటం మొదలైంది. ‘మనం ఏది చిత్రించాలి? ముఖం మీద కనిపిస్తూ ఉన్నదా? ముఖం లోపల ఉన్నదా? ముఖం వెనుక ఉన్నదా?’ పికాసో కౌమారంలోకి అడుగిడగానే జన్మదినకానుకగా, వాళ్ల నాన్న తాను వాడే కుంచెలు, రంగులు, పేలెట్ బహుమతిగా ఇచ్చాడు. బ్లాస్కో మళ్లీ బొమ్మల జోలికి పోలేదు. ‘నా చిన్నప్పుడు మా అమ్మ ఓ మాట అంటుండేది. నువ్వు సైనికుడివైతే జనరల్‌వు అవుతావు. సన్యాసివైతే పోప్ అవుతావు అని. కానీ నేను చిత్రకారుణ్నయి పికాసోనయ్యాను,’ అన్నాడు సగర్వంగా. ‘శాస్త్రం - దాతృత్వం’, ‘తొలి ప్రార్థన’, ‘ముసలి గిటారిస్టు’, ‘పైప్‌తో పిల్లాడు’, ‘అవెన్‌యాన్ వేశ్యలు’ లాంటి ఎన్నో చిత్రాలు గీశాడు. అంతర్యుద్ధ సమయంలో స్పెయిన్ వినాశనాన్ని ప్రతిబింబిస్తూ ‘గుయెర్నికా’ (1937) వేశాడు. ఫ్రాంకో, జర్మన్ మిత్రపక్షాలు గుయెర్నికా అనే పట్టణంపై మూడు గంటలపాటు జరిగిన బాంబులదాడిలో సుమారు రెండువేల మంది చనిపోయారు. ఎడ్లను సైనికులుగా దౌర్జన్యానికీ, గుర్రాలను ప్రజానీకంగా దుఃఖానికీ ప్రతీకలుగా 7.8 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల ఎత్తుతో నలుపు, తెలుపుల్లో వేసిన ఈ పెయింటింగు- ఇరవయ్యవ శతాబ్దపు అత్యున్నత చిత్ర సృష్టిగా ప్రశంసలందుకుంది. అయితే, ఈ ప్రతీకలు విమర్శకులు ఊహించినవే తప్ప పికాసో నిర్ధారించలేదు. ఎద్దు ఎద్దే, గుర్రం గుర్రమే... కళను కళగానే చూడమన్నాడు. పికాసో చిత్రకళను సాధారణంగా ఏడు దశలుగా చెబుతారు. బ్లూ పీరియడ్, రోజ్ పీరియడ్, న్యూడ్, క్యూబిజం, ఆఫ్రికన్ ప్రభావం, క్లాసికల్, సర్రియలిజం. నీలిదశలోని చిత్రాలన్నీ నీలిరంగు నేపథ్యాన్ని కలిగివుంటాయి. ఉదాసీనతకూ, విచారానికీ ప్రతీకగావుండే నీలిరంగులోంచి తర్వాత గులాబీ దశలోకి మరలాడు. ఇదంతా ఉత్సాహపూరిత కాలం. అటుపై తానే మూలస్తంభంగా నిలిచి, ప్రచారంలోకి తెచ్చిన సరికొత్తశైలి క్యూబిజంలోకి వచ్చాడు. ఆఫ్రికన్ కళను అనాగరికంగా భావిస్తున్న రోజుల్లో వారి కళాత్మకతను అర్థం చేసుకుని ఆ ప్రభావంలో గీశాడు. ‘అల్ప కళాకారులు అరువు తెచ్చుకుంటారు; గొప్ప కళాకారులు దొంగిలిస్తారు,’ అని గడుసుగా కూడా ఒక మారు చెప్పుకున్నాడు. ఆయన చిత్రకళలో ఏడు దశలున్నట్టే, ఆయన జీవితంలోనూ ఏడుగురు స్త్రీలున్నారు. పడతులపట్ల తన మోహాన్ని పికాసో ఏనాడూ దాచుకోలేదు. ఫెర్నాండో ఓలివేర్, ఎవా గూల్, మేరీ వాల్టర్, డోరా మార్, జాక్వెలిన్ రోకో... ‘నేను ఎవరితో ఉండాలీ అనే అంశాన్ని తేల్చటం కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవటం నా జీవితంలో అత్యంత మధురమైన సందర్భం’ అని చమత్కరించాడు. కొన్ని గాఢమైన క్షణాలు, తీవ్రమైన కౌగిళ్ల తర్వాత ఆ ప్రేమలన్నీ ఎడబాటుకే దారితీసేవి. వారి ప్రేమకు శాశ్వతత్వం లేకపోయినా, తన చిత్రాల ద్వారా ప్రియురాళ్లకు శాశ్వతత్వం కల్పించాడు. గుయెర్నికాలో డోరా మార్ కనబడుతుంది. ఇంకా ఆయా దశల్లోని చిత్రాల్లో ఆయా కాలాల ప్రేయసులు దర్శనమిస్తారు. చిత్రకళలోనే కాదు, శిల్పంలో కూడా అసాధారణ ప్రతిభను చూపాడు పికాసో. కాగితంపైనే కాకుండా కుండలు, కలప, చర్మం, పింగాణిని కూడా మాధ్యమంగా ఉపయోగించుకున్నాడు. శాంతికి చిహ్నంగా ప్రపంచం గుర్తిస్తున్నది పికాసో పావురాన్నే! ఆయన చిత్రాల్లో అర్థం కానివే ఎక్కువ. ‘సమకాలీన ప్రపంచంలో ఏదీ అర్థం కాదు, మరి అర్థమయ్యే పెయింటింగు నేనెందుకు వెయ్యాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. అయినా ఒక యుగపురుషుని కీర్తి తన జీవితకాలంలోనే వచ్చిపడింది. కోట్లకు పెయింటింగ్స్ అమ్ముడుకావడం మొదలైంది. వేలంవెర్రిగా జనం అభిమానిస్తుండటం చూసి, నా చిత్రాల్లో మీరు ఊహించుకుంటున్నదేదీ లేదు, అని కూడా చిరాకుపడ్డాడోసారి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పికాసో నిరాడంబరంగా బతికాడు. సాదాసీదాగా నిక్కరుమీదే పనిచేసుకునేవాడు. సందర్శకులనూ అలాగే కలిసేవాడు. స్పెయిన్‌లో పుట్టి, ఫ్రాన్స్‌లో స్థిరపడిన పికాసో చిత్రకారుడికి పర్యాయపదంగా నిలిచాడు. ఆయనే అన్నట్టు, ‘కళ ఒక అబద్ధం. అయితే సత్యాన్వేషణలో అది మనకు సాయం అందిస్తుంది.’ ‘ఆత్మమీద పేరుకుపోయిన రోజువారీ జీవితపు దుమ్మూ, ధూళిని పరిశుభ్రం చేస్తుంది’. - ఆర్.ఆర్.


