బొమ్మల ప్రపంచంలోకి... | Easy Summer Painting Ideas For Students | Sakshi
Sakshi News home page

బొమ్మల ప్రపంచంలోకి...

May 9 2026 6:30 AM | Updated on May 9 2026 6:30 AM

Easy Summer Painting Ideas For Students

కిడ్స్‌ కార్నర్‌

ఫ్రెండ్స్, గ్రేట్‌ పెయింటర్‌ పికాసో గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆయన మీ గురించి ఏమన్నారో తెలుసా? ‘పిల్లలందరూ చిత్రకారులే!’ అని. మీకు తెలియకుండానే మీలో ఒక ఆర్టిస్ట్‌ ఉన్నారన్నమాట. ఆ ఆర్టిస్ట్‌ను ఈ సెలవుల్లో బయటికి తీసుకువస్తే భలే ఉంటుంది కదూ! మీకో విషయం చెప్పాలి... ‘ఎప్పుడూ కార్టూన్‌ సీరియల్స్‌ చూసే బదులు బొమ్మలు వేయడం నేర్చుకోవచ్చు కదా!’ అని మొన్న ఒక అబ్బాయితో వాళ్ల నాన్నగారు అంటే... ‘ఎందుకు టైమ్‌వేస్ట్‌... ఇలా ప్రాంప్ట్‌ ఇస్తే అలా బొమ్మలు వచ్చే యాప్స్‌ చాలా ఉన్నాయి’ అన్నాడట ఆ పిడుగు! మీకు కూడా ‘నిజమే కదా!’ అనిపిస్తుంది. ఇలా ప్రాంప్ట్‌ ఇవ్వగానే, అలా బొమ్మలు రావడం బానే ఉంటుంది. అయితే మనమే స్వయంగా బొమ్మలు గీయడం వల్ల, బొమ్మలు వేయడం నేర్చుకోవడం వల్ల బో...లెడు ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే...

→ కంటితో చూస్తున్నదానికి అనుగుణంగా చేతి కదలికలు (హ్యాండ్‌ మూమెంట్స్‌) చేయడానికి మీలాంటి పిల్లలు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. చిత్రకళ ఆ సమస్య లేకుండా చేస్తుంది.
→ గీతల లోపల రంగులు వేయడం ద్వారా చేతి–కంటి సమన్వయం(హ్యాండ్‌–ఐ కోఆర్డినేషన్‌) మెరుగుపడుతుంది.
→ హ్యాండ్‌–ఫింగర్‌ స్ట్రెంగ్త్‌ మెరుగుపడుతుంది.
→ స్పాంజ్‌ ఆర్ట్‌. వేలితో రంగులు వేయడం, టెక్స్చర్డ్‌ పేపర్‌ను ఉపయోగించడం ద్వారా స్పర్శజ్ఞానం (టాక్టయిల్‌ పెర్‌సెప్షన్‌) పెరుగుతుంది.
→ రకరకాల సైజుల బ్రష్‌లను ఉపయోగించడం వల్ల గ్రిప్‌ అండ్‌ కంట్రోల్‌ పెరుగుతుంది.
→ రాయడానికి, పట్టుకోవడానికి, కత్తిరించడానికి... తదితర పనులకు రిస్ట్‌ స్టెబిలిటీ కావాలి. అడ్డంగా, నిలువుగా బ్రష్‌తో గీతలు గీయడం ప్రాక్టిస్‌ చేయడం వల్ల రిస్ట్‌ మజిల్స్‌ స్ట్రెంతెన్‌ అవుతాయి.
→ చిత్రలేఖనం ఏకాగ్రతను పెంచుతుంది.
→ బొమ్మలు గీయడం అనేది కొత్తగా ఆలోచించడాన్ని నేర్పుతుంది. మీరు ఎంపిక చేసుకున్న కలర్స్, బ్రష్‌ స్ట్రోక్స్, కొల్లాజ్‌ పీస్‌ మీలో క్రియేటివిటీని, ప్రాబ్లం సాల్వింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరుస్తాయి.
→ చిత్రకళ మీ దినచర్యలో భాగం అయ్యేలా చూసుకోండి. మీ ఫీలింగ్స్‌ను వ్యక్తీకరించడానికి, క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఆర్ట్‌ సాధనంగా ఉపయోగపడుతుంది.
→ మీలో ఊహశక్తి (ఇమాజినేషన్‌) విస్తరించడానికి చిత్రకళ ఉపయోగపడుతుంది.

ఆల్ఫాబెట్స్‌తో అలవోకగా బొమ్మలే బొమ్మల్‌!
ఆల్ఫాబెట్స్, అంకెలతో స్పీడ్‌ స్పీడ్‌గా బొమ్మలు గీయడం భలే సరదాగా ఉంటుంది. ‘ఏబిసిడి డ్రాయింగ్‌’ ‘ఎంటైర్‌ ఆల్ఫాబెట్‌ ఏబీíసీ డ్రాయింగ్స్‌’ ‘హౌ టూ డ్రా విత్‌ ఆల్ఫాబెట్స్‌’ ‘ఆల్పాబెట్స్‌ డ్రాయింగ్స్‌ ఫర్‌ కిడ్స్‌’ ‘ఈజీ డ్రాయింగ్స్‌ విత్‌ ఎబిసిడి’ ‘హౌ టు డ్రా ఏ పిక్చర్‌ ఫ్రమ్‌ నంబర్‌ 6’ ‘హౌ టు డ్రా ఎనీథింగ్‌ ఫ్రమ్‌ నంబర్స్‌ ఈజీ’లాంటి వీడియోలు ఎన్నో యూట్యూబ్‌లో ఉన్నాయి.

చిన్న వయసులోనే...పెద్ద పేరు!
→ అహ్మదాబాద్‌కు చెందిన దుర్వ హిరల్‌ బ్రహ్మభట్‌ రెండు సంవత్సరాల ఆరు నెలల వయస్సులోనే కాన్వాస్, కాగితంపై వందకు పైగా చిత్రాలను గీసి రికార్ట్‌ సృష్టించింది.
→ ‘ఆరుషి ఆర్ట్‌’గా ఫేమస్‌ అయిన ఆరుషి భట్నాగర్‌ చిన్న వయసు నుంచి బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. 52 చిత్రాలతో సోలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు  చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకున్న ఆరుషి చిత్రకళలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
→ గుజరాత్‌కు చెందిన అవ్యాన్‌ పటేల్‌ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో తాను గీసిన 250కి పైగా పెయింటింగ్స్‌తో సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసిన బాలుడిగా వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

పిల్లలూ... పికాసో
ఫ్రెండ్స్‌... పాబ్లో పికాసో చాలా పెద్ద ఆర్టిస్ట్‌ అనే విషయం మీకు తెలుసుకదా! ‘కళలో స్వచ్ఛత ఉండాలంటే చిత్రకారులలో పసితనం ఉండాలి’ అనేది పికాసో మాట. మీరు (పిల్లలు) అంటే పికాసోకు చాలా ఇష్టం. ఆయన మాటల్లో మీపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. పికాసోకు చిన్నప్పుడు బొమ్మలు గీయడం, పేపర్స్‌ నుంచి బొమ్మలను కత్తిరించడం అంటే ఇష్టం. క్లాస్‌రూమ్‌లో ఒక మూల కూర్చొని బొమ్మలు వేస్తుండేవాడు! 

ఎనిమిది సంవత్సరాల వయసులో మొదటి ఆయిల్‌ పెయింటింగ్‌ వేశాడు. దీనికి ‘ది లిటిల్‌ యెల్లో పికాడోర్‌’ అని పేరు పెట్టాడు. తొమ్మిది సంవత్సరాల వయసులో తనకు ఇష్టమైన పావురాలు, ఎద్దుల పోరాట దృశ్యాలు గీసేవాడు. మనం ఏ రంగంలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నామో...ఆ రంగంలోని పెద్ద వాళ్లపై వచ్చిన పుస్తకాలు లేదా వారు రాసిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. గ్రేట్‌ ఆర్టిస్ట్‌ పికాసో గురించి... ఏ లైఫ్‌ ఆఫ్‌ పికాసో, పికాసో: ఎ బయోగ్రఫీ, పికాసో క్యూబిజం... మొదలైన పుస్తకాలు ఎన్నో వచ్చాయి.

– యాకుబ్‌
 

Advertisement
 
Advertisement
Advertisement