breaking news
PGESET
-
పీజీ సెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, అమరావతి : ఏపీ పీజీ సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షలు జరుగుతాయని పీజీ సెట్ కన్వీనర్ పీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీజీ సెట్ కోసం 13 పరీక్షలు మూడు రోజుల పాటు జరగనున్నాయని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పీజీ సెట్‌కు 28,726 మంది హాజరవుతున్నారని, వీరిలో పురుషులు 16,607, మహిళలు 12,119 మంది ఉన్నారని తెలిపారు. ఉదయం పరీక్ష రాసే వారికి 8:30 నుంచి 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, మధ్యాహ్నం పరీక్ష రాసే వారికి 1:30 వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన తరువాత ఒక నిమషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష రాసే వారు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు. -
పీజీఈసెట్‌లో 85 శాతం మంది అర్హత
* ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ * త్వరలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల ప్రకటన సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్-2016 ఫలితాల్లో 85.01 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో అబ్బాయిలు 85.38 శాతం.. అమ్మాయిలు 84.48 శాతం. గతనెల 30 నుంచి ఈ నెల 3 వరకు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ రీజియన్ సెంటర్లలో పీజీఈసెట్ నిర్వహించారు. మొత్తం 18 వేర్వేరు సబ్జెక్టులకు జరిగిన పరీక్షలకు 41,281 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 35,093 మంది అర్హత పొందారు. పీజీఈసెట్ చైర్మన్ ఇ.సురేష్‌కుమార్, కన్వీనర్ ఎస్.రామచంద్రంతో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం ఫలితాలను విడుదల చేశారు. 17,222 మంది అమ్మాయిలకు 14,550 మంది, 24,059 మంది అబ్బాయిలకు 20,543 మంది పీజీ ప్రవేశాలకు అర్హత పొందారని చెప్పారు. ఫలితాలను www.tspgecet.org, www.osmania.ac.in వెబ్సైట్లలో పొందుపరిచారు. వీటి నుంచి అభ్యర్థులు ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతేడాది సీట్లు ఇలా... రాష్ట్రంలోని వివిధ వర్సిటీలు, అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లో గతేడాది దాదాపు 17,500 సీట్లు ఉన్నాయి. ఇందులో వర్సిటీ కళాశాలల్లో 1,200, కన్వీనర్ కోటా కింద 15,756, మేనేజ్మెంట్ కోటా కింద 500 సీట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది వర్సిటీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుంది. అలాగే కళాశాలల వారీగా ఉండే బ్రాంచ్‌లు, సీట్ల సంఖ్య తేలనుంది. దాదాపు ఇదే స్థాయిలో ఈసారి సీట్లు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం, కో కన్వీనర్ రమేశ్‌బాబు, కోఆర్డినేటర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ‘గేట్’వారికి తొలి ప్రాధాన్యం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ తేదీలను త్వరలో ప్రకటిస్తామని పాపిరెడ్డి తెలిపారు. అలాగే వర్సిటీల వారీగా అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ఖరారయ్యాక అడ్మిషన్ షెడ్యూ ల్, అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యం.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) అభ్యర్థులకు ఉంటుందన్నారు. ఆ తర్వాత పీజీ ఈసెట్‌లో అర్హత సాధించినవారికి సీట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకు 1,700 దరఖాస్తులు గేట్ అభ్యర్థుల నుంచి అందాయన్నారు. కాగా, ఒక్కో సబ్జెక్ట్‌లో 120 మార్కులకు పరీక్ష నిర్వహించారు. గతేడాది కంటే ఈసారి పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం తగ్గాయి. గతేడాది 48,482 మంది పరీక్ష రాయగా.. 88.82 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు.