breaking news
PDP president
-
అంబేడ్కర్ బతికుంటే ఆయననూ బీజేపీ నేతలు దూషించేవారు
శ్రీనగర్: ఆర్టికల్ 370కి అనుకూలంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ నాయకులు విరుచుకుపడడాన్ని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడు మనమధ్య లేరని, ఒకవేళ జీవించి ఉంటే ఆయన పాకిస్తాన్ మద్దతుదారుడంటూ బీజేపీ నాయకులు దూషించేవారని అన్నారు. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం కూలదోసిందని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి: రవిశంకర్ ఆర్టికల్ 370 విషయంలో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఖరేంటో స్పష్టం చేయాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు. దిగ్విజయ్ చెప్పినట్లుగా ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా? అని ప్రశ్నించారు. రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. -
నేడు మెహబూబా ప్రమాణ స్వీకారం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ పదమూడో ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పీడీపీ అధ్యక్షురాలు, దివంగత సీఎం ముఫ్తీ మొహహ్మద్ సయీద్ కుమార్తె అయిన 56 ఏళ్ల మెహబూబా.. రాష్ట్రంలో తొలి మహిళా సీఎంగా, దేశంలో తొలి ముస్లిం మహిళా సీఎంగా చరిత్ర సృష్టించనున్నారు. బీజేపీ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించనున్న ఆమెతో గవర్నర్ వోహ్రా రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయిస్తారు. -
మెహబూబా రాయని డైరీ
అన్నీ ఆర్టికల్ 370 ప్రకారమే జరిగేటట్లయితే నాన్నగారు ఇంకో ఐదేళ్లు బతికి ఉండాల్సింది.. సీయెంగా టెర్మ్ పూర్తయ్యే వరకైనా! రాకపోకలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. రాజ్యాంగం చేతుల్లో ఉంటాయనుకుంటాం కానీ అక్కడా ఉండవు. దేవుడి రాజ్యాంగం దేవుడికి ఉంటుంది. బీజేపీ రాజ్యాంగం బీజేపీకి ఉంటుంది. కశ్మీర్ రాజ్యాంగం కశ్మీర్‌కు ఉంటుంది. ఇన్ని రాజ్యాంగాల మధ్య నాన్నగారు సతమతమై ఉంటారా?! విమానాల రాకపోకల వేళలను సూచించే పట్టికలో లేని విమానం ఒకటి శ్రీనగర్ వచ్చి వెళ్లిందని ఒమర్ ట్వీట్ చేశాడు. అతడు మాట్లాడుతున్నది రాం మాధవ్ ప్రత్యేక విమానంలో మా ఇంటికి వచ్చి వెళ్లడం గురించి. ‘ఆవిడగారు.. బీజేపీతో కలిసి కశ్మీర్లో గవర్నమెంటును ఎలా ఫామ్ చేస్తారు?’ అని ఎవరు కనిపిస్తే వాళ్లను పట్టుకుని అడిగేస్తున్నాడు ఒమర్. ‘అక్కడ జేఎన్‌యూలో మన శ్రీనగర్ ప్రొఫెసర్నీ, మన శ్రీనగర్ స్టూడెంట్స్‌నీ బీజేపీ వాళ్లు దేశద్రోహులుగా ట్రీట్ చేస్తుంటే ఇక్కడ మెహబూబా ముఫ్తీ మేడమ్.. బీజేపీ వేసిన కుర్చీలో కూర్చొని కశ్మీర్‌ని ఏలడానికి సిద్ధమయ్యారు’ అని ట్వీట్లు, మీట్లు పెట్టేస్తున్నాడు! నేను కూర్చున్నది లేదు. కూర్చుంటానని అన్నదీ లేదు. నా ఇంట్లో నేను కూర్చున్నా సీయెం సీట్లో కూర్చున్నట్లే అనిపిస్తున్నట్లుంది ఒమర్‌కి. పోగొట్టుకున్న సీటు కదా.. పాపం అలాగే అనిపిస్తుందేమో మరి. రాం మాధవ్ వచ్చీ రాగానే భారంగా ఒక శ్వాస తీసుకున్నాడు. ‘నాన్నగారు పోయిన బాధ నుంచి బయట పడడానికి ఈ నెలా పది రోజుల సమయం.. చాలినంత వ్యవధి కాకపోవచ్చు కానీ, రాజకీయంగా దీనినొక సుదీర్ఘమైన విరామంగానే మనం భావించాలి. ప్రజలు వినియోగించుకున్న ఓటు హక్కును ఇంకా ఎంతకాలమిలా గవర్నరు చేతిలో పెడతాం చెప్పండి?’ అన్నాడు. నిర్ణయానికి నేను తీసుకున్న వ్యవధి కన్నా, నన్నొక నిర్ణయం తీసుకోమని ఆయన చెప్పిన విధానమే లెంగ్త్ ఎక్కువగా ఉంది. ఆలోచించుకోనివ్వండి అన్నాను. ‘త్వరగా ఆలోచన ముగించండి’ అని ఫ్లైట్ ఎక్కేశాడు. నా ఆలోచనంతా బీజేపీ గురించే. నా పని నన్ను చేయనిస్తుందా? నేనూ ఒక చెయ్యేస్తానంటూ వస్తుందా? ఇంటికి వచ్చిన వాళ్లకు ‘టీ’ అయినా ఇవ్వనిస్తుందా? సెపరేటిస్టులతో మనకేంటి పిచ్చాపాటీ అంటుందా? ఆర్టికల్ త్రీ సెవన్టీని అవసరమైనప్పుడైనా చదవనిస్తుందా? ‘అదెందుకు పక్కన పడేయ్.. వి ఆర్ ఆల్ ఇండియన్స్’ అంటుందా? అన్నీ సందేహాలే! గోడపై నాన్నగారి ఫొటో వైపు చూశాను. మోదీజీ చేతుల మధ్య గాఢమైన ఆలింగనంలో చిరునవ్వు నవ్వుతూ ఉన్నారాయన. నాన్నగారు ప్రమాణ స్వీకారం చేశాక మోదీజీ ఆత్మీయంగా ఆయన్ని హత్తుకున్నప్పటి ఫొటో అది. కానీ నాన్నగారు చనిపోయినప్పుడు మోదీజీ రాలేదు! చూడ్డానికి రాలేదు. సానుభూతికీ రాలేదు. పరామర్శకూ రాలేదు. రాజకీయాలకు మాత్రమే విలువిచ్చే ఈ పెద్ద మనిషి.. రేపు నేను సీయెం అయ్యాక కశ్మీర్ ప్రజల మనోభావాలకు విలువను ఇవ్వనిస్తాడా?! మాధవ్ శింగరాజు