రాష్ట్రానికంతటికీ కడప పెరటికోళ్లు
కడప అగ్రికల్చర్ : రాష్ట్రానికంతటికీ సరిపడేలా పెరటికోళ్లు వైఎస్సార్ జిల్లా కడప నుంచి ఉత్పత్తి చేయడానికి అనుకూల వాతావరణం ఉందని, అయితే ఇంకా విస్తరించి ఉత్పత్తిని పెంచే మార్గాలు ఆలోచిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ సోమశేఖరం అన్నారు. శుక్రవారం జిల్లా సందర్శనకు వచ్చిన డైరెక్టర్ ఊటుకూరులోని పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఊటుకూరులో ఉన్న పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రం పిల్లలను ఉత్పత్తి చేయడానికి వనరులు పూర్తిస్థాయిలో సమకూర్చుతామన్నారు. విడతల వారీగా పిల్లలను అన్ని జిల్లాలకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. పెరటికోళ్ల పెంపకంపై గ్రామీణ ప్రజలు మక్కువ పెంచుకున్నారని, చిన్న కుటుంబాలకు ఇది మంచి ఆదాయ వనరుగా ఉందన్నారు. నిరంతరాయంగా పిల్లల ఉత్పత్తి చేపట్టాలని ఆదేశించారు. పశువైద్యానికి నిధుల కొరత లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశుమిత్రల వ్యవస్థను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పశుగ్రాసాన్ని దుబారా చేయకుండా పొదుపు పద్ధతులు అందుబాటులో ఉన్నాయన్నారు. పశువుల్లో సంకరజాతి దూడలను పుట్టించడానికి గర్భధారణ సూది మందు (పశువుల వీర్యం) 15వేల డోసులు దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఉపాధి ప«థకంలో పశుగ్రాసాల పెంపకం చేపట్టాలని ప్రభుత్వానికి నివేదికలు పంపామని తెలిపారు. కొత్తగా 600 పోస్టులు రాష్ట్రంలో భర్తీ చేయనున్నామన్నారు. గాలికుంటు రహిత రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు వచ్చిందన్నారు. దీంతో పశువుల ఉప ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. వచ్చేనెల 15వ తేదీ నుంచి దూడలను పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి, వాటిని ఇక్కడ స్పెషల్ ప్యాకేజీలో పంపిణీ చేస్తామన్నారు. అనంతరం పశుగణాభివృద్ధి కేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా జేడీ వెంకట్రావు పాల్గొన్నారు.