breaking news
pasham srinu
-
నయీం అనుచరుల లొంగుబాటు
నల్లగొండ: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకులు పాశం శ్రీను, సుధాకర్ శుక్రవారం నల్లగొండ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిపై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ తమను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై సుమారు 100 కేసులున్నట్లు సమాచారం. మావోయిస్టు కొనాపూరి సాంబశివుడు, రాములు హత్యకేసుల్లో వీరిద్దరు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. కాగా సుధాకర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి జడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాశం శ్రీను, సుధాకర్‌లు మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నేత నయీంకు ముఖ్య అనుచరులుగా ఉన్నారు. -
పాశం శ్రీను అదృశ్యంపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకుడు పాశం శ్రీను అదృశ్యంపై ఆయన భార్య నళిని బుధవారం హెచ్చార్సీని ఆశ్రయించింది. పాశం శ్రీనుపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో భువనగిరి డీఎస్పీ, సీఐ, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, విరసం నేత వరవరరావులపై శ్రీను కుటుంబసభ్యులు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కలగజేసుకుని తన భర్త ఆచూకీ తెలపాలని నళిని కోరింది. కాగా కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో శ్రీను మృతిచెందినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాగా, స్థానిక ఆస్పత్రికి ఆదివారం గుండెపోటుతో పాశం శ్రీను అనే వ్యక్తి వచ్చాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో వేరే ఆస్పత్రికి పంపించినట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్న పాశం శ్రీను మృతిపై ఎటువంటి సమాచారం లేదని భువనగిరి పోలీసులు తెలిపారు.